బిగ్ స్క్రీన్ పై ఓ అత్యద్బుత వీడియో గేమ్! కలలాంటి… ఓ విజువల్ వండర్!!
కల్కి 2898 అనే సైన్స్ ఫిక్షన్ సినిమా కచ్చితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనాస్థాయిని ఎంత గ్రాండ్ గా ఉందో పట్టిచూపించేదే. ఇది నిర్వివాదాంశం. పైగా సినిమాలో చిరంజీవైన అశ్వత్థామ వంటి మరణం లేని మహాభారత పాత్రను ఎంచుకుని… కలికాలపు కల్కిని కాపాడేందుకు పెట్టిన లింక్ ఆయన థాట్ ప్రాసెస్ లో ఓ గొప్ప విశేషం. అంతేకాదు, ఇండియన్ డైరెక్టర్సూ.. మార్వెల్ వంటి సినిమాలను అలవోకగా తీయగల్గే సత్తా ఉన్నది నిరూపించగల్గాడు. ఇదంతా ఓకే.
కానీ, కల్కి చూస్తున్నంతసేపు.. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో నాకైతే పిల్లలు ఇంట్లో ఆడుతుంటే… ఊరికే అదేం వీడియో గేమ్స్ ఏం పన్లేదా అని తిడుతుంటాం కదా.. ఆ భావన.. అంతకుమించి వెళ్లిపోదామా.. మొత్తం సినిమా భరించగలమా అనే భావనా కల్గింది. ఆ ప్రభాస్.. అతడికి ఎల్లవేళలా ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉరఫ్ బుజ్జి ఎపిసోడ్.. నాగ్ అశ్విన్ థాట్ ప్రాసెస్ లో కాంప్రమైజ్ అయ్యాడా అలాంటి ఎపిసోడ్స్ లో అనిపించింది.
Ads
ద్వాపరయుగాంతంలో.. కురుక్షేత్ర యుద్ధమనంతరం శ్రీకృష్ణుడి శాపంతో.. ఆరువేల ఏళ్ల తర్వాత క్రీస్తుశకంలో జన్మించబోయే కల్కిని కాపాడి శాపవిమోచన పొందే ఓ కాపలాదారుగా అశ్వత్థామ క్యారెక్టర్ ను ఎంచుకోవడంతోనే నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్ నెస్ ప్రశంసలు పొందింది. ఆ క్రమంలో సుప్రీం యాస్కిన్ తో జరిగే యుద్ధంలో మహాభారతంలోని కర్ణుడి క్యారెక్టర్ కు, భైరవ అనే క్యారక్టర్ తోపెట్టిన లింక్… కౌరవుల పుట్టుక నేపథ్యాన్ని తీసుకుని వంద మంది కౌరవుల మాంసపు ముద్దలు నేతికుండల్లోంచి బయటకొచ్చిన అంశాలను స్ఫురణలోకి తెచ్చుకున్నప్పుడు.. ప్రాజెక్ట్ కే పేరుతో సీరమ్ సేకరణ వంటి ఆలోచనతో మరింత యవ్వనస్తుడయ్యే సుప్రీం యాస్కిన్ అనే పాత్ర చిత్రణ.. కచ్చితంగా సినిమాకు ముందు కురువంశ నేపథ్యంపై చేసిన సీరియస్ స్క్రిప్ట్ వర్క్ ను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి దర్శకుల అవసరం ఇండియన్ సినిమాకుందనిపిస్తుంది.
జస్ట్ డ్రాప్ సీరమ్ కే ముదిమి వయస్సులో ఉన్న యాస్కిన్ అలాంటి యవ్వనాన్ని పొంది.. అప్పటికే ఎవ్వరూ ముట్టుకోలేని గాండీవాన్నెత్తి.. వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయనే సన్నివేశంతో.. అసలు యాస్కిన్ క్యారెక్టర్ పై మరింత ఉత్సుకత పెంచాడు. పార్ట్ 2లో ఏం జరుగుబోతోందనే ప్రశ్నతో థియేటర్ నుంచి పంపించే యత్నం చేశాడు నాగ్ అశ్విన్. అయితే ఇంత సృజనాత్మకమైన ఆలోచనలతో స్క్రిప్ట్ తయారు చేసుకున్న తరుణంలో… అదే హీరో ప్రభాస్, తనకు తోడు బుజ్జి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పరమ బోర్ ఎపిసోడ్ రన్నింగ్ అనేది తాను ఏ స్థాయిలోనైతే సైన్స్ ఫిక్షన్ ను చూపించాలనుకున్నాడో.. దానికి కొంత అవరోధంలా కనిపించింది. అక్కడ మరింత జాగ్రత్త పడితే బాగుండుననిపించింది.
