.
అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్ ని ఆడిపోసుకోవడం నాకూ ఇష్టం లేదు. కాకపోతే, ఈ మధ్య “అపూర్వ సింగీతం” చూసాను.
అది చూస్తున్నంత సేపూ అల్లువారబ్బాయి వద్దనుకున్నా.. గుర్తొచ్చాడు.
పాపం ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలే గుర్తొచ్చాయి.
నిన్న కాక మొన్నొచ్చిన ఈ యువతారే అంతగా ఫీలైతే,
ఎప్పటి సింగీతం..
ఎలాంటి సినిమాలు..
మరి ఆయనెంత ఫీలవ్వాలో కదా అనిపించింది.
సరే, ఇక్కడితో అర్జున్ గొడవ వదిలేద్దాం.
..
ఇక సింగీతం విషయానికొస్తే,
తెలుగువాడు..
ఇప్పుడు 93 ఏళ్లనుకుంటా…
ఎప్పుడో మాయాబజార్ నాటి జ్ఞాపకం ..
పాన్ ఇండియా సినిమా అనేపేరు పుట్టకముందే..
ఆ కాన్సెప్టు ని పాన్ మసాలాలా నమిలేసిన డైరెక్టర్…
Ads
కమల్‌హాసన్ అనే మరో సినిమా పిచ్చోడితో కలిసి స్క్రీన్ రైటింగ్ని ఒక ఆట ఆడుకున్నాడు.
డైలాగుల్లేని పుష్పకవిమానం.
కళ్ళు లేని హీరోగా రాజపారవై ( తెలుగులో అమావాస్య చంద్రుడు)
మరుగుజ్జు హీరోగా మరో సినిమా
పెళ్ళిళ్లు షూట్ చేసే కెమెరాతో లైట్లే లేకుండా తీసిన ముంబై ఎక్స్ప్రెస్
కమల్ హాసన్ బహురూప పాత్రలతో మైఖేల్ మదనకామరాజ
ఇలా ప్రతి సినిమా ఒక సాహసం..
కమల్ , సింగీతం జోడీ అంటేనే అదొక ప్రయోగం.
ఆ ప్రయోగాలని, ప్రయాణాన్ని కమల్ మరిచిపోలేదు.
పదిలంగా గుండెకి హత్తుకున్నాడు.
తన సక్సెస్ లో సింగీతానికి భాగం వుందనుకున్నాడు.
ఒక నటుడిగా ఆ దర్శకుడికి రుణపడ్డాననుకున్నాడు.
ఆ రుణం తీర్చుకోడానికి..
ఆ కృతజ్ఞత చూపించడానికి..
సింగీతంతో తన సినిమా అనుభవాలని గుర్తుచేసుకోవడానికి..
ఓ వేదిక కావాలనుకున్నాడు.
ఆ వేదికే ‘అపూర్వ సింగీతం’
సింగీతంతో తను తీసిన ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలను ఎంచుకున్నాడు.
రోజుకొక సినిమాని స్క్రీన్ చేసాడు.
స్క్రీనింగ్ అయిపోగానే ఆ సినిమా గురించి ముచ్చట్లు మొదలుపెట్టాడు.
అప్పటి సినిమాలో పనిచేసిన వాళ్ళు కొందరు..
అప్పటి సినిమాని ఇప్పటికీ ఆరాధించేవాళ్లు ఇంకొందరు..
వీళ్లే ఆ స్క్రీనింగ్ లో ఆహ్వానితులు
వీళ్లే ఆ టాక్ షోలో భాగస్వాములు కూడా.
…
ఇక ఆ టాక్ షోలు పూర్తిగా అన్ స్క్రిప్టెడ్..
అంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం కాదు.
ఇష్టంగా అనుభవాలు పంచుకోవడం
పిచ్చి పొగడ్తలు కాదు
ప్రేమగా నాటిరోజులు గుర్తుచేసుకోవడం..
ఆ సినిమాల్లో మాటా , పాటా అయిన ఇళయరాజా, వైరముత్తులు కావచ్చు.
అప్పటి సినిమాలు చూసి పెరిగిన మణిరత్నం, ఎఆర్ రెహ్మాన్ లు కావచ్చు,
సీన్లు, సీన్లుగా సింగీతాన్ని ఆవిష్కరించారు.
ఆలోచనల్ని ఇచ్చిపుచ్చుకున్న ఆరోజులని,
ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు నచ్చిమెచ్చుకున్న రోజులవి.
అలాగని గతమంతా ఘనకార్యమనే కాదు…
అప్పుడు వేసిన తప్పటడుగులను కూడా గుర్తుచేసుకున్నారు.
కథ లేకుండా సినిమా మొదలు పెట్టిన రోజులు,
సగం తీసాక సినిమా బాలేదని మళ్ళీ షూట్ చేసిన అనుభవాలు..
గొప్ప ప్రయోగం అనుకున్న రాజపారవై దారుణంగా నష్టాలు మిగిల్చిన గుర్తులు..
అన్నీ మాట్లాడుకున్నారు.
సింగీతానికి సంగీతం తెలుసు.. అందుకని ఏం ట్యూన్ ఇచ్చినా మాట్లాడడు
కమల్ కి సంగీతం తెలియదు.. అందుకే ఏ ట్యూన్ ఇచ్చినా ఇంకేదో అడుగుతాడు..
అని ఇళయరాజా గుర్తుచేస్తుంటే,
అవునని సంగీతం, కమల్ లు ఇద్దరూ చిరునవ్వుతోనే అంగీకరించారు.
కొత్తగా ఆలోచించాలి..
కొత్తగా చెప్పాలి,
కొత్తగా తీయాలి,
అని తప్ప..
ఎన్ని కోట్ల బడ్జెట్లు,
ఎన్నికోట్ల కలెక్షన్లు,
ఎన్ని బద్దలైన రికార్డులు అన్న పిచ్చిలేని రోజులవి..
ఆ రోజులని, ఆ స్మృతులని ఆత్మీయంగా తలుచుకున్న
ఈ నాలుగు ఎపిసోడ్ల కాలం..
సినిమాని ప్రేమించేవాళ్లకి నాలుగు నిమిషాల్లా గడిచిపోతుంది.
(తమిళం వచ్చుంటే ఇంకా బావుంటుంది.
కాకపోతే, ఎక్కువ సంభాషణ ఇంగ్లీష్ లోనే వుంటుంది కనుక మేనేజ్ చేయొచ్చు.
నాలుగు ఎపిసోడ్లు యూట్యూబ్ లో వున్నాయి…)
( మిత్రుడు శివప్రసాద్ వాల్‌పై కనిపించింది… వెంటనే సంగ్రహించబడింది…)
Share this Article