ఆమధ్య కల్యాణ్‌రాం నటించిన బింబిసార సినిమాకు టీవీల్లో 8.6 రేటింగ్స్ వచ్చినయ్… (హైదరాబాద్ బార్క్)… ఈ వారం రేటింగ్స్‌లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు జస్ట్, 7.13 రేటింగ్స్ మాత్రమే వచ్చినయ్… పాటలకు హైప్… స్టెప్పులకు హైప్… వసూళ్ల లెక్కల్లో హైప్… విపరీతంగా ప్రయత్నించారు ఆచార్య తాలూకు ఘోర పరాజయం తాలూకు పరాభవం నుంచి బయటపడేందుకు…! కానీ ఇదీ ఎక్కడో లెక్క తప్పింది…
ఓవరాల్‌గా చూస్తే సినిమా మీద పెట్టిన పెట్టుబడికీ, పెట్టుకున్న ఆశలకీ, వేసుకున్న అంచనాలకి భిన్నంగా రిజల్ట్ వచ్చింది… ‘అభిమానులు కోరుకునేదే అందిస్తాను’ అంటున్న చిరంజీవి తనకు క్రమేపీ జరుగుతున్ననష్టాన్ని సరిగ్గా మదింపు చేసుకోలేకపోతున్నట్టుగా ఉంది… ఇప్పుడు వీరయ్య హిట్ అయ్యిందిగా… ఇక అదే మూస, అదే బాట…
గాడ్ ఫాదర్ విషయానికి వస్తే… సినిమా హిట్టే అనుకుందాం… డబ్బులు బాగానే వచ్చాయి అనుకుందాం… కానీ చిరంజీవి సినిమా అంటే చాలు, ఖచ్చితంగా చూడాల్సిందే అనే భావనలు క్రమేపీ కొట్టుకుపోతున్నాయి… అందుకే గాడ్ ఫాదర్ సినిమాను టీవీలో ప్రసారం చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… ఓటీటీ ఇంపాక్ట్ కొంత ఉండవచ్చుగాక… కానీ టీవీల్లో మరీ బింబిసారను కూడా బీట్ చేయలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరమే…
Ads
బిల్డప్పులు, ఎలివేషన్లు, యాక్షన్, డిష్యూం డిష్యూం… మలయాళంలో హిట్టయిన లూసిఫర్‌ను సంపూర్ణంగా మెగాస్టారీకరించారు, అనగా చిరంజీవీకరించారు… పైగా సల్మాన్ ఖాన్ అనే వేరే గుడ్డముక్కను తీసుకొచ్చి ఈ సినిమాకు అతుకులేశారు… మౌత్ టాక్ పెద్దగా రాలేదు… దాంతో చివరకు సినిమా, టీవీల్లో ప్రసారం చతికిలబడ్డాయి… (నిజానికి ఈ సినిమాను జెమిని టీవీలో గాకుండా జీతెలుగు లేదా స్టార్‌మాటీవీలో ప్రసారం చేసి ఉంటే బెటర్ జీఆర్పీలు వచ్చి ఉండేవి…)
తప్పక చూడాలి అనేలా సినిమా ఉంటే తప్ప, ఆ మేరకు మౌత్ టాక్ వస్తే తప్ప టీవీల ముందు ప్రేక్షకులు గతంలోలాగా కూర్చోవడం లేదు… ఎంచక్కా ఓటీటీ ఓపెన్ చేసుకుని, మధ్యమధ్యలో పనులు చూసుకుంటూ, చేసుకుంటూ సినిమాను చూశాం అనిపించేస్తున్నారు… పాటలను, ఫైట్లను అవాయిడ్ చేస్తున్నారు… దమ్మడ దమ్మడ గుద్దులు, తన్నులు, నరుకుళ్లను జనం ఇప్పుడు పెద్దగా ఇష్టపడటం లేదు…
బింబిసారలో కూడా అవే ఓవర్ ఫైట్లున్నాయి, అసహజాలున్నాయి కదా, పైగా చిరంజీవితో పోలిస్తే చాలా చిన్న రేంజ్ హీరో కదా అంటారా..? కల్యాణ్‌రాం మీద ప్రేక్షకులకు అంచనాలు ఉండవు, హైపూ ఉండదు… ఏదో పునర్జన్మలు, కథా కాకరకాయ డిఫరెంటుగా వినిపించింది, కనిపించింది… అందుకని తన బిల్డప్పులు, ఫైట్లు, గెంతులను జనం భరించారు… చిరంజీవి స్థానం వేరు, తన రేంజ్ ఏమాత్రం తగ్గినా సరే ప్రేక్షకుడికి నచ్చదు… ఈ జీఆర్పీల్లో తేడా అందుకేనేమో..!!
చివరగా :: యాంకర్ సుమ ఈటీవీలో స్టార్ట్ చేసిన సుమ అడ్డా అనే ప్రోగ్రాంకు విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు కదా… దానికి రేటింగ్స్ జస్ట్, 4.08… ముందే చెప్పుకున్నాం కదా, చిరంజీవి కనిపిస్తే చాలు చూసేద్దాం అనే భావనలు పలుచబడిపోతున్న దృశ్యమే ఇది కూడా…!!
Share this Article