ఎప్పుడో ఆరువేల ఏళ్ల తర్వాత క్రీస్తుశకంలో భూమండలమంతా సర్వనాశనమై.. భూమ్మీదే మొదటి నగరంగా చెప్పుకునే కాశీలో తాగడానికి నీళ్లు, పీల్చడానికి సరైన గాలి లేని వాతావరణంలో మనుషులను చూపిస్తాడు. దానికి భిన్నంగా.. అంటే ఫుల్ కాంట్రాస్ట్ లో లోనికి అడుగు పెట్టాలంటే మిలియన్ యూనిట్స్ ఉంటే తప్ప వెళ్లలేని.. వెళ్లాలని జనం తపన పడే కాంప్లెక్స్ అనే మరో కొత్త ప్రపంచానికి ముడిపెట్టడం… బాస్ యాస్కిన్ అరాచకత్వం.. యాస్కిన్ అన్యాయాలపై శంబాలా అనే ప్రాంతంలో ఉన్న రెబల్స్ తిరుగుబాటు.. ఇవన్నీ ఒక పద్ధతిగానే దర్శకుడి ఆలోచనలుగా ప్రతిబింబించినా.. వాటిని గుదిగుచ్చే క్రమంలో మాత్రం జనసామాన్యానికి, మహాభారత పర్వంపై అంతగా అవగాహన లేనివారికి సులభంగా అర్థమైందా, కనెక్ట్ అయిందా.. లేక సినిమా అంతా ఓ మయసభలా కనిపించిందా అనేది మాత్రం సినిమా చూసిన తర్వాత నాకైతే కల్గిన మెయిన్ డౌట్.
అలాగే, అశ్వత్థామ అనే క్యారక్టరే కల్కి సినిమాకు బలం. కాబట్టి, ఆబ్వియస్ గా అశ్వత్థామ క్యారెక్టర్ పోషించిన వ్యక్తి అమితాబ్ కావడం… తన పాత్ర ఎలివేషనూ అదే స్థాయిలో కనిపించడంతో.. హీరో ప్రభాస్ కన్నా ఎక్కువ ఫోకస్ లోకి అమితాబ్ పాత్ర వచ్చేసింది. మరో విషయమేంటంటే… పార్ట్ 2లో సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసనే ఉండి.. ఆయన క్యారెక్టర్ కు ఇంకా బలమైన పాత్ర ఉంటే గనుక పార్ట్ వన్ లో ఆయనది చిన్నపాటి పాత్రే అయినా ఓకే అనుకోవచ్చు. లేకపోతే మాత్రం ఆ పాత్రకు కమల్ హాసన్ అంతటి ఆర్టిస్ట్ అవసరమా అనేది మరో ప్రశ్న…? ఇక మిగిలిన పాత్రల విషయానికొస్తే ఖేరా పాత్రలో అన్నాబెన్ ఆకట్టుకుంటుంది.
నటులు దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ దేవరకొండ, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, పశుపతి, దిశాపటానీ, మృణాళ్ ఠాకూర్, కీర్తి సురేష్ వంటి వారితో పాటు… ది గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అలా మెరిసి వెళ్లిపోయినా… అలాగే, ప్రముఖ దర్శకుడు రాజమౌళి అలా కనిపించి మాయమైనా.. సినిమాలో వారి ఆగమనాన్ని జనం ఎంజాయ్ చేశారు.
ఇక సాంకేతికంగా గ్రాఫిక్స్ వర్క్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉండగా.. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ ఆ తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తాయి. సంతోష్ నారాయణన్ సంగీతం నేపథ్యంలో కాస్త పర్లేదనిపించినా… పాటల విషయంలో మాత్రం పూర్తిగా మైనస్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు సంగీతం విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ ది ముమ్మాటికీ రాంగ్ చూజింగ్ అనిపించింది. ఓవరాల్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హాలీవుడ్ ను తలపించే, మరిపించే ఓ మార్వెల్ ను మన భారతీయ దర్శకుడు.. అదీ మన తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించడం మాత్రం మనకు తప్పకుండా గర్వకారణం. ఇదో విజువల్ ఫీస్ట్.
టైం ట్రావెలింగ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే నాగ్ అశ్విన్.. ఇంత భారీ ప్రాజెక్ట్ తో సైన్స్ ఫిక్షన్ తీస్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్ టచ్ మరింతగా సినిమాలో ఉండేలా చూసుకోవడం… సామాన్య జనానికి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సులభంగా అర్థమయ్యే ప్రజెంటేషన్ చేయగల్గడమనే వాటిపై మరింత కాన్సంట్రేట్ చేసుంటే.. ఇంకా బాగుండేదనేది ఓ వీక్షకుడిగా నా అభిప్రాయం. మొత్తానికి రేపటి కోసం అంటూ.. భూత, భవిష్యత్తుల లింక్ అప్ అనే ఎలిమెంట్ భలే నచ్చింది. అలాగే, కర్ణ వర్సెస్ అర్జున అనే టాపిక్ ను మరోసారి తన సినిమా హైప్ తో చర్చకు పెట్టి.. పురాణేతిహాసాలపై అంతగా ఆసక్తి లేనివారికి లో కూడా క్యూరియాసిటిని పెంచాడు.
అయితే, ఈటైం ట్రావెలింగ్ సినిమాల్లో ఇప్పటికీ నాకు నచ్చింది సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 సినిమానే అనేది నా నిశ్చితాభిప్రాయమైతే… ఇంతకుమించి బుర్ర ఎదగలేదనుకునేవారికి ఓ దండం….. By రమణ కొంటికర్ల
Share this Article