హిందీ ఆరాధన చూడనివారికి బాగా నచ్చే సినిమా 1974 సంక్రాంతికి రిలీజయిన ఈ కన్నవారి కలలు సినిమా . ఆరాధన సినిమా ఓ మాస్టర్ పీస్ . కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే , రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది . మా నరసరావుపేట సత్యనారాయణ టాకీసులో వారం రోజులు ఆడితే నేను ఆరు రోజులు చూసా .
అప్పట్లో హిందీ సినిమాలు మా ఊళ్ళో నైట్ షోలు వేసేవారు కారు . చాలా కొద్ది సినిమాలు అలా పడేవి . An evening in Paris , Bobby , సంగం నాకు గుర్తున్న సినిమాలు . ఈ ఆరాధన నైట్ షోగానే వేసారు . మా కాలేజి అబ్బాయిలు , అమ్మాయిలు అందరూ ఆ థియేటర్లోనే . రాజేష్ ఖన్నా , షర్మిలా టాగోర్ పోటాపోటీగా నటించారు . అశోక్ కుమార్ కనిపించేది కాసేపయినా మరచిపోలేం .
ఇంక S D బర్మన్ సంగీతం అద్భుతం . రూపే తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా , మేరీ సప్నోంకి రాణీ , కోరా కాగజ్ థా యే మేరా , గున్ గున్ రహాహై భ్రమర్ , చందా హైతూ మేరా సూరజ్ హై తూ , బాహుమే బహార్ హై తుంకో ముఝ్ సే ప్యార్ హై పాటలు , నేపధ్య సంగీతం సూపర్ . ఆరాధన సినిమాను తెలుగు , తమిళం , బెంగాలీ భాషల్లో రీమేక్ చేసారు . అమెరికన్ సినిమా అయిన To each his own ఆరాధనకు ఆధారం . మన తెలుగు సినిమాకు వద్దాం .
Ads
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది . మోహన్ బాబు మొదటిసారిగా ఈ సినిమాలోనే నటించారు . టైటిల్సులో యం భక్తా చౌదరి అనే పేరు ఉంటుంది . ఏ పాత్రలో నటించారో చెప్పండి చూద్దాం .
శోభన్ బాబు తండ్రి , కొడుకు పాత్రల్లో గొప్పగా నటించారు . వాణిశ్రీ గురించి చెప్పేదేముంది ! షర్మిలా టాగోర్ తో సమానంగా నటించింది . She may not look as gracious as Sharmila Tagore . కానీ , నటనలో సమానంగా నటించింది . ఇతర పాత్రల్లో లత , రామకృష్ణ , గుమ్మడి , ధూళిపాళ , ప్రభాకరరెడ్డి , కాకరాల , గీతాంజలి , ఝాన్సీ , త్యాగరాజు ప్రభృతులు నటించారు .
వి కుమార్ సంగీత దర్శకత్వంలో మధు ఒలకపోసే నీ చిలిపి కళ్ళు పాట సూపర్ హిట్ సాంగ్ . నేను ఇప్పటికీ నాకు తెలియకుండానే హం చేస్తుంటా . ఒకనాటి మాట కాదు , రాధా రాధా రాధా పులకింతరాదా , చెలి చూపులోన , సారీ సో సారీ పాటలు శ్రావ్యంగా ఉంటాయి . యస్ యస్ బాలన్ స్వీయ దర్శకత్వంలో జెమిని బేనర్లో నిర్మించారు . రాజశ్రీ డైలాగులు బాగుంటాయి .
ఆరాధన సినిమాలో రూప్ తేరా మస్తానా ప్యార్ మేరా దీవానా పాటతో పోల్చినప్పుడు చెలి చూపులోన పాట తేలిపోతుంది . అందుకే చెప్పా . ఆరాధన చూడని వారికి కన్నవారి కలలు బాగా నచ్చుతుంది అని . Even then , మన తెలుగు సినిమా కూడా బాగానే ఆడింది . శోభన్ బాబు – వాణిశ్రీ జోడీ , సినిమా కధ మహిళలకు బాగా నచ్చింది .
రెండు సినిమాలూ యూట్యూబులో ఉన్నాయి . Unmissable , romantic , feel good movies . ఆరాధన ఓ గొప్ప మ్యూజికల్ హిట్ . ఓ మ్యూజికల్ సెన్సేషన్ . రెండు సినిమాలూ తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article