కంగనా రనౌత్..! తన వ్యవహారధోరణి మీద బోలెడు విమర్శలు… కానీ ఆమె ధిక్కారి, సాహసి… అసలు ఆడదాన్ని ఓ భోగవస్తువుగా చూసే ఆ సినిమా రాజ్యంలో పెద్దపెద్ద తలలను ధిక్కరించి తలెగరేస్తోంది ఆమె… సేమ్, తన తత్వానికి తగిన ఓ కథను ఎంచుకుని ఓ సినిమా తీయబోతోంది… మణికర్ణిక మళ్లీ వచ్చింది అంటూ తీసే ఆ సినిమాకు తనే దర్శకురాలు… అయితే ఆ సినిమా కథ వర్తమానం కాదు, మణికర్ణిక ఒరిజినల్ ఝాన్సీరాణి తరహా రాణి కూడా కాదు… 979 నుంచి 1003 వరకు కాశ్మీర్‌ను పాలించిన సామ్రాజ్ఙి… ఆ కాలంలోనే పురుషాహంకారాన్ని ధిక్కరించి, స్త్రీద్వేషులను ఎదిరించి, ఎక్కడికక్కడ తొక్కేసి, ఓ ఆడ నియంత తరహాలో కాశ్మీర్ నుంచి కాబూల్ దాకా పర్వతప్రాంతాల్ని ఏలిన ఓ పర్వతం ఆమె… పేరు దిద్దా…
లొహరా యువరాణి… కాశ్మీర్ రాజును పెళ్లి చేసుకుంటుంది… రెండు రాజ్యాల్నీ ఏకం చేస్తుంది… భర్త జూదగాడు, మద్యం మత్తులో కాలం గడిపేవాడు… వేటలంటే ప్రీతి… దాంతో రాచవ్యవహారాల్ని ఆమే చూసుకునేది… ఆమె ఏ స్థాయికి పాలనను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నదీ అంటే… బంగారు, వెండి, రాగి నాణేలపై సైతం రాజు-రాణి ఇద్దరి ముద్రలూ ఉండేవి… ఓసారి వేటకు వెళ్లి భర్త మరణిస్తే అప్పటి ఆచారం ప్రకారం సతీసహగమనం చేయాలి… తిరస్కరించింది… కొడుకును కుర్చీ మీద కూర్చోబెట్టి తను పాలన పగ్గాలు తీసుకుంది… పెద్దపెద్ద భూస్వాములకు ఆడదాని పెత్తనం ఏమిటీ అనే అసహనం… తిరుగుబాట్లకు దిగారు… ఒక్కొక్కరినీ వారి కుటుంబాలతో సహా హతమార్చింది…
Ads
సాధారణంగా సమాజపోకడలకు భిన్నంగా ఆత్మాభిమానంతో, ధిక్కార ధోరణితో, ఆధిపత్య వైఖరితో ఉండే ఆడవాళ్లను సహించకపోవడం నాటి నుంచీ అలవాటే కదా… ఆమెను అప్పటి భూస్వామ్యపక్షాలు ఆమెను క్రూరురాలిగా, నియంతగా మాత్రమే కాదు, చివరకు కుర్చీ కోసం మనమళ్లను కూడా చంపించింది అని ముద్ర వేశాయి… ఓ దశలో ఓ గుజ్జార్‌ను చేరదీసి, తనతో సుఖభోగాలను అనుభవించినట్టూ కథలు రాయించారు… ఆమె మరణించాక 145 ఏళ్లకు కల్హణుడు కాశ్మీర్ రాజుల గురించి రాజతరంగిణి అనే పుస్తకం రాస్తూ అందులోనే ఈమె గురించీ రాశాడు… పరమ అవలక్షణ పాలకురాలిగా చిత్రించాడు…
మరిప్పుడు ఆమె వివాదాస్పద కథను కంగనా ఏరకంగా చిత్రించబోతోంది… అదీ ఆసక్తికరం… దాడుల్ని, తిరుగుబాట్లను అణిచేసి, సుస్థిరతను సాధించిన ధీరురాలిగా చిత్రించడం ఖాయమని కంగనా తత్వం తెలిసినవాళ్లు అంచనా వేస్తున్నారు… సరే, మంచి కథే… బయోపిక్కులంటేనే మన ఇష్టారాజ్యంగా మార్చి, ప్రేక్షకుల కళ్లకు గంతలు కట్టడం కాబట్టి దాన్నలా వదిలేద్దాం… ఆమె సినిమా ప్రకటించిందో లేదో ఓ దిక్కుమాలిన పంచాయితీ రెడీ… ఆశిష్ కౌల్ అనే రచయిత తన రాసిన దిద్దా బయోగ్రఫీ ఆధారంగా సినిమా తీస్తున్నారనీ, కాపీ రైట్ కింద కోర్టుకు లాగుతాననీ బెదిరిస్తున్నాడు… అప్పట్లో కల్హణుడి నుంచి ఎందరో రచయితలు ఆమె గురించి రాశారు… ఈ ఆశిషుడికి ఉన్న కాపీ రైట్ ఏమిటట..? ఏ విజయేంద్రప్రసాద్కో చెబితే వారం రోజుల్లో కథను రాసిచ్చేస్తాడు కదా… తలైవి, థాకడ్, తేజస్… ఇప్పుడు దిద్దా… ఇక ఈ సినిమాకు అడ్డుకట్టలు వేయడానికి, కంగనాను కంగారుపెట్టడానికి బాలీవుడ్ సిండికేట్లు ఏమేం ప్రయత్నాలు చేస్తాయో చూడాలిక… సహించరు కదా… సేమ్, రాణి దిద్దాను ద్వేషించిన భూస్వాముల్లాగే…!!
Share this Article