.
ఫాఫం, ఏమిటో గానీ, అన్నీ ఈ కుటుంబానికే వస్తాయి…. శివయ్యా, అని పిలిచినందుకు కాపాడావయ్యా… ఆమె ఎవరో గానీ నీకు అభినందనలమ్మా… దేవుడా, నువ్వున్నావయ్యా…… కన్నప్ప సినిమా బాపతు హార్డ్ డిస్క్ ఎవరో ఎత్తుకుపోయారనే వార్త తరువాత ఇలాంటివే బోలెడు పంచులు సోషల్ మీడియాలో…
నిజానికి ఇక్కడ జరిగింది ఓ అక్రమం, చోరీ, ద్రోహం, కుట్ర… పేరు ఏదైనా సరే, మంచు విష్ణుకు తలనొప్పి… ఎంతోకొంత నష్టం… ఒకింత సానుభూతి వ్యక్తం అవుతుందని అనుకుంటాం కదా, దానికి రివర్స్ ట్రోలింగ్ సాగుతోంది… అంటే మంచు కుటుంబం తమ మీద నెగెటివిటీ ఎంత ఉందో ఓసారి సీరియస్‌గా ఆత్మమథనం చేసుకోవాలి…
Ads
భలేవారే, అలా చేసుకునే వారయితే ఈ దురవస్థ ఎందుకు అంటారా..? శివయ్యా అనే డైలాగ్ మీద బోలెడు ట్రోలింగ్… హీరోయిన్ డ్రెస్సింగు మీద మరీ వ్యతిరేకత వ్యక్తమైంది కూడా… సరే, కానీ ఈ వార్తకు సంబంధించి కొన్ని డౌట్లు పొద్దున్నుంచీ అదే పనిగా కొట్టేస్తున్నాయి…
ఆ హార్డ్ డిస్కులో కన్నప్ప మూవీకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల బాపతు వీఎఫ్ఎక్స్ ఫీడ్ ఉంది… అంతేకదా… ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ ఆ హార్డ్ డిస్కును డీటీడీసీ కొరియర్ సర్వీసు ద్వారా ఫిలిమ్‌నగర్‌లోని విజయకుమార్‌కు పంపించారు… ఆయన ఎవరూ..? కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్…
ఆ పార్శిల్ తీసుకున్నది ఆఫీస్ బాయ్ రఘు… తను తీసుకెళ్లి చరిత అనే మరో స్టాఫ్‌కు అప్పగించాడు… తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు, వాళ్లు జంప్, కనిపించడం లేదు… దాంతో సదరు 24 ఫ్రేమ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… తమ ప్రాజెక్టుకు కావాలని నష్టం చేకూర్చడానికి ఎవరో దురుద్దేశంతో చేస్తున్న చర్య అని తన ఆరోపణ…
ఇక్కడ డౌట్లు ఏమిటంటే… కోట్లకుకోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న సినిమాలోని కీలకమైన వీఎఫ్ఎక్స్ ఫీడ్ ఉన్న హార్డ్ డిస్కును మరీ డీటీడీసీ ద్వారా పంపించడం ఏమిటి..? ఎవరితోనైనా పంపించవచ్చు లేదా ఎవరినైనా ముంబై పంపించి తెప్పించుకోవచ్చు కదా…
మరీ అంత నిర్లక్ష్యంగా ఆఫీస్ బాయ్‌కు డెలివరీ చేయడం ఏమిటి..? తరువాత మరో లేడీ ఎంప్లాయితో కలిసి తప్పించుకు తిరగడం ఏమిటి..? సరే, సదరు స్టూడియోలో ఒరిజినల్ ఫీడ్ కాపీ మరొకటి అలాగే ఉండవచ్చు, పెద్ద నష్టమేమీ ఉండకపోవచ్చు కానీ… నిజంగానే ఆ ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రలు ఏమైనా సాగుతున్నాయా..? అయితే ఎవరు వాళ్లు..? అది ఖచ్చితంగా తేలాల్సిందే…
ఇప్పుడు ఇలా ఇక్కడ జరిగింది, రేప్పొద్దున మరో ప్రొడక్షన్ కంపెనీలో జరగొద్దని ఏముంది..? ఇంకా నయం, దీని వెనుక మంచు మనోజ్ ఉన్నాడనే విమర్శలు ఇప్పటికైతే రాలేదు… ఆ కుటుంబ సభ్యుల నడుమ భగ్గుమంటున్నాయి కదా పంచాయితీలు…
అంతమంది అతిరథులున్నారు సినిమాలో… వందో నూటాాయాభయ్యో కోట్లు పెడుతున్నారట… ఎక్కడెక్కడో షూటింగులు చేశారు… మరీ ఇంత నిర్లక్ష్యంగా కీలకమైన ఫీడ్‌ను గాలికి వదిలేసినట్టుగా మరీ డీటీడీసీలో పంపిస్తారా..? పోనీ, ట్రాక్ చేసుకుంటూ డెలివరీ టైమ్‌కు ముఖ్యులు ఎవరైనా ఆఫీసులో ఉండి తీసుకోవాలి కదా… ప్చ్, నిజమే… వీళ్లు ఏది చేసినా ఆశ్చర్యమే..!!
అవునూ, కన్నప్ప సినిమాను తమ సినిమాకు పోటీగా భావించే నిర్మాతలు ఎవరున్నారు ఇప్పుడు..? ఏమిటా పెద్ద సినిమాలు..? ఈ డౌట్స్ మరీ ఎక్కువగా కొట్టేస్తున్నాయబ్బా..!!
Share this Article