.
మొన్నటి నుంచీ ఈ వార్త రాయనివాడు లేడు… ప్రభాస్ కొత్తగా హైదరాబాదులో కడుతున్న ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షం తీసుకొచ్చి పెట్టారట… 100 సంవత్సరాల వయస్సు అట దానిది… దేశంలో ముఖేష్ అంబానీ ఇంట్లో ఉంది, ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో…
అదేదో యూట్యూబ్ టీవీ చానెల్ ఫలానా వ్యక్తి దగ్గర ఈ కల్పవృక్షాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రభాస్ ఇంట్లో పెట్టాడు అని ఓ ఇంటర్వ్యూ వదిలింది… యూట్యూబ్ చానెళ్ల వార్తలు ఎలా ఉంటాయో తెలుసు కదా…
Ads
ఇన్నేళ్లుగా ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా గురించి కొన్ని వేల వార్తలు చదివి ఉంటామేమో… ఆ 27 అంతస్థుల భవనంలో మరి ఈ కల్పవృక్షం ఎక్కడ నాటారో మాత్రం ఏ వార్తలోనూ లేదు… వినలేదు, చూడలేదు, చదవలేదు… ఏమో, బహుశా ముఖేష్ అంబానీకి కూడా తెలిసి ఉండదు..!!
ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో నిజంగా ఓ చెట్టు పెడుతున్నారా..? ఏమో, తెలుగు వార్తలు ఊదరగొడుతున్నాయి… రకరకాల అతిశయోక్తులు, గాలి పోగేసి మరీ రాస్తున్నారు… అవునూ, నిజంగా కల్పవృక్షం అంత అరుదైనదీ అయితే, జస్ట్, కోటి రూపాయలకే దొరికే పక్షంలో… ఆ ఖరీదు పెట్టి ఆ చెట్టు నాటించుకునేవాళ్లు ఈ దేశంలో, అంతెందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే బోలెడుమంది…
సదరు యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన పెద్ద మనిషి దగ్గర నాలుగు ఉన్నాయట, 50 ఏళ్ల యంగ్ కల్పవృక్షం కూడా ఉందట… ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పడు… రకరకాల రసాయనాలు పోసి, దాన్ని నిద్రావస్థలోకి తీసుకెళ్లి, ఇక్కడికి తీసుకొచ్చాడట… సరే, పెద్ద పెద్ద చెట్లను కూడా వేళ్లతో సహా వేరే ప్రదేశాలకు తరలించడం కొత్తదేమీ కాదు…
అయితే అది కల్పవృక్షమని నిర్ధారణ ఏమిటి..? ఇదీ అసలు ప్రశ్న… ఎందుకంటే..? కల్పవృక్షం బొటానికల్ నేమ్ అని గూగుల్‌ను అడిగి చూడండి… ఓ పేరు వస్తుంది… దాన్ని తెలుగులోకి అనువాదం చేయమనండి… చూడండి ఓసారి… మీకు అర్థమైపోతుంది… పోనీ, ఏదైనా ఎఐ ప్లాట్‌ఫామ్‌కు ఓ ప్రశ్న వేయండి, కల్పవృక్షం కల్పనా..? నిజమా..? అని…
- ఏం చెబుతుంది..? ‘‘కల్పవృక్షం అనేది హిందూ పురాణాలలో ఒక కోరికలు తీర్చే చెట్టు, ఇది నిజం కాదు, ఒక కల్పన. ఇది కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే. కల్పవృక్షం హిందూ, జైన, బౌద్ధ మతాలలో కనిపిస్తుంది, ఇది కోరికలను తీర్చే దైవిక వృక్షంగా చెప్పబడుతుంది..’’ అర్థమైంది కదా…
నిజంగా కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాల ఉనికే నిజమయ్యే పక్షంలో… వాటిని అర్జెంటుగా కొనేసి, తమ ఇంటి పెరట్లలో, ఫామ్‌హౌజుల్లో పాతించుకోగలిగిన వాళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది మన దేశంలో… ప్రత్యేకించి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, మాఫియా లీడర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, జనాన్ని-ఖజానాల్ని ముంచేసే అవినీతిపరులు ఎట్సెట్రా…
అవునూ, ఫాఫం ప్రభాస్‌కైనా తెలుసో లేదో ఇంకా… తన కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షం నాటించినట్టు… వార్తలు చదివి, చూసి అవునా, నిజమా అనుకుంటూ ఉంటాడేమో బహుశా..!! అన్నట్టు సదరు కోటి రూపాయల కల్పవృక్షాలు అమ్మే వృక్షవ్యాపారి అడ్రెస్ ఏమిటో సదరు యూట్యూబ్ చానెల్ ఇచ్చి ఉంటే… కొత్తగా బోటనీలో గ్రాడ్యుయేట్‌ను ఎవరినైనా పంపిద్దాం… దాని బొటానికల్ నేమ్, దాని వయస్సు, దాని కథంతా చెబుతాడు… ఖాయం..!! కోరిన కోరికలు తీర్చే, శక్తులను ప్రసాదించే అంతటి మహత్తు చెట్లను ఆయన ఎందుకు అమ్ముకుంటున్నట్టో..!! అంతా మాయ…
- సెర్చుతుంటే మరో వీడియో కనిపించింది… నైమిషారణ్యంలో దధీచ్‌కుండ్‌లో ఉందట, వచ్చి స్పర్శించండి, ఆలింగనం చేసుకొండి, మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది… అని క్లాస్ పీకుతున్నాడు ఒకాయన… కల్పవృక్షం కూడా దేవుడే… అంటే నమ్మకం… ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు..!!
Share this Article