నేతిబీరకాయ నేతలు… లొట్టపీస్ పార్టీలు… పొద్దున్నే ఓ సినిమా వార్త చూసినప్పుడు చటుక్కున స్ఫురించిన రెండు మాటలు అవే… సినిమా వార్తకూ ఈ రాజకీయ వ్యాఖ్యకూ లింక్ ఏమిటా..? ఉంది..! అది ఓ పార్ట్ టైమ్ పొలిటిషియన్‌కు సంబంధించిన వార్త కాబట్టి…! ఇంతకీ ఆ వార్త ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో 24 ఏళ్ల కింద కమల్‌హాసన్ సినిమా వచ్చింది… భారతీయుడు… ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారు… మధ్యలో ఏదో ప్రమాదం జరగడం, తరువాత కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోవడం పాత కథే… మూడు నాలుగు షెడ్యూళ్లు పూర్తయ్యాయి అప్పటికే… ఇక ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించారు… త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది… కమల్‌హాసన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు…
జనవరి సంక్రాంతి తరువాత గానీ ఫిబ్రవరిలో గానీ షూటింగ్ స్టార్ట్ చేస్తే… చెన్నెలో కొన్ని సీన్ల షూటింగు తరువాత దేశంలోని వివిధ లొకేషన్లు చుట్టబెట్టి, విదేశాల్లో కూడా కొన్ని సీన్లు తీస్తారు… ఇదీ వార్త… నవ్వొచ్చిందా వార్త చదువుతుంటే..?
Ads
ఎందుకంటే… తమిళనాడులో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాలీ అంటే… ఫిబ్రవరి, మార్చిల్లోనే షెడ్యూళ్ల ప్రకటన, నోటిఫికేషన్ జారీ అవసరం… అంటే సారు గారి సినిమా షూటింగు పీక్స్‌లో ఉండబోయే రోజులు… ఈయన గారికి ఓ రాజకీయ పార్టీ ఉంది తెలుసు కదా… సో, షూటింగ్ స్పాట్లోనే చకచకా బీఫారాలు నింపేసి పంపిస్తాడన్నమాట… ఎన్నికల ప్రచారం అంటారా..? ఈ సినిమానే విడుదల చేస్తే సరి, లేదంటే సోషల్ మీడియా ఉందిగా… నాలుగు పడికట్టు సినిమా డైలాగుల్ని జనంలోకి వదిలితే సరి…
ప్రస్తుతం బిగ్‌బాస్ తమిళ సీజన్ కూడా నడుస్తోంది… అది కూడా పూర్తి చేసుకుని, ఈలోపు భారతీయుడు-2 రిలీజ్ అయిపోయి… తన ఎమ్మెల్యేలు కూడా బోలెడు చాలా ఎక్కువ రొంబ జనం గెలిస్తే… సారు గారు నేరుగా అసెంబ్లీలోకి ప్రవేశిస్తాడన్నమాట… హహహ…
నిజంగా రాజకీయం ఎంత నవ్వులాట అయిపోయింది..? సేమ్ రజినీకాంత్, సేమ్ కమల్‌హాసన్… ఎహె, సినిమా నటుల పార్టీలన్నీ ఇంతే… వాళ్లకు రాజకీయాలు అనేది ఓ సీరియస్ సబ్జెక్టు కాదు… అవీ సినిమా ప్రాజెక్టుల్లాగే… హిట్టయితే హిట్టు, ఫట్టయితే ఫట్టు… ఫ్యాన్స్ అనేబడే వెర్రిబాగులోళ్ల అభిమానమే పెట్టుబడి… పోయిందేముంది..? నక్క తోక తొక్కి, నాలుగు సీట్లు ఎక్కువ గెలిస్తే ఇంకా మంచిది… రాజకీయాలు కూడా మంచి లాభదాయక దందా కదా ఇప్పుడు..?
ఏం… గతంలో జయలలిత, ఎమ్జీయార్, ఎన్టీయార్ సీఎంలు కాలేదా అని అమాయకంగా వాదిస్తుంటారు కొందరు… ఆ రోజులు కావివి… 24 గంటలూ జనం మధ్యలో ఉన్నవాళ్లే నానా ఢక్కామొక్కీలు తినాల్సి వస్తోంది… మంచికీ, చెడుకూ జనంతో కలిసి ఉండేవాడే నిజమైన నాయకుడు… వాళ్లతోనే గెలుపూఓటములు దోబూచులాడుతుంటాయి… ఊరకే ఎన్నికల టైంకు రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయి… జాతరలో దుకాణం ఓపెన్ చేసినట్టుగా… తమను చూసి వచ్చే జనాన్ని చూసి, చేతులూపితే వోట్లు రాలే రోజులు కావివి… ఒక హీరో రోడ్డు మీదకొస్తే చూడటానికి జనం విరగబడతారేమో… కానీ బ్యాలెట్ బాక్సులు తెరిచిచూస్తే మాత్రం నోటా వోట్లతో పోటీలు… అంతా డొల్ల… తెలుగు ప్రజలు ఆల్రెడీ ఈ నిజాన్ని చాటి చెప్పేశారు… తమిళ ప్రజలు ఏం చెబుతారో మరి..?!
Share this Article