Sankar G……….. వంద బాహుబలిల పెట్టు ఈ కంచుకోట… జానపద చిత్రాల్లోను సస్పెన్స్ థ్రిల్లర్‌గా సంచలనం సృష్టించిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘కంచుకోట’. మొదట డబ్బింగ్ చిత్రాలతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమా ‘కంచుకోట’. ఇతను ఎన్టీఆర్ కు బావమరిది. ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే త్రిపురనేని మహారథి. జానపదాల్లోనూ స్క్రీన్ ప్లే అప్లై చేసి గ్రాండ్ సక్సెస్ అయిన సినిమా ఇది. 1967 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. కానీ ఆ స్థాయిలో ఏ జానపద చిత్రమూ నిర్మింపబడలేదు. కంచుకోట సినిమా ఒక జానపద చిత్రమైనా అందులో సస్పెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. జానపద చిత్రాల్లో కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి తెలుగు సినిమా కంచుకోట. జానపద నవలలు సస్పెన్స్ థ్రిల్లర్స్ గా వచ్చాయి కానీ సినిమాగా రావటం ఇదే మొదటిసారి.
కథ ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందో తెలియకుండా చిత్రాన్ని దర్శకుడు సి.ఎస్.రావు మలచడంతో ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. సినిమా నిర్మాణ వ్యయం ఏడు లక్షలు. మొదటివారమే ఏడు లక్షలు వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది కంచుకోట. ఈ సినిమా పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట ‘సరిలేరు నీకెవ్వరూ…’ అలాగే మిగతా అన్ని పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇందులో కాంచన ఈడొచ్చిన పిల్లనోయ్ అంటూ ఒక ఐటం సాంగ్ తో కనువిందు చేస్తుంది. భారీతారాగణంతో నిర్మించిన ఈ చిత్రం సావిత్రి, దేవిక లాంటి భారీ పర్సనాల్టీ హీరోయిన్లతో తెరమీద మరింత భారీగా కనిపిస్తుంది.
Ads
1975లో ఈ చిత్రం రిపీట్ రన్లో హైదరాబాద్‌లో మూడు ఆటలతో వందరోజులు ఆడింది. రెగ్యులర్ షోస్‌తో రిపీట్ రన్లో సెంచరీ చూపిన తొలి భారతీయ చిత్రం కావడం మరింత విశేషం. రిపీట్ రన్ లో వరుసగా వంద రోజులు ఆడిన సినిమాగా కంచుకోట రికార్డు పుటలకెక్కింది. రిపీట్ రన్ లోనూ ఓ జానపద చిత్రం వంద రోజులు మూడు ఆటలతో ఆడడం అంటే అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అద్భుతం అనిపిస్తుంది. విజయవాడలో ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయా టాకీస్ లోనే ప్రదర్శిత మవుతూ ఉండేది. ఇదొక ప్రత్యేకత.
స్వయంగా వ్యాపారవేత్త అయిన విశ్వేశ్వరరావు కంచుకోట సినిమా విడుదల వ్యవహారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సినిమా హక్కుల్ని ఏరియాల వారిగా అమ్మి కొత్తరకం వ్యాపార సరళికి శ్రీకారం చుట్టారు. ఏరియాల వారీగా సినిమాల అమ్మకం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పాలి. దీని తర్వాత నిర్మించిన సాంఘిక చిత్రాలు నిలువుదోపిడి, పెత్తందార్లు ఒక మోస్తరుగా ఆడినా, వీటి తర్వాత నిర్మించిన దేశోద్దారకులు ఘనవిజయం అందుకుంది.
దమ్మున్న దర్శక నిర్మాతలు ఉంటే ఇప్పుడు కూడా కంచుకోట చిత్రాన్ని రీమేక్ చేయవచ్చు. ఈ చిత్రం యూట్యూబ్ లో అంత క్వాలిటీతో ఉండదు. నిడివి తగ్గించటం కోసం అనవసరమైన ఎడిట్ లతో సినిమాను కొంత కంగాళీగా తయారు చేశారు. Hd ప్రింట్ కూడా ఎక్కడా ఉన్నట్టు లేదు.
Share this Article