.
ఒక పాదఘట్టం… ఒక ఎర్రసముద్రం… ఒక ప్రణవ కోన… హేమిటో ఈ కథలేమిటో… వందల కోట్లలో అత్యంత భారీ ఖర్చుతో సినిమాలు తీస్తారు గానీ… అవేవీ కనెక్ట్ కావు…
ఇక్కడ కపాలకోన అంటే కంగువా… ఏవో అయిదు కోనల పాత కథ… కంగువా అంటే తెలుగులో ఏమిటి అనడక్కండి… తమిళ పేర్లు అలాగే తెలుగులోకి వచ్చేస్తుంటాయి… మీ ఖర్మ, చూస్తే చూడండి… తెలుగు పేర్లతో తమిళంలో రిలీజ్ చేస్తే చూస్తారా అనే పిచ్చి ప్రశ్న వేస్తే మర్యాద దక్కదు సుమా… మనలా సిగ్గులేనివాళ్లు కాదు కదా… కంగువా అంటే హీరో పాత్ర పేరు… అదీ ఇప్పటిది కాదు… వెయ్యేళ్ల క్రితం నాటి ఏదో ఓ ఆటవిక నామం…
Ads
సూర్య… చాలా సినిమాలతో తెలుగు వాళ్లలో ఇమేజీ సంపాదించాడు.,. గుడ్, సూర్య సినిమా అంటే తెలుగులో ఎంత దారణమైన డబ్బింగ్ స్టాండర్డ్స్ ఉన్నా సరే, స్ట్రెయిట్ సినిమాతో సమానం మనకు… మన తెలుగు హీరోలకు తమిళనాట ఒక్క థియేటర్ దొరక్కపోయినా సరే, తమిళ సినిమాలకు ఏపీ, తెలంగాణల్లో వందల థియేటర్లు దొరుకుతాయి…
డిస్ట్రిబ్యూటర్ల మాఫియా ఉంది కదా… కంగువాకు థియేటర్ల సర్దుబాటులో తన్నుకున్నాయి… అది వేరే కథ… సరే, ఈ కంగువ సినిమాకు వస్తే… వర్తమానం నుంచి 1000 ఏళ్ల గతానికి దర్శకుడు లాక్కుపోతాడు… ఏవో తెగలు, పోరాటాలు… సగం అర్థమవుతూ ఉంటుంది… సగం అరవ ట్యూన్లలా అస్సలు బుర్రకు ఎక్కదు… కథ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు… ఏదో ఫాంటసీ… ఏదో ఓ పిచ్చి కథ…
మొన్నెవడో చెప్పాడు కదా… స్టార్ హీరోల సినిమాలకు కథలెందుకూ అని…! నిజమే… కానీ సగటు ప్రేక్షకుడిని మెప్పించే, రక్తికట్టించే కథనమైనా ఉండాలి కదా… అదీ లేదు ఈ సినిమాలో..! ది గ్రేట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం… చాలాచోట్ల మరీ అతిగా మోగించాడు బీజీఎం… నేపథ్యసంగీతం అంటే చెవులు పగిలిపోవడం కాదోయీ డీఎస్పీ…
ఇప్పుడు ఎవరో ఓ బాలీవుడ్ మొహాన్ని విలన్‌గా లేదా మరో ప్రధాన పాత్రలోకి తీసుకురావడం ట్రెండ్ కదా… ఎస్, బాబీ డియోల్‌ను తెచ్చారు… దిశా పటానీని కూడా పట్టుకొచ్చారు… కానీ ఏం లాభం..? సీన్లు పండితే కదా… ఫస్టాఫ్ అరగంట, ముప్పావు గంట బోర్… యోగిబాబు కామెడీ ఇంకో వికారం… ఎన్నాళ్లు రుద్దుతారురా బాబూ తనను..?
అన్నట్లు, ఇప్పుడు మరో ట్రెండ్ తెలుసు కదా…? క్లైమాక్సులో ఏదో పిచ్చి ట్విస్టు ఇచ్చేసి, సీక్వెల్‌కు దారి వేయడం… ఇదీ అంతే… అబ్బో, దీనికి మరో పార్ట్-2 ఉంటుందట జాగ్రత్తరోయ్ అని హెచ్చరిక… సారీ, సూర్యా… మెప్పించలేకపోయావు… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్…!! కార్తితో నీ వార్ సెకండ్ పార్ట్‌లోనైనా రక్తికట్టేలా చూసుకో కాస్త..!!
ఇంతకీ చూడొచ్చునంటారా అనేదేనా మీ ప్రశ్న… మట్కాలు దేనికి..? కంగువాలు దేనికి..? క, లక్కీ భాస్కర్, అమరన్ ఇంకా థియేటర్లలోనే ఉన్నాయి… చూడొచ్చు..!!
Share this Article