కనబడుట లేదు… అసలు ఇంట్రవెల్ దాటిపోయినా హీరో ఇంకా కనబడుట లేదు
కనబడుట లేదు… కథను చెబుతూ పోయాడే తప్ప హీరో శోధించేదేమీ కనబడుట లేదు
కనబడుట లేదు… థ్రిల్లర్ అన్నారు గానీ, సినిమాలో అసలు థ్రిల్లేమీ కనబడుట లేదు
కనబడుట లేదు… కుర్చీ అంచున కూర్చోబెడతామన్నారు కానీ ఆ సీనేమీ కనబడుట లేదు
కనబడుట లేదు… సునీల్ హీరోయా, సైడ్ హీరోయా, కేరక్టర్ ఆర్టిస్టా… క్లారిటీ కనబడుట లేదు
కనబడుట లేదు… ప్రేక్షకుల బుర్రలకూ పదును పెట్టే గ్రిప్పింగ్ కథనమేమీ కనబడుట లేదు
కనబడుట లేదు… దర్శకుడు బాలరాజు ప్రజెంటేషన్‌లో వైవిధ్యం, కొత్తదనం కనబడుట లేదు
కనబడుట లేదు… ఈ సినిమా తరువాత ఇక సునీల్ కెరీర్ ఎటువైపో సూచనలే కనబడుట లేదు
కనబడుట లేదు… ఇలా చాలా అంశాలు కనబడుట లేదు… నిజానికి డిటెక్టివ్ కథలంటే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది… మనవాళ్లు మరీ డిటెక్టివ్ కథల్ని కామెడీ చేసేశారు కానీ.., సస్పెన్స్, థ్రిల్, బుర్రకు పదును గట్రా కావాలంటే మంచి సీరియస్ డిటెక్టివ్ కథ అయితేనే మజా… కాకపోతే కథనం పక్కదోవలు తొక్కొద్దు… సీరియస్ ఇన్వెస్టిగేషన్‌తో ప్రేక్షకుడి ‘మెదడుకు మేత’ పెట్టేలా ఉండాలి… హిందీలో కొన్ని వెబ్ సీరీస్ వస్తున్నాయి, బిగి సడలకుండా కథ నడిపిస్తారు… మన సునీల్ వచ్చేదే సెకండాఫ్‌లో…. ఫాపం, సునీల్‌ను చూస్తే జాలేస్తుంది… ఒకప్పటి స్టార్ కమెడియన్… తరువాత ఫ్లాప్ హీరో, మళ్లీ కమెడియన్…
కానీ తను ఈ సినిమాలో ఏమిటో అర్థం కాదు… పోస్టర్లలో తనే ప్రముఖంగా కనిపిస్తాడు… వేరేవన్నీ కొత్త మొహాలే… కాసేపు కనిపించే హిమజ తప్ప… ఇక సునీలే హీరో అనుకుంటాం కదా… కానీ ఎవరెవరో పాటలు పాడుతూ ఉంటారు… ఫైట్లు చేసేస్తుంటారు… మన హీరో అనబడే కేరక్టర్ ఆర్టిస్టు గదిలో కూర్చుని దర్యాప్తు చేస్తుంటాడు… తనే కథలోని ముళ్లు విప్పి ప్రేక్షకుడికి వివరిస్తూ ఉంటాడు… హేమిటో… సినిమా అంటేనే దృశ్యప్రధానం కదా… హీరో చేత కథ చెప్పిస్తే ఇక సినిమా ఎందుకు.?. ఏ నవలో చదివితే సరిపోదా ఏం..? కాకపోతే దర్శకుడిని ఒకందుకు మెచ్చుకోవాలి… ఎక్కడా అసభ్యత, అశ్లీలత జోలికి పోలేదు… వెకిలిబాట పట్టలేదు… కథనం మీద మరింత కాన్సంట్రేట్ చేస్తే బాగుండేది… కొన్ని పాత్రల కేరక్టరైజేషన్ కూడా చికాకుగా ఉంది… పాటల్లో నాణ్యత లేదు… పోనీలే, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్… అన్నట్టు సునీలూ, ఇది డిటెక్టివే కథే, కానీ నీదే డిఫెక్టివ్ ఎంపిక…!!
Share this Article
Ads