.
బతుకమ్మా! బ్రతుకు!
బంధు మిత్రులందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో… కాళోజీ నారాయణరావు గారు 1966 బతుకమ్మ పండగ సందర్భంలో రాసిన గేయం…
Ads
గుమ్మడిపూలు పూయగ బ్రతుకు
తంగెడి పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు
అమ్మను మరవ సంతానము కని
బతకమ్మా! బ్రతుకు..బతకమ్మా! బ్రతుకు…
పచ్చని పసరిక బయళ్ల బ్రతుకు
పల్లె పట్టుల పంటల బ్రతుకు
పసుపుతోట మరియాదగ బ్రతుకు
పున్నమి వెన్నెల మాదిరి బ్రతుకు
బతకమ్మా! బ్రతుకు…
మూడుముళ్ల బిగియింతల పద్దుల
జంట బ్రతుకు తాహత్తుల హద్దుల
మమతల, మమతల పెంచెడి సుద్దుల
తీరుతీరు చవులూరెడి చద్దుల
బతకమ్మా! బ్రతుకు…
పసుపు కుంకుమల వసతుల తేలుచు
పారాణిలో మారాణిగ పారుచు
ఆలమంద గొంతుల అంబాడుతు
దాంపత్యపు దివ్వెల వెలయించుచు బతకమ్మా! బ్రతుకు…
తండ్రుల తాతల జేయుచు మురియుచు
కొడుకుల తండ్రుల జేయుచు వెలయుచు
అమ్మల అవ్వల జేయుచు కాయుచు
బిడ్డల తల్లుల జేయుచు సాకుచు
బతకమ్మా! బ్రతుకు…
నొసటి కుంకుమల తళుకుల నీనుచు
మంగళసూత్రము వలపుల పేనుచు
గాజుల గలగల నవ్వుల తేలుచు
కాలి మట్టియల పలుకుల కులుకుచు బతకమ్మా! బ్రతుకు…
మక్కలరాసుల పసిడిగ బ్రతుకు
గేగుల కండల జవగా బ్రతుకు
సీతాఫల కనుగ్రుడ్డుగ బ్రతుకు
పాలుపట్టి గింజూరగ బ్రతుకు
బతుకమ్మా! బ్రతుకు…
నల్లపూసల నడుమనె బ్రతుకు
పాలతిన్నియల దాపునె బ్రతుకు
నొసటి మధ్య మందారమ! బ్రతుకు
కాళ్ల పసుపు పారాణీ! బ్రతుకు
బతకమ్మా! బ్రతుకు…
పాటపాడి పాటల పాడిస్తూ
ఆటలాడి ఆటల ఆడిస్తూ
జంటగూడి జంటల కూరుస్తూ
బతుకు బ్రతికి బతుకుల బ్రతికిస్తూ
బతకమ్మా! బ్రతుకు…
చెలిమి చెలమలు ఊరేదాకా
చెలిమి కలుములు నిలిచే దాకా
చెలిమి వెన్నెలలు కాసేదాకా
చెలిమి రాగములు ఒలికేదాకా
బతకమ్మా! బ్రతుకు…
మన్నూ మిన్నూ ఉండే దాకా
సూర్యుడు చంద్రుడు వెలిసే దాకా
చుక్కలు మింటిలో కులికే దాకా
కాలచక్రము తిరిగే దాకా
బతకమ్మా! బ్రతుకు…
అమ్మను మరవని సంతానము కని బతకమ్మా! బ్రతుకు…
కందుకూరి రమేష్ బాబు సామాన్యశాస్త్రం గ్యాలరీ
Share this Article