.
ఎర్రగడ్డకు దారేది? ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది ఒక స్థాయి పిచ్చి . మానసిక వైద్యులు నయం చేయగలమనుకునేది తరువాత స్థాయి పిచ్చి . నిజానికి ఎవరూ నయం చేయలేనిదే అసలయిన పిచ్చి .
ఇది అమూర్తం . మాటలకు అందీ…అందదు . చూపులకు కొద్దిగా అందుతుంది . చేష్ఠలకు దాదాపుగా దొరికిపోతుంది . పంటికి పళ్ల డాక్టరు , కంటికి కళ్ల డాక్టరు ఉన్నట్లు పిచ్చికి పిచ్చి డాక్టరు ఉంటాడు .
Ads
భాషాపరంగా పిచ్చి డాక్టరుకు రెండు అర్థాలు . పిచ్చిని నయం చేసే డాక్టరు అన్నది సాధించాల్సిన అర్థం . డాక్టరే పిచ్చివాడయినప్పుడు అర్థం సాధించాల్సిన పనిలేకుండా పిచ్చే డాక్టరును సాధిస్తుంది . పిచ్చిని కొలిచే పరీక్షలు పిచ్చి పరీక్షలు అంటే చిన్నయసూరికి కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు .
అంతమాత్రం చేత మనం మామూలుగా చేయించుకునే పరీక్షలు పిచ్చివి కాకుండాపోవు . ఇవి మామూలు పిచ్చి పరీక్షలు ; అవి పిచ్చ పిచ్చి పరీక్షలు అనుకుంటే మన ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీలేదు .
మనోరోగానికి మందులేదు – అన్నసామెతను రూపుమాపడానికి పిచ్చిని నయం చేసే డాక్టర్లు పిచ్చి పిచ్చిగా ప్రయత్నిస్తుంటారు . ఫలితం పిచ్చి తగ్గి పిచ్చిరహిత లోకంలో జనజీవనస్రవంతిలో తిరుగుతున్న వారెవరయినా చెబితే తప్ప మనకు తెలియదు .
వేపకాయంత వెర్రి అందరికీ ఉంటుందని కూడా తెలుగులో పాపులర్ సామెత . ఈ సామెతమీద గుమ్మడి కాయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి . పూర్వం ఎప్పుడో పాత రాతియుగం నాడు వేపకాయంతే , ఇప్పుడది పెరిగి పెరిగి అందరిలో గుమ్మడికాయంత వెర్రిగా బుర్రలో గూడు కట్టుకుందట . గుమ్మడికాయల . . . అనగానే ఇప్పుడు భుజాలు తడుముకోనక్కర్లేదు ; తల తడుముకుంటే చాలు .
ప్రేమ, పిచ్చి ఒకటే అన్నారు కానీ ఇందులో విభాగాలు చాలా ఉన్నాయి . ప్రేమ పిచ్చిగా మారడం – ప్రేమ పిచ్చి ; పిచ్చి ప్రేమగా రూపాంతరం చెందడం – పిచ్చి ప్రేమ.
పిచ్చి అంటే అంతా చెడే కానక్కర్లేదు . చదువుల పిచ్చి , ఆటల పిచ్చి , ర్యాంకుల పిచ్చి , మార్కుల పిచ్చి ఇలా మంచిపిచ్చి కూడా ఉండవచ్చు . అసలు పిచ్చివారిని గొలుసులతో బంధిస్తారు . మంచి పిచ్చివారి గొలుసులు మనకు కనపడవు – అంతే తేడా .
పిచ్చికి రకరకాల వైద్యాలున్నాయి కానీ – అన్నిటిలోకి గొప్ప వైద్యం , సమాజం అంగీకరించినది పెళ్లి .
“పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది”- అని సమాజం ఎందుకో అనాదిగా నమ్ముతోంది. తిక్క ఎవరికి కుదురుతుంది ? కుదురుకోవడం అంటే బాగా సెటిల్ కావడం అనే అర్థాన్ని ఏ నిఘంటువు కాదనలేదు . కాబట్టి పెళ్లి చేస్తే తిక్క ఇంకా వ్యవస్థీకృతం కావడం , లేదా ఇద్దరిలో పాలూనీళ్లలా తిక్క కలగలిసి ఆదర్శ తిక్క బాగా కుదురుకున్న దాంపత్యం కావచ్చు .
పిచ్చోడి చేతిలో రాయి మామూలువాడి చేతిలో రాయికంటే చాలా విలువయినది . “కుక్కకు పిచ్చి ముద్ర వేయి , ఆపై చంపెయ్”- అని ఇంగ్లీషులో గొప్ప కుక్క పిచ్చి సామెత . ఈ సామెత అవసరం లేకుండానే సమాజంలో మాట్లాడే ప్రతివారిమీద ఈ ముద్రనే వేస్తారు . తరువాత ఎవరూ చంపక్కర్లేకుండా మాట్లాడే గొంతులు తమకు తామే ఆత్మహత్య చేసుకుంటాయి .
ఆత్మహత్యల నుండి బయటపడితే కుక్క – పిచ్చి – చంపు సామెత ఉండనే ఉంది చంపడానికి . పిచ్చిని చంపేయాలనుకుంటే భూమండలంలో మిగిలేదెవరు?
ఇన్నిన్ని పిచ్చి సమస్యలు చాలవన్నట్లు తెలంగాణాలో కల్తీ కల్లు దొరకక పిచ్చివారై ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి మానసిక రోగులతో కిటకిటలాడుతోంది. ఎక్సయిజ్ శాఖ దాడుల నేపథ్యంలో చాలా చోట్ల కల్తీ కల్లు తయారీ, విక్రయ కేంద్రాలు మూతపడ్డాయట.
కల్తీ కల్లుకు అలవాటుపడ్డవారికి మంచి నురగలు కక్కే మేలిమి కల్లు రుచించదట. దాంతో పిచ్చివారై చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే…వారి బంధువులు విశాల హృదయంతో ఎర్రగడ్డకు తీసుకొస్తున్నారట. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి అవుట్ పేషంట్ విభాగంలో సగటున రోజుకు వంద మంది రోగులు వస్తుండగా… అందులో 30 మంది కల్తీ కల్లు దొరకక పిచ్చివారైనవారే ఉన్నారట.
ఎన్నెన్ని కల్తీలు తాగి, తిని, పీల్చి… ఎర్రగడ్డలకు వెళ్ళని మన ఆరోగ్యాలు ఎలాంటివి? కల్తీ కల్లు తాగి… పిచ్చి ప్రవర్తనతో ఎర్రగడ్డకు వెళుతున్నవారి ఆరోగ్యాలు ఎలాంటివి? అన్న పోలిక ఇక్కడ ఎందుకు? అసందర్భంగా! ……… – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article