ఇదే మాటంటే… సినిమాను సినిమాలాగా చూడవోయ్, పిచ్చి సందేహాలు దేనికి..? లాజిక్ వెతికితే మ్యాజిక్ మిస్సవుతాం అని ఆ బొడ్డు దర్శకుడు అప్పట్లోనే తేల్చి చెప్పేశాడు కదా… మన సూపర్ సుప్రీం మెగా బంపర్ హీరోలు నటించే కథలన్నీ ఆ సూత్రానికి లోబడి లాజిక్కుల జోలికి వెళ్లవు కదా అంటారేమో…
విషయం ఏమిటంటే..? కాల్వన్ అని ఓ తమిళ సినిమా… జీవి ప్రకాష్ హీరోగా చేసిన తాజా చిత్రం ఇది… ఏప్రిల్‌లో థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా నెలలోగా ఓటీటీలోకి వచ్చేసింది… సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ సమ్ కామెడీ, ఇదీ దీని జానర్… ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా ఓ ఫుల్ లెంత్ రోల్ చేశాడు… జస్ట్, ఓ నటుడిగా… ఎందులోనూ వేలు పెట్టలేదు… మంచి పేరున్న సినిమాటోగ్రాఫర్ పీవీ శంకర్ రాసుకున్న కథ… అడవుల్లో కథ కదా, నిండుగా, పచ్చగా బాగుంటయ్ దృశ్యాలు… పైగా ఏనుగులతో లింకున్న కథ…
భారతీరాజా స్వతహాగా నటుడే, తన సినిమాల్లో నటీనటులకు ఏ సీన్ ఎలా చేయాలో చేసి చూపించేవాడట… హాట్ స్టార్‌లో తెలుగులో కూడా వుంది ఈ సినిమా… ఇక కథ విషయానికి వస్తే … ఇద్దరు చిల్లర దొంగలు ఓ ఊళ్లో… నర్సింగ్ చదివే ఓ పిల్లకు లైనేస్తాడు అందులో హీరో పాత్ర వెలగబెట్టిన యువకుడు… కానీ దొంగకు పిల్లనెవరు ఇస్తారు..? సో, కొలువు కోసం ట్రై చేస్తాడు…
Ads
లంచం ఇవ్వాలి, డబ్బు లేదు, సో ఓ ప్లాన్ వేస్తాడు… అంతకుముందు ఏదో పెయింటింగ్ పని మీద వృద్ధుల శరణాలయానికి వెళ్లినప్పుడు ఈ భారతీరాజాను చూస్తాడు, ముసలాయనకు ఎవరూ లేరు… ఆ ఊళ్లో ఏనుగుల బెడద ఎక్కువ, ఎవరైనా వాటి దాడిలో మరణిస్తే ప్రభుత్వం 4 లక్షల పరిహారం ఇస్తుంది, సో, ఆయన్ని తీసుకొచ్చి, ఏనుగుల దాడికి గురిచేసి, ప్రభుత్వం ఇచ్చే పరిహారం తనే పొంది, ఇటు ప్రేమను, అటు కొలువును సంపాదించాలనేది ప్లాన్…
సో, ఆ వృద్ధుడిని దత్తత తీసుకుని, ఇంటికి తీసుకెళ్తాడు… ఆ ముసలాయన కూడా ఆనందంగా వెళ్తాడు, ఇక ఏనుగుల దాడిలో ఆయన్ని బలిపెట్టారా, ఏం జరిగిందనేది కథ… సరే, ఇప్పుడు ఆ సినిమా రివ్యూలోకి మనం వెళ్లడం లేదు… కానీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ వృద్ధుడిని దత్తత తీసుకోవచ్చా..? ఆశ్రమం దత్తత ఇవ్వొచ్చా..? ఒకవేళ ఆ పెద్దాయన అంగీకరించినా సరే, మన చట్టాలు ఆ దత్తతను చట్టబద్దమే అని అంగీకరిస్తాయా..? లీగల్‌గా ఆ హీరోను సదరు ముసలాయన కొడుకుగా, పరిహారానికి అర్హుడిగా ప్రభుత్వం ఆమోదిస్తుందా..? (ఇక్కడ ఆ ముసలాయన ఆ హీరోను లీగల్‌గా దత్తత తీసుకోలేడు, ఆ హీరో ముసలాయన్ని తండ్రిగానూ దత్తత తీసుకోలేడు… ఎలాగంటే..?)
ఆ దత్తత గనుక లీగల్ కాకపోతే, ఒకవేళ ఆ ముసలాయన నిజంగానే ఏనుగుల దాడికి బలైపోయినా సరే, ప్రభుత్వం సదరు హీరోకు పరిహారం ఇవ్వదు కాబట్టి, సో, ఆ ప్లాన్ వర్కవుట్ కాదు కాబట్టి… ఓ సమాచారం మేరకు… ఇండియాలో 18 లోపు పిల్లలను మాత్రమే దత్తత తీసుకునే వీలుంది… అనాథాశ్రమాల్లో పిల్లల దత్తతకే ఓ పెద్ద అఫిషియల్ ప్రొసీజర్ ఉంది… హిందూ అడాప్షన్ యాక్ట్ ప్రకారం 15 లోపు పిల్లల్నే తీసుకోవాలి… దత్తత తీసుకునేవాళ్లకూ కొన్ని అర్హతలు, వయోపరిమితులున్నాయి… అది వేరే కథ…
అసలు సినిమా కథలో బేసిక్ సెంట్రల్ పాయింటే ప్రభుత్వ పరిహారం… అందులో కీలకం దత్తత… మరి ఆ సెంట్రల్ పాయింటే ఇంత పేలవంగా, నాసిరకంగా, అవగాహన లేకుండా ఉంటే ఇక మిగతా కథ ఎలా, ఎంత బాగా వండినా సరే ఆ వంట రుచిస్తుందా..? అందుకే కాసేపు చూడగానే ఇంట్రస్టు పోయింది…!! స్థూలంగా చూస్తే కథ భిన్నంగానే ఉన్నట్టు కనిపిస్తుంది… తరచిచూస్తే ఇదీ కథ… అందుకే సినిమాల్లో లాజిక్కులు వెతకకూడదు అంటారేమో… కానీ మనసొప్పుకోదు కదా..! ఇన్ని కోట్లు పెడతారు, కాస్త ఓ చిన్న లాయర్‌ను అడిగినా లా పాయింట్లు చెబుతాడు కదా అనిపిస్తుంది…!!
Share this Article