.
కల్వకుంట్ల విభీషణి… లేదా కల్వకుంట్ల కవిత… ఆమె ఆ ఇంటి నుంచే వచ్చింది కదా… అన్నీ తెలుసు, అన్నింటికీ ప్రత్యక్ష సాక్షి… కానీ దెబ్బతిన్న గాయం సలుపుతోంది… ఒక్కొక్క అస్త్రమూ వదులుతోంది… అవన్నీ అన్నకు, నాన్నకు తగులుతున్నాయని తెలుసు… కానీ వదలడం లేదు…
ఆమె మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు అని బీఆర్ఎస్ వదిలేస్తున్నా సరే… ఆమె వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా జనంలోకి బాగా వెళ్తున్నాయి… చర్చ జరుగుతోంది… ఆమెను పార్టీ, కుటుంబం వదిలేశాక జనంలోకి వచ్చినప్పుడు ‘అబ్బే మరో షర్మిల’ అని తీసిపారేశారు చాలామంది… కాదు, ఆమె షర్మిల కాదు…
Ads
ప్రత్యేకించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆమోదించాలని కోరుతూ, చివరిసారిగా మండలిలో చాలా వ్యాఖ్యలు చేసింది… బీఆర్ఎస్ నాయకత్వానికి చురకలు, కాదు, వాతలు… పర్టిక్యులర్‌గా ఒక వ్యాఖ్య తరువాత మిగతావి చెప్పుకుందాం… ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోక్. ఎనిమిది పేజీలు మాత్రమే ఉంటుంది…

నిజం… కేసీయార్ కోసం మాత్రమే నడిచే పార్టీ… తను చెప్పిందే శాసనం… వేరే రాజ్యాంగం దేనికి..? అందుకే పాత మేనిఫెస్టోలు కూడా మాయమైపోతుంటాయి ఆ వెబ్‌సైట్‌లో… ఇంకొన్ని వ్యాఖ్యలు ముఖ్యమైనవి…
- రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్… నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది… పార్టీ నుంచి నన్ను కుట్ర చేసి బయటకు పంపారు… కనీసం నోటీసులు ఇవ్వకుండా, వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు…
- మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహా స్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు… నాది ఆస్తుల పంచాయితీ కాదు… ఆత్మగౌరవం కోసమే నా పోరాటం…
ఆమె నేరుగా అడుగుతోంది… తెలంగాణ పోరాటంలో నేను లేనా..? రాష్ట్ర సాధనలో నా పాత్ర ఏమీ లేదా..? కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో అందరిలాగే నేను ఉద్యమంలోకి 2006 లో వచ్చాను…
నేను సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించాను… మహిళలను, యువ మిత్రులను ఉద్యమంలోకి తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు చేశాను… మన పండుగ గౌరవం కాపాడాలని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు చేశాను… 3 వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర సాక్ష్యాలతో పుస్తకాలను వెలువరించాం…

ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు కూడా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు… (బీటీ బ్యాచ్… నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాగా లాభపడ్డది ఈ బ్యాచులే…)
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంటుందని సంతోషపడ్డాం… నాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో నా శక్తికి మించి పనిచేసేందుకు కృషి చేశాను… పార్టీలో మొదటి రోజు నుంచే నాకు ఆంక్షలు, కట్టుబాట్లు…
నా వద్దకు పెద్ద పెద్ద కంట్రాక్టర్లు ఎవరూ రాలేదు… అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చేవారు… పార్టీ ఛానెల్ గానీ, పార్టీ పేపర్ గానీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు…
అమరజ్యోతి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగింది నిజం… సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి… అక్కడే అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగతా వాటి గురించి ఏమీ చెప్పేది?

48 లక్షల మంది పెన్షన్లు ఇస్తామని గర్వంగా చెప్పుకుంటాం… కానీ లక్ష మంది ఉద్యమకారులకు మాత్రం కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేదు… 1969 ఉద్యమకారులను కూడా కనీసం గుర్తించలేదు… నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్ కు గండికొట్టుకుంటూ పోయాం…
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని నేను ఒప్పుకోలేదు… తెలంగాణలో ఏం పీకి కట్టామని… దేశంలో పీకుతాం… (బీజేపీలో విలీన ప్రయత్నాల్ని కూడా వ్యతిరేకించానని గతంలో చెప్పింది)…
నన్ను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది…. ఒక పార్టీని నడిపే పద్దతి ఇది కానే కాదు… నా సస్పెండ్ పై లీగల్ గా ఛాలెంజ్ చేయవచ్చు… కానీ నైతికత లేని బీఆర్ఎస్ పై ఛాలెంజ్ చేయను… ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నా…
మన రాష్ట్రంలో మహిళ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది… 17 ఎంపీ స్థానాలు ఉంటే ఒక మహిళ ఎంపీ మాత్రమే ఉన్నారు… 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహిళ ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే… ఇక మండలిలో 40 మందిలో ముగ్గురు మాత్రమే మహిళ సభ్యులు… నేను వెళ్లిపోతే ఇద్దరే ఉంటారు… (నిష్ఠుర నిజాలు)…

ఈ సభ నుంచి నేను వ్యక్తి గా వెళ్తున్నా, భవిష్యత్ లో శక్తిగా తిరిగి వస్తాను… కచ్చితంగా ఓ కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిస్తాను… ఒక ఆడబిడ్డగా నేను ముందడుగు వేస్తున్నా. నాకు మద్దతుగా నిలవండి… (ఓ దశలో కన్నీళ్లు పెట్టుకుంది…)
ఆమెది నటన అనీ, ఆ కన్నీళ్లు కూడా ఓ డ్రామా అని రేప్పొద్దున ఏ మరుగుజ్జు నేతలో కామెంట్లు చేయవచ్చు… కానీ ఆడబిడ్డ కన్నీళ్లు ఏ కుటుంబానికీ, ఏ పార్టీకి, ఏ సమాజానికి మంచిది కాదని చరిత్ర చెబుతోంది… ఆమె సక్సెస్ అవుతుందా లేదానేది కాలం చెబుతుంది…
ఆమె అవినీతి, మద్యం వ్యాపారం, అడ్డగోలు సంపాదన అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు... సత్తెపూసల్ని శుద్ధపూసల్ని ఒక్కరిని చూపించండి రాజకీయాల్లో..!! (ఈ ప్రస్తుత వ్యాఖ్యలు రేప్పొద్దున గుర్తుచేసుకునే అవసరం రావచ్చు, నెగెటివ్ గానో, పాజిటివ్ గానో... అందుకే రికార్డు చేయడం ఇక్కడ... వివరంగా...)
Share this Article