కల్కి సినిమా రాబోతోంది… అది ప్రభాస్ సినిమా అని కాదు… అమితాబ్, కమలహాసన్, దీపిక పడుకోన్ సినిమా అని కాదు… హిందీ, తమిళ, కన్నడ, తెలుగు తదితర భాషల్లో థియేటర్లు కొన్ని నెలలుగా నిర్మానుష్యంగా ఉంటున్నాయి… ఇదిలాగే కొనసాగితే ఇండస్ట్రీ మరింత సంక్షోభంలోకి పడిపోయే ప్రమాదం…
ఈ స్థితిలో ఈ పాన్ వరల్డ్ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ సంపాదించినా అది ఇండస్ట్రీకే మేలు… అందుకే అందరి దృష్టీ దీనిపైనే… తమిళనాడు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటికే ముందస్తు టికెట్ల అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి… సరే, వాటి సంగతి ఎలా ఉన్నా… కొన్ని విశేషాలు మాత్రం చెప్పుకోవాలి… కథ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం…
Ads
టెక్నాలజీ… అందుబాటులో ఉన్న అన్నిరకాల కొత్త టెక్నాలజీని వాడుకున్నారు ఈ సినిమాకు… కొన్ని టెక్నాలజీలు తొలిసారిగా… 6.5 కే క్వాలిటీ పిక్చర్… అంటే ఐమ్యాక్స్ థియేటర్లలో పెద్ద తెరల మీద చూసినప్పుడు ఈ క్వాలిటీ ఓ కొత్త అనుభవాన్ని ఇస్తుంది… 2డీ, 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లు సరే… విదేశాల్లో 4డీఎక్స్‌లోనూ విడుదల చేస్తున్నారు…
4 డీఎక్స్… అంటే త్రీడి సినిమాకు ఇంకాస్త ఫర్దర్ స్టెప్… థియేటర్లలో సీన్లను మరింత అనుభూతికి లోనయ్యేలా సీట్ల కదలికలు, గాలులు, పరిమళాలు ఎట్సెట్రా జోడిస్తారు… కాకపోతే ఈ టెక్నాలజీతో ఇండియాలో ఈ సినిమాను చూడలేం…
ఈ సినిమాలో ప్రధానపాత్రగా భావిస్తున్న బుజ్జి అనే కారును 4 కోట్ల ఖర్చుతో సపరేటుగా రూపొందించారు… దీనికి కీర్తిసురేష్ డబ్బింగ్ మరో విశేషం… ఇందులో మూడు ప్రపంచాలను చూపిస్తారు కదా… నిర్జీవంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచం, అన్ని సౌకర్యాలున్న కాంప్లెక్స్, శరణార్థులుండే శంబలా ప్రపంచాలు… వీటి కోసం వీఎఫ్ఎక్స్ విపరీతంగా ఉపయోగించారు… దాదాపు 700 షాట్స్…
హాలీవుడ్ కోసం పనిచేసే మేకప్ ఆర్టిస్టులు మాత్రమే కాదు… రకరకాల అత్యున్నత టెక్నాలజీతో సీన్ల చిత్రీకరణకు హాలీవుడ్ వృత్తి నిపుణులు పనిచేశారు… దీపిక పడుకోన్ తొలి తెలుగు సినిమా… చాలా ఏళ్ల తరువాత శోభన కనిపిస్తోంది… మహానటిలో కనిపించినట్టుగానే కొందరు సర్‌ప్రయిజుగా స్టార్లు కనిపిస్తారంటున్నారు…
600 కోట్ల భారీ చిత్రం… ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న తొలి ఇండియన్ సినిమా… దీనికి యారి అలెక్స్ 65, యారి డీఎన్ఏ లెన్స్ గట్రా ఉపయోగించారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే అశ్వినీదత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు… ఈ విశేషాలను పరిగణనలోకి తీసుకుంటే నిజంగా ప్రభాస్ వెరీ వెరీ లక్కీ హీరో…
మొదటిరోజే 200 కోట్ల కలెక్షన్ల మార్క్ సాధిస్తుందని ఓ అంచనా… ఇది మరీ అతిశయోక్తిలా అనిపించినా సరే… అంత రాకపోయినా సరే… తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించబోయే సినిమాగా రికార్డ్ సృష్టించబోతోంది… సినిమాల్లో ప్రయోగాలకు పేరొందిన సింగితం శ్రీనివాసరావు కూడా దీనికి సహకారం అందించాడు…
అన్నింటికీ మించి… విశ్వవీథుల్లో తెలుగు సినిమా జయపతాక అంటే కేవలం రాజమౌళి మాత్రమే కాదు… హాలీవుడ్ స్థాయి సినిమా తీసి చూపించడానికి మరో దర్శకుడు ఉన్నాడు అని చెప్పగల సినిమా… తన పేరే నాగ్ అశ్విన్..! పాపం శమించుగాక… టాక్ ఎలా వచ్చినా సరే, ఒకసారి థియేటర్ వెళ్లి చూసిరాదగిన సినిమా అని మాత్రం చెప్పొచ్చు… పైన చెప్పిన అన్ని విశేషాలున్నాయి కాబట్టి..!!
చివరగా ఓ దిష్టితీత…. తమిళులు తమ సినిమాల్ని తప్ప మరే భాష సినిమాను ఆహ్వానించరు తెలుసు కదా… ఆ ‘సువిశాల హృదయాలను’ వదిలేస్తే, తెలుగు సినిమా పల్స్ తెలిసేది విజయవాడ… సినిమా ప్రదర్శనలకు అడ్డా… మరి అక్కడ కల్కి బుకింగ్స్ ఎందుకు పూర్‌గా ఉన్నాయనేది ఎవరికీ అంతుపట్టని ఓ ధోరణి… ఎందుకబ్బా..!!
Share this Article