.
కాంతార… వూఁఁఁఁఁ అంటూ థియేటర్లు మోతమోగిపోయాయి అప్పట్లో… ఓ మామూలు కన్నడ సినిమా అనుకున్నది కాస్తా పాన్ ఇండియా సినిమాగా మారి… పర్టిక్యులర్‌గా హిందీ బెల్టును ఊపేసింది… వందల కోట్లు… బంపర్ హిట్ సినిమా…
నిజానికి ఆ సినిమాలో ఫస్టాఫ్ రొటీన్ టిపికల్ కన్నడ సినిమా… సెకండాఫ్‌లో, మరీ క్లైమాక్సులో పీక్స్‌కు తీసుకుపోతాడు కథను, ప్రజెంటేషన్‌ను… ఇప్పుడు దానికి ప్రీక్వెల్ వచ్చింది… కాంతార చాప్టర్ వన్… ఈసారి సినిమా మీద మరింత మంచి కసరత్తు చేశాడు రిషబ్ శెట్టి…
Ads
దర్శకత్వం తనే… లీడ్ యాక్టర్ తనే… డబ్బు పెట్టింది మాత్రం అదే కాంతార తీసిన హొంబలే ఫిలిమ్స్… ఈ సినిమాలో కూడా ఫస్టాఫ్ పెద్ద ఇంపాక్ట్ అనిపించదు… కానీ సెకండాఫ్ నుంచి జోరు మొదలై క్లైమాక్స్ లో చాముండిగా పీక్స్‌కు తీసుకుపోతాడు దర్శకుడు…
సంగీతం, వీఎఫ్ఎక్స్, నటనల సరైన మేళవింపు… యాక్షన్, జానపదం, డ్రామా, దైవత్వం మేళవింపు… రిషబ్ శెట్టి స్ట్రయిక్స్ అగెయిన్… అయితే ఇంకొన్ని విషయాలు చెప్పుకోవాలి… (యూఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
తెలుగు ప్రిరిలీజు ఫంక్షన్‌లో హీరో కన్నడంలో మాట్లాడటం…, మన సినిమాలను కన్నడనాట ప్రోత్సహించకపోవడం, అడ్డంకులు క్రియేట్ చేయడం.., ఈ డబ్బింగ్ సినిమాకు అత్యంత భారీ విశాల హృదయంతో ఏపీలో టికెట్ రేట్లు పెంచడం వంటి ఇతర అంశాలను పక్కన బెట్టి… కేవలం సినిమా విశ్లేషణకు వస్తే… రిషబ్ శెట్టి బాగా చేశాడు… సినిమాను థియేటర్లలో చూస్తేనే ఆనందించేలా రూపొందించాడు…
కాంతార… చాప్టర్- 1 చిత్రం బేర్మ (రిషబ్ శెట్టి) అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది… అతను గ్రామీణ సంప్రదాయాలు, వాటికి పొంచి ఉన్న ముప్పు మధ్య నలిగిపోతాడు… తనకు దైవిక శక్తుల సపోర్ట్ ఏమిటనేది కథ…
రిషబ్ శెట్టి మరోసారి చెప్పుకోదగిన ప్రదర్శన ఇచ్చాడు…. ఇది తన కెరీర్‌లో మరో మైలురాయి… దర్శకత్వ బాధ్యతలను మోస్తున్నా, తెరపై తన నటనలో ఎక్కడా ఒత్తిడి ఎదురుకున్నట్టు కనిపించదు… ఈ సమతుల్యత సాధించడంలోనే తన విజయం ఉంది…
కాంతారలో ప్రశంసలు అందుకున్న దైవిక ఆవేశాన్ని (Divine Trance Act) ఇందులోనూ అద్భుతంగా పండించాడు… కొన్ని సన్నివేశాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు స్వచ్ఛందంగా చప్పట్లు కొట్టేంత ప్రభావం చూపించాడు…
రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది… ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు, సోసో అనిపిస్తుంది కానీ సెకండాఫ్ మధ్యభాగం నుంచీ ఆ పాత్రే కీలకంగా మారింది… తన స్క్రీన్ ప్రజెన్స్, నటన బాగున్నాయి… ఆ పాత్రకు సూటైంది…
గుల్షన్ దేవయ్య రాజు పాత్రలో.., (ఒక రకమైన విలన్ పాత్ర) మొదటి సగంలో ఆయన పాత్ర పేలవంగానే అనిపించింది…, నిజానికి సెకండాఫ్‌లో ఆ పాత్ర కీలకం… కానీ ఆశించినంత ఇంటెన్స్ రాలేదు… పైగా తెలుగు పూర్ డబ్బింగ్ మరో కారణం… ఈ పాత్ర, ఈ నటుడి విషయంలో రిషబ్ శెట్టి ఫెయిల్…
సినిమా అద్భుతమైన విజువల్స్‌తో మొదలవుతుంది… ప్రారంభం నుంచే Strong World-building కు తోడు కాస్త ఫన్ జోడించి, మెల్లిగానే కథలోకి తీసుకుపోతాడు… వినోదం బాగానే కలగలిపినా, మొదటి ‘కాంతార’ తో పోలిస్తే ఈ సినిమా స్థాయి (Scale) చాలా పెద్దది…
అద్భుతమైన విజువల్ క్వాలిటీ, మంచి కాస్టింగ్, ఆకట్టుకునే VFX ప్రధానంగా నిలుస్తాయి… ప్రారంభంలోని అడవి యాక్షన్ సీన్స్, రథం చేజింగ్ సన్నివేశం బాగా కుదిరాయి…
ఐతే అన్నీ బాగానే ఉన్నాయా..? లేవు… రైటింగులో లోపాలున్నాయి… డైలాగులు పెద్ద ఇంప్రెసివ్ కావు… ప్రత్యేకించి రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య పాత్రలు ఫస్టాఫ్‌లో పేలవ ప్రదర్శన… సెకండాఫ్‌లో పులి, దైవత్వ నమ్మకాలతో ముడిపెట్టే సీన్స్‌తో మొదలై సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది… ఇదే సినిమా బలం…
ఇంత ఖర్చుపెట్టిన నిర్మాతలు తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనబరిచారు… పూర్ వర్క్… (ట్రెయిలర్లు కూడా ఇంపాక్ట్ ఉండేలా కట్ చేయలేదు)… అలాగే ప్రీ-క్లైమాక్స్ కాస్త సాగదీత… కాకపోతే సేమ్, కాంతార ఫస్ట్ పార్టులోలాగే క్లైమాక్స్ బాగా కుదిరింది… మొత్తంగా మొదటి కాంతారకన్నా చాలా బెటర్ చాలా విషయాల్లో…
ఈసారి కూడా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ బీజీఎం సినిమాకు ప్రధాన బలం… అఫ్‌కోర్స్, కాంతార మొదటి సినిమాలో ఉన్నట్టు వరాహరూపం రేంజ్ పాట ఇందులో లేదు… వరాహరూపం ట్రెండీ రింగ్ టోన్, కాలర్ టోన్ అప్పట్లో… ఇప్పుడు ఈయన బీజీఎం పలు సీన్లను బాగా ఎలివేట్ చేసింది… నార్త్ బెల్ట్‌కు నచ్చే మరో సౌత్ సినిమా..!! అన్నట్టు… దీనికి సీక్వెల్ ఉండబోతోంది…
.
Share this Article