మీకు నాటునాటు పాట నచ్చలేదా..? దానికి ఆస్కార్ రావడం నచ్చలేదా..? ఈ ప్రశ్న ఎదురైంది… సింపుల్, ఆ పాటలో సాహిత్య విలువల్లేవు, సంగీత విలువల్లేవు… ప్యూర్ కమర్షియల్ వాసనగొట్టే ఆ పాట నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు… దిక్కుమాలిన మన సినిమాల్లో పాటలు ఎలాగూ అలాగే ఏడుస్తయ్… కానీ ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడమే నచ్చలేదు…
అదేమిటి..? ఓ నెత్తిమాశిన పాటను ఆస్కార్ దాకా తీసుకెళ్లి… అన్ని కోట్లు ఖర్చుపెట్టి… ఎందరినో ‘‘సంతృప్తిపరిచి’’… లాబీయింగ్ చేసి… తొలిసారిగా ఓ తెలుగుపాటకు ఆస్కార్ కిరీటం పెట్టించిన రాజమౌళి ప్రతిభను చూసైనా మెచ్చుకోవాలి కదా… ఇది మరో అనుబంధ ప్రశ్న… నిజమే, ఈ కోణం ఆలోచించలేదు… అవునవును, రాజమౌళిది ప్రతిభే… కాకపోతే డబ్బుకు ఆస్కార్ దాసోహం అనుకున్నప్పుడే నవ్వొస్తోంది…
ఊ అంటావా, ఊఊ అంటావా సినిమా పాటను గనుక రాజమౌళి కొడుకు కార్తికేయకు అప్పగిస్తే… డబ్బు మూటలు కూడా ఇస్తే… దానికీ ఆస్కార్ తెప్పించి ఉండేవాడు… దేవిశ్రీప్రసాద్ వేదిక మీదే ఆడుతూ, అన్నొచ్చిండు హెయ్, డప్పందుకో హెయ్, పీకందుకో హెయ్ అని పాడుతూ ఆస్కార్ ప్రైజు అందుకునేవాడు… అదే చంద్రబోస్ కూడా అక్కడే ఉండేవాడు… వీలయితే సమంతకు, పాడిన ఇంద్రావతికి కూడా ఆస్కార్లు ఇప్పించేవాడు…
Ads
ఈ ఆలోచనల నడుమ అనిపించింది ఏమిటయ్యా అంటే… ఈ డబ్బు ఖర్చులతో కొనుక్కునే లేదా లాబీయింగుతో పొందే ఆ అవార్డులకన్నా కాంతార సాధించిన విజయం అపూర్వం కదా అనిపించింది… ఏమిటి..? అది సాధించిన విజయం అంటారా..? ఈరోజు ఐక్యరాజ్యసమితిలో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు… ఇందులో కోట్ల ఖర్చు లేదు, లాబీయింగు లేదు… గెట్‌టుగెదర్ ఇతరత్రా ప్రలోభాలు లేవు, ఈ చిత్ర ప్రదర్శనకు హీరో, దర్శకుడు రిషబ్ శెట్టిని కూడా పిలిచారు…
అసలు ఇది కదా గౌరవం… ఇది కదా అసలైన గుర్తింపు… ఎన్ని ఆస్కార్లు కలిస్తే ఈ గౌరవం… ఈ సినిమా ప్రదర్శనకు ఐరాస ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు… ఏమాత్రం చాన్స్ దొరికినా సరే రిషబ్ ఇండియన్ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడతాడు… ఆ ఆస్కార్ వేదికపై కీరవాణి ఏవో నాలుగు ముక్కలు ఇంగ్లిషులో పాడి, తన నిజమైన రేంజ్ నిరూపించుకున్నాడు… భారతీయ సంగీతం గురించి రెండే వాక్యాల్లో చెప్పగలిగితే తన కెరీర్ సార్థకమయ్యేది… అంత సీన్ ఎక్కడేడ్చింది…
కాంతార కంటెంటులో మనం ఎంతసేపూ భూతకోల గురించి, దేవుడు ఆవహించడం గురించే మాట్లాడుతున్నాం కానీ సినిమాలో అడవుల పరిరక్షణ, అడవులే ప్రపంచంగా బతికే జాతుల గురించి, పర్యావరణం గురించిన చర్చ అంతర్లీనంగా సాగింది… ఈ సినిమాకు ప్రీక్వెల్ గురించి కూడా మాట్లాడాల్సిన పనిలేదు ఇక్కడ… 15 కోట్లతో తీసి 400 కోట్లు కుమ్మేసిన విజయం గురించి కూడా కాదు, ఐక్యరాజ్యసమితి దాకా తీసుకెళ్లిన విశిష్టత గురించే ఈ కథనం..!!
Share this Article