ఏ సినిమా గురించి ఎవరేం రాస్తున్నా, ఎవరేం భుజాలు చరుచుకుంటున్నా సరే… వర్తమానంలో అందరూ విభ్రాంతిగా చూస్తున్న ఓ సెన్సేషన్ కాంతారా…! ప్రత్యేకించి కర్నాటక ఈ సినిమాను తన ప్రైడ్ అంటోంది… మరీ ప్రత్యేకించి మంగళూరు, తుళు ప్రాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది థియేటర్లలో… ఆ ప్రాంత సినిమా హాళ్లలో జాతరలు జరుగుతున్నాయి… పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళులు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు…
మిగతా భాషల్లో అడ్డంగా ఫెయిలైనా సరే, తమిళనాట సంచలన విజయం… కారణం, అది వాళ్ల హృదయాల్ని గెలుచుకోవడం… మరి… ఒక్క సినిమా… ఇంతమంది తోపులు ఉన్నారు కదా, ఇదీ మా సినిమా అని తెలుగుజనం ప్రైడ్‌గా ఫీలైన సినిమా ఏది..? అదీ ఒక ప్రాంతం లేదా ఒక సమాజం ఆర్ సమూహం గుండెలకు ఆర్తిగా హత్తుకున్న సినిమా ఒక్కటైనా ఉందా..?
అరువు కథలు, అక్కరకురాని బిల్డప్పులు… తెలుగు సమాజం ఇంతగా ఇచ్చింది కదా, మీ బతుకులకు మీ నుంచి సిన్సియర్‌గా ఏమైనా ‘గొప్పగా’ చెప్పుకునే రివర్స్ కంట్రిబ్యూషన్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా..? ఇంకా ఎంత దోచుకుందాం..? ఇదే లోకం… ఇదే రంది, ఇదే యావ… నిజాయితీగా ఒక ప్రాంతం ఆటను, పాటను, సంస్కృతిని, అలవాట్లను, బతుకు వెతల్ని, సంబురాల్ని ఓ ఎమోషనల్ కథలో ఇమిడ్చే ఒక్క ప్రయత్నం జరిగిందా..? లేదు…
Ads
ఎక్కడెక్కడి కథల్నో ఎత్తుకొచ్చి, దానికి మస్తు బిల్డప్పులు యాడ్ చేసుకుని, భుజకీర్తులు తగిలించుకుని, ఒరిజినల్ సినిమా వాడు చూస్తే అక్కడే గుండెపోటుకు గురయ్యేంత మార్పులు చేసి… నానా కంగాళీ చేసేయడం తప్ప, అచ్చమైన ‘మన కథ’ కోసం ప్రయత్నించింది ఎక్కడ..? లేవా..? తెలుగులో కథలు రాసేవాళ్లు లేరా..? ఇండస్ట్రీ దివాలా తీసిందా..? అయితే కారకులు ఎవరు..? కథలు రాసేవాళ్లు లేకపోవడం ఏమిటి..? దేశం మెచ్చేలా మస్తు కథలు రాస్తున్నడు, కథలు చెడుతున్నడు, కథలు పడుతున్నడు అనేకదా మొన్న ఒకాయనకు ఏకంగా రాజ్యసభ సభ్యత్వమే ఇచ్చారు…
మనది హీరోస్వామ్యం… హీరో చెప్పినట్టే సినిమా… చివరకు షూటింగు దగ్గర చాయ్ సప్లయర్ ఎవరుండాలో కూడా హీరోయే ఖరారు చేయాలి… అంత దరిద్రం మనది… మిగతావాళ్లందరూ దిష్టిబొమ్మలే… ప్రత్యేకించి దర్శకుడు… ఫెయిలైతే ఆ నింద మోయడానికి ఉపయోగపడే ఓ బకరా… ఓ నటుడికి కడుపులో ఓ కసి ఉండాలి… అది ఓ మంచి పాత్ర కోసం తపించాలి… ఇందరు హీరోలు, ఇన్ని సినిమాలు… ఆ ఎదవ బిల్డప్పులు తప్ప ఒక్క హీరో అయినా ఈమధ్య ఏదైనా భిన్నమైన వేషానికి సాహసించారా..?
ఇక్కడ బాలయ్య విభిన్నం… అఖండలో అఘోరా వేషాన్ని ఎందుకో భయపడి, కాస్త నాగరికంగా మార్చారు గానీ, టోటల్‌గా ఆ పాత్ర వేరు, దాని కేరక్టర్ వేరు… దాని లోపాలు దానికున్నయ్, కానీ ఓ ప్రయోగ ప్రయత్నం… అలాగే వెంకటేశ్ నారప్ప కాస్త బెటర్… నిజం చెప్పాలంటే వెంకటేశ్‌కు తగినట్టు దాన్ని తెలుగీకరించడంలో ఆ పాత్ర ఆహార్యం ఎట్సెట్రా దెబ్బతినేశాయి… మన హీరోల్లో కంప్లీట్ ఓ భిన్నమైన పాత్రల్ని ధైర్యంగా చేసింది పుష్పలో బన్నీ, రంగస్థలంలో రాంచరణ్…
కథలు లేవని కాదు… వాటిని పట్టుకోవడం ఇండస్ట్రీ పెద్దలకు తెలియదు… పైగా ఇక్కడ కథలుంటే రీమేకుల కోసం ఎందుకు వెళ్తామని వెకిలి కూతలు… తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో… ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా… కథలు, ప్రయోగాలకు అంటే ఎవర్ రెడీ… ఆ పాత్రలకు హీరోలు కూడా రెడీ… పాత్రల్లో హీరోలో దూరతారు తప్ప, సో కాల్డ్ హీరోల ఇమేజుల్లోకి ఆ పాత్రల్ని జొప్పించరు… (అర్థమైంది కదా)…
కథల్ని, కథకుల్ని నిందించడం మానేసి, కాంతారా వంటి సినిమాల్ని కలలు గనండి తోపు హీరోలూ… మీ మొహాలకు కనీసం గ్రాఫిక్సుల్లో కంబాలా ఆడండి… భూత కళ యక్షగానం వేషం వేసి కనీసం ఒక్కశాతం న్యాయం చేయండి… జనం నాలుగు రోజులు గుండెల్లో పెట్టుకుంటారు… అబ్బే, మనకు అడ్డమైన జిన్నాలు, గాడ్‌ఫాదర్లు, ఘోస్టులు, మన్నూమశానాలు… ఓ డ్రగ్గర్, పదీఇరవై ఏళ్లుగా ఒకటేరకం పాత్రలు, అదే మొనాటనస్ ఫోజులు, చెత్త స్టెప్పులు… ఒక్క హిట్ లేదు, ఐనా ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలున్నయ్… అవునులెండి… జనంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది…
Share this Article