పాపిష్టి కరోనా ఇంకా వదలడం లేదు… కాలం కదలడం లేదు… ఈ పీడదినాలు ఎన్నాళ్లో బోధపడటం లేదు… కానీ కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగదు కదా… మరేం చేయాలి..? యాభై, వందకు అతిథులు మించడానికి వీల్లేదు… ఎన్ని శానిటైజర్లు పెట్టినా, డబుల్ మాస్కులు ధరించి వచ్చినా సరే కరోనా కరుణించడం లేదు… పట్టుకునేవాళ్లను పట్టుకుంటూనే ఉంది… ఏదో మొహం చూపించి, నాలుగు అక్షింతలు వేసి వచ్చేస్తే సరిపోదు కదా… పెళ్లి భోజనాలు పెట్టాలి… అవి లేకపోతే అసలు పెళ్లే కాదు…
పోనీ, ఈ పీడదినాలు ఎంచక్కా రిజిష్టర్డ్ మ్యారేజీల వైపు మనల్ని తీసుకుపోయినా బాగుండు… దానికి బంధు, మిత్రగణం అంగీకరించరు కదా… అసలు శాపాలు వాళ్లే కదా… పెళ్లి చేయాలి… ఏదో చేస్తాం సరే… మరి అందరినీ పిలవలేం కదా… ఇదుగో ఇలా… వెబ్ క్యాస్టింగ్ సర్వీస్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది… పెళ్లి టైంకు మన ఫోన్లో ఆ లింకు క్లిక్ చేస్తే చాలు… పెళ్లిపందిరి మన కళ్లెదుట సాక్షాత్కారం… మనం పెళ్లికి ఇక వెళ్లినట్టే… వీళ్లు పెళ్లి పత్రిక కూడా అలాగే ముద్రించారు… మీరు ఫలానా లింకులో పెళ్లి చూస్తే చాలు అన్నారు… వెరీ గుడ్…
Ads
సరే, పెళ్లిని ఎలాగోలా చూసేస్తాం… మరి పెళ్లి భోజనం… చేతిలో పళ్లెం పట్టుకుని, ప్రతి డిష్ వద్దకూ తిరుగుతూ… లైన్లో నిలబడి… వాడికీ వీడికీ మన పళ్లెంలోని పులుసు, కూర అంటిస్తేనే కదా ఆ పెళ్లి భోజనం మజా పూర్తయ్యేది… చివరకు ఓ పాన్ నోట్లో పెట్టుకుని, నములుతూ బయటికి వచ్చేస్తేనే కదా మనకు పెళ్లికి వెళ్లిన తృప్తి… కడుపుకూ, మనసుకూ… అందుకే ఈ పెళ్లి భోజనం అనే తంతుకూ వీళ్లు ఓ ప్లాన్ కనిపెట్టారు.,. వాళ్లకు తగిన ఓ కేటరర్ కూడా దొరికాడు…
డబ్బుంటే కొండ మీద కోతే దిగి వస్తుంది… పెళ్లి భోజనం ఎంత..? నడిచొచ్చి, ఇంటి తలుపు తట్టి మరీ పలకరిస్తుంది… ఇదుగో ఇలా సుబ్బయ్య హోటల్ బుట్ట భోజనం తరహాలో మన ఇంటిముందుకు వచ్చి కాలింగ్ బెల్ నొక్కుతుంది… అవునండీ, హోం డెలివరీ… మీకు నచ్చిన టీవీ సీరియల్ చూస్తూ, మీకు కావల్సినంత టైం తాపీగా భోజనం చేయండి… మా వధూవరులను మనసులోనే ఆశీర్వదించండి చాలు…
నో, నో… ఇంటికి వచ్చింది కదాని ఈ పార్శిల్‌ను తేలికగా ఏమీ తీసిపారేయొద్దు సుమా… పెళ్లిభోజనాన్ని మరిపించేలానే ఉంటుంది… స్వీటు, హాటు, కూరలు, సాంబారు, పెరుగు, చివరకు చివరలో కిళ్లీ సహా… చిన్న చిన్న డబ్బాలు కూడా… అసలు పార్శిల్లో ఏముందో కూడా వివరంగా తెలియజెప్పే ఓ కార్డు కూడా ఉంటుంది… ఇదుగో ఇలా…
అరెరె, మీ పళ్లెమే అక్కర్లేదు… అరిటాకులు కూడా పంపిస్తాం… ఆ ఆకులపై ఏది ఎలా పెట్టుకుని, భోజనం మొదలు పెట్టాలో కూడా చెబుతాం… తొందరేముంది..? తాపీగా, భుక్తాయాసం వచ్చేదాకా ఆరగించండి, ప్లీజ్…
కూరలు సరేనోయ్, సాంబారు గట్రా ఎలా పార్శిల్ పంపిస్తారు, కొంపదీసి ప్లాస్టిక్ కవర్లలో నింపేసి, ఆ పార్శిళ్లలో వేసేశారా ఏమిటీ అనకండి… చిన్న చిన్న క్యారేజీలు, డబ్బాలు ఉంటయ్… ఎంచక్కా వాటిల్లో మంచి హైజినిక్ కండిషన్లో నింపి, మరీ పార్శిళ్లలో పెడతాం… అవి ఏమిటేమిటో కూడా చెప్పే చార్టు కూడా ఉంటుంది… ఇదుగో, ఇలా… ఓసారి చూసేయండి…
ఇక ఇలా వడ్డించుకొండి… ఓసారి వధూవరులు శివప్రకాష్, మహతిని ఆశీర్వదించండి… ఇక కుమ్మేయండి… ఏ ఒక్కటీ వదలొద్దు సుమా… కాకపోతే మధ్యలో కాసేపు ఆపి, కడుపులో అంత సర్దుకున్నాక మళ్లీ మొదలుపెట్టండి… మరీ కాస్ట్లీ కల్యాణ భోజనం పార్శిల్ కదా, వదిలేస్తే బాగోదు… ఏమంటారు..? బ్రేవ్….
Share this Article