నాదం… కరిగించి నీరు చేయాలన్నా… మరిగించి పోరులో పరుగు తీయించాలన్నా నాదం… ప్రతి అవసరానికీ ఓ నిర్దిష్ట శృతి ఉంటుంది… రావణుడు శివుడిని పూజించే విధానం వేరు… అన్నమయ్య శ్రీవారిని కీర్తించే పద్ధతి వేరు… వాచికం ఒక్కటే సరిపోదు, ఏ నాదానికైనా ఆధరువులు సంగీత పరికరాలు… ప్రపంచమంతా ఇదే సూత్రం… ఎస్… సినిమాలు కూడా అంతే… మీరు వందల కోట్లతో గ్రాఫిక్స్ నింపినా సరే వేస్ట్.., సీన్‌కు తగిన బీజీఎం ఉంటేనే సీన్ పైకి లేస్తుంది… సీన్ కంటెంట్, క్రియేటివిటీ సూపర్ ఉన్నా సరే సరైన బీజీఎం లేకపోతే శుద్ధదండుగ…
గతంలో బీజీఎం అంటే ఫైటింగు సీన్ల వేళ డిష్యూం డిష్యూం… ఎవరైనా మరణించిన సీన్ ఉంటే వీణ లేదా ఫ్లూట్… అంతే… కానీ ఈరోజు పాటలు ఎవడూ దేకుతలేడు… కథలో సందర్భాన్ని బట్టి బీజీఎం సీన్‌ను ఎలివేట్ చేస్తుందాలేదా నిశితంగా గమనిస్తున్నాడు ప్రేక్షకుడు… ఆమధ్య థమన్ చెప్పాడు అఖండ సినిమాలో ఓ సీన్ కోసం 90 మందికిపై మ్యూజిషియన్లను వాడాననీ, దానికే కోటి రూపాయలు ఖర్చయిందనీ… నిజమే కావచ్చు, అఖండ సినిమా నడిచింది అంటే ప్రధాన కారణాల్లో బీజీఎం కూడా ఒకటి…
ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్, కేజీఎఫ్, కార్తికేయ, విక్రమ్, బింబిసార… దేని స్థాయిలో అది… బీజీఎం లేకుండా సక్సెస్ కాలేదు… ఇప్పుడు కాంతారా… ఇది మరింత అచ్చంగా బీజీఎం సినిమా… నేపథ్య సంగీతంతో అద్భుతాలు ఎలా చేయవచ్చో చూపించాడు సంగీత దర్శకుడు… పేరు అజనీష్ లోకనాథ్… తను బీజీఎంకు ఎంత ఫేమస్ అయిపోయాడూ అంటే కొన్ని సినిమాలకు కేవలం బీజీఎం మాత్రమే చేసి, పాటల్ని వేరేవాళ్లకు వదిలేశాడు… 2009 నుంచి ఫీల్డ్‌లో ఉన్న ఆయనకు కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి మంచి దోస్త్… ఎంత అంటే..? అజనీష్ లేకుండా రిషబ్ సినిమా లేదు… అంత… ష్, ఇప్పుడు తన చేతిలో ఉన్న సినిమాల సంఖ్య ఏకంగా 14…
Ads
అన్ని సినిమాల్లాగే దీనికీ బీజీఎం కొట్టేస్తే సరి అనుకున్నాడు మొదట్లో… రిషబ్ నవ్వి, అలా చేస్తే నువ్వే ఎందుకు అన్నాడు… మట్టిపరిమళం నుంచి, చెట్ల స్పర్శల నుంచి, ఊరి మూలాల నుంచి బీజీఎం కావాలి అన్నాడు… అజనీష్‌కు ముందు అర్థం కాలేదు… తరువాత సినిమాలో ఉపయోగించిన కళారూపాల ఒరిజినల్ ధ్వనులను రికార్డు చేసుకున్నాడు… ఓఉయ్ అనే పిలుపు అదే… బ్యాక్ డ్రాప్‌లో ఏవో నాలుగు సంస్కృత శ్లోకాలు సరిపోవు… జానపదాల్లో అవి సూట్ కావు… ప్రయోగాలకు రెడీ అయిపోయాడు…
హీరో కంబళ పోటీలు, ఎంట్రీకి సంబంధించి జస్ట్, లోకల్ డోలు, ఫ్లూట్ మాత్రమే వాడాడు అజనీష్… తను ఎప్పుడో కనెక్టయిన ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం డిడ్జిరెదూను బయటికి తీశాడు… దానికి తోడుగా సన్నటి ఈలను కలుపుతూ కజూ… నేపథ్యంగా టిబెటన్ల తరహా మంత్రపఠనం… సాధారణంగా దైవపూజలో వాడే ఢమరు, గజ్జె సరేసరి… బీజీఎంతో సరిసమానంగా ఉండాలి వరాహరూపం దైవవరిష్టం పాట… కర్నాటక సంగీతంలోని తోడి, వరళి, ముఖరి రాగాలను బ్లెండ్ చేసి, జానపదాన్ని రంగరించి పాడించాడు… సినిమాలో అదొక హైలైట్… సో, బీజీఎంకు ఓ కొత్త బెంచ్ మార్క్ ఫిక్స్ చేసిపెట్టాడు సంగీత దర్శకుడు… పంటలు ఎండిపోయిన ముసలి పొలాల్లో తెలుగు ఇండస్ట్రీ పరిగె ఏరుకుంటుంటే… కన్నడ ప్రతిభ కొత్త క్రియేటివిటీతో కొత్త పంటలు సాగుచేసుకుంటోంది…!!
Share this Article