Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి…

October 16, 2025 by M S R

.

“పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు…” అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని… అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు.

అలాంటి పోతన తెలుగు మందార మకరంద మాధుర్యమున ఓలలాడించిన పరమోత్కృష్ట భాగవతాన్ని ఎక్కడ రాజులకు అంకితం ఇస్తాడో అని సాక్షాత్తు సరస్వతీ దేవి బాధపడి… ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటే-

Ads

“కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!”

….. అని పోతన హామీ ఇచ్చాడు. ఆమె సంతోషించి పోతనకు మరింతగా తెలుగు భాషలో పౌష్ఠికాహారాన్ని చేసి పెట్టింది.

అయిదు శతాబ్దాలతరువాత ఇప్పుడు మళ్ళీ అదే తెలుగు సరస్వతి కాటుక కంటినీరు బుగ్గలపైనే కాకుండా ఒళ్ళంతా తడిసేలా ఒకటే ఏడుస్తోంది. చదువులతల్లి సరస్వతీ దేవి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు చదువు బాగా ఒంటపడుతుంది. జ్ఞానం వికసిస్తుంది. బుద్ధిమంతులవుతారు. వృద్ధిలోకి వస్తారు.

అలాంటి ఓ సరస్వతి ఆలయంలో ఓం ప్రథమంగా అక్షరాభ్యాసానికి వెళ్లేదారిని సూచించే బోర్డును చూసి అక్షరాభ్యాసం చేయించే సరస్వతీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. “అక్షరభ్యసమునకు వేళ్ళు దారి” అని తాటికాయంత అక్షరాలతో గుడ్డివారికైనా కనిపించేలా రాసిపెట్టారు.

telugu

సరస్వతీదేవి ఆలయంలో బోర్డు కాబట్టి… అందునా అక్షరాభ్యాసానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పులు ఉండకూడదు అని అనుకోవడం తప్పు. ఇంగ్లిష్ లో తప్పు రాస్తే బాధపడాలికానీ… తెలుగులో ఇలాంటి తప్పులు సహజం అని లోకం దశాబ్దాల క్రితమే పెద్దమనసుతో అంగీకరించింది! ఈ తప్పులో కొన్ని తాత్విక సంకేతాలు దాగి ఉన్నాయి. వాస్తవానికి ప్రతీకగా ఉంది.

తెలుగులో “అక్షరభ్యసం” చేస్తే చాలు. అది మన జీవనదారుల్లో బాగా వేళ్ళుతన్ని తెగులు చెట్టుగా ఏపుగా, బలంగా పెరుగుతుంది. ఈ సంకల్పానికి తగినట్లు తెలుగులో చక్కగా రాశారు. ఈ బోర్డు ఎక్కడుందో ప్రభుత్వ దేవదాయ శాఖ కనుక్కుని… అన్ని దేవాలయాల్లో ఇలాంటి తెలుగు “వేళ్ళుదారి” బోర్డులే పెట్టించాలి.

అప్పుడు మన పిల్లల అక్షరాభ్యాసానికి ఆ దారుల్లో తెగులు వేళ్ళే దిక్కు! పాపం… ప్రభుత్వానికి ఒక్కో “అక్షరభ్యసముకు” వచ్చే వెయ్యి రూపాయల ఆదాయం మీద ఉన్న దృష్టి… అక్షరదోషాల మీద ఉండదు. ఎందుకంటే దానిపేరే “దేవాదాయ” శాఖ కాబట్టి!

తెలుగులో అక్షరాభ్యాసం ఇలా మొదలైతే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ ఫార్మ్ లను తెలిపే బోర్డులో ఇంగ్లిష్, హిందీలో లేని తప్పు తెలుగులో మాత్రమే వచ్చి…దారి కాస్తా “ధారీ” అయ్యింది. గిరిధారీలా ఇది ప్లాట్ “ఫార్మ్ ధారీ” అంటే ప్లాట్ ఫార్మ్ ను ధరించినవాడు అనే అర్థంలో కొత్తమాటను పుట్టించి ఉంటే… మన అజ్ఞానం క్షమింపబడుగాక!

telugu

డాబర్ రెడ్ టూత్ పేస్ట్ వాడైతే ఏకంగా రోజూ ఉదయాన్నే కన్నడ రాళ్లతో తెలుగువాళ్ళ పళ్ళు ఊడగొట్టి తెలుగువారి చేతిలోనే పెడుతున్నాడు. “దేశంలో తయారైంది- దెశావు ప్రీతి (ఇందులో మొదటి పదం కన్నడ- రెండో పదం తెలుగుగా భావించవలెను) అని కన్నడలో కూడా తప్పుగానే రాసి… కన్నడ లిపితోపాటు తెలుగు ప్రకటనలో భాషాతీత సిద్ధిని సాధించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు! వాడే శీర్షికలో అన్నట్లు తెలుగు కొత్త అవతారమిది!

“దెశావు” ప్రీతి అని రాశారు. “దేశద ప్రీతి” అని ఉండాలి కన్నడ భాష- తెలుగు లిపి అయితే! రాతలో ప్రీతి అనేది కూడా తప్పు. కన్నడ లిపిలో “ಪ್ರೀತಿ” అని రాయాలి. తెలుగు దేశంలోనే కాకుండా కన్నడ, మరాఠీ దేశంలో అన్నిచోట్లా సమస్త ప్రాతీయభాషల్లో దేశంలో గర్వంగా తయారవుతున్న అనువాద ప్రకటనల్లో భాష ఇలాగే అఘోరిస్తోంది!

telugu

బమ్మెర పోతన రాసిన అంతమంచి తెలుగు భాగవతాన్ని నీచమైన రాజులకు అంకితమిస్తాడేమోనని సరస్వతి అప్పుడు ఏడ్చింది. తన కోవెల కొలువుల్లోనే ఇంత నీచమైన తెలుగును చదవలేక ఇప్పుడు ఏడుస్తోంది. తెలుగు సరస్వతికి అప్పుడు, ఇప్పుడు, ఇంకెప్పటికీ ఏడుపు మాత్రం తప్పడం లేదు!

ఇన్నిన్ని భౌతికమైన, బౌద్ధికమైన దాడులు; నిర్లక్ష్యాలు; నిస్పృహలు; నైరాశ్యాలను దాటుకుని, తట్టుకుని తెలుగు ఈమాత్రం నిలబడుతోందంటే అది కేవలం కాకతాళీయం! మన పూర్వజన్మల పుణ్యఫలం- అంతే!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొండా ఫ్యామిలీ మారదు… ఫాఫం కాంగ్రెస్… అనుభవించు రాజా…
  • ఫాఫం మల్లోజుల… లొంగిపోయిన తుపాకీ అంటే అందరికీ అలుసే…
  • కన్నడ- తెలుగు సంకర భాష… తెలుగుకు ఇదోరకం చేతబడి…
  • ఊదు కాలదు, పీరు లేవదు… ఆ ఎల్లమ్మ కథ ఎటూ తేలదు…
  • మిత్రమండలి..! మనకు మనమే చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాల్సిందే..!!
  • ఈ సినిమా ఒకటి చేసినట్టు బహుశా చిరంజీవికీ గుర్తుండి ఉండదు..!!
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్… ప్రపంచం నేర్పిన పాఠాలు…
  • నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!
  • ఈ పాట పీక పిసికిన హంతకుడెవరు..? ఈమె ఎందుకు మూగబోయింది..!?
  • లొంగుబాటలో తుపాకీ..! మల్లోజుల బాటలోనే ఆశన్న… మరో దెబ్బ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions