.
కాంతారా సినిమా ప్రీక్వెల్ ‘కాంతారా చాప్టర్ -1’ టికెట్ ధరలు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది… ఇక్కడ కొన్ని అంశాలు చెప్పుకోవాల్సి ఉంది మనం…
ముందుగా ఓ వార్త చదవండి… టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వ సమర్థన ఇది… ‘‘కళ మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు… తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని ఇక్కడ మనం ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు, పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పారు…
Ads
కళ అనేది భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు… సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్న కనపరిచింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం…
తెలుగు సినిమాలకు కర్ణాటక రాష్ట్రంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదని కొందరు పేర్కొన్నారు… తెలుగు సినిమా సినిమా పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగిస్తున్నారు… ఐనా కన్నడ సినీ పరిశ్రమ నుంచి సరైన స్పందన రావడం లేదు, ‘ఆర్.ఆర్.ఆర్.’ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, తాజాగా ‘ఓ.జి.’ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు… అక్కడ తెలుగు సినిమాకు టికెట్ ధరల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు…
ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ “కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి…” అన్నారు…
ఇదీ వార్త… స్థూలంగా చూస్తే గుడ్… కాంతార తెలుగు బయ్యర్ల ప్రయోజనం కోసం టికెట్ ధరలను పెంచితే పెంచారేమో… కానీ.. కళ, పెద్ద మనసు, జాతీయ భావనలు వంటి పెద్ద పెద్ద పడికట్టు పదాలతో సమర్థన దేనికి..? ఎందుకంటే..?
1) కళ మనుషుల్ని కలపాలి కరెక్టే కానీ టికెట్ ధరలు పెంచితేనే కళకు ప్రోత్సాహమా..? మరి ఆ కళ మరింతగా జనానికి చేరువ కావాలంటే సినిమా టికెట్ ధరలు పెంచడం కాదు, తగ్గించాలి, అప్పుడు ఎక్కువ మంది ఆ సినిమాను చూస్తారు… ఆ కళ మరింతగా జనంలోకి వెళ్తుంది… అంతగా కళను ప్రోత్సహించదలిస్తే పన్ను రాయితీ ఇవ్వండి… ధరలు పెంచి, ప్రేక్షకుల జేబుల నుంచి డబ్బు తీసుకుంటూ కళ, జాతీయ భావన, మంచి మనసు మాటలేమిటి..?
2) బెనిఫిట్ షోల దోపిడీ, టికెట్ ధరల పెంపు మీద హైదరాబాద్ హైకోర్టు ఆగ్రహంగా ఉంది… ఇదే డిప్యూటీ సీఎం సినిమా ఓజీకి పెంచిన రేట్లను వ్యతిరేకించింది… తెలంగాణవ్యాప్తంగా వెంటనే థియేటర్లు ఓజీ టికెట్ రేట్లు తగ్గించి అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వమూ ఆదేశాలు జారీ చేసింది… తెలంగాణలో అన్యాయం అనిపించిన టికెట్ ధరల పెంపు ఏపీలో న్యాయం అవుతుందా..?
3) అది కన్నడ సినిమా నిర్మాణ సంస్థ, కన్నడంలోనే తీశారు, తెలుగులోకి డబ్ చేసి వదులుతారు… డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్ల పెంపు ఏమిటి..? ఏపీలో సినిమా తీస్తే ప్రోత్సహించండి, అంతేగానీ తెలుగు సినిమాలను వ్యతిరేకించి, అడ్డుకునే ఆ భాషా సంకుచితులకు ఇక్కడ ప్రోత్సాహం ఏమిటి..? ఇక్కడి ప్రేక్షకుల జేబులు దోచుకోవడం దేనికి..?
4) మంగ్లి తెలుగు పాటలు పాడితే దాడి చేస్తారు, తెలుగు సినిమాల పోస్టర్లు చించుతారు, చివరకు తెలుగులో ప్రిరిలీజ్ ఫంక్షన్ చేస్తే హీరో నాలుగు తెలుగు మాటలు మాట్లాడక కన్నడంలో మాత్రమే ఇక్కడ ఎవడికీ అర్థం కాని స్పీచ్ దంచుతాడు… అసలు కన్నడంలోకి డబ్ చేసినా మన సినిమాల్ని వాళ్లు దేకరు… మరెందుకు ఈ కళ, మంచి మనసు, జాతీయ భావన, మనుషుల్ని కలపడం వంటి పెద్ద పెద్ద పదాలతో విఫల సమర్థనలు..?
5) భారీ నిర్మాణ వ్యయం పేరిట టికెట్ రేట్ల పెంపు అనేదే పెద్ద ప్రేక్షక వ్యతిరేక చర్య… తెలంగాణ హైకోర్టు అడిగింది అదే.., ఎవడు పెట్టమన్నాడు ఆ ఖర్చు..? ఎవడిని అడిగి పెట్టారు..? ఎవడు భరించాలి అని..!
6) కాంతారా ఏమీ ప్రబోధాత్మకం కాదు… కమర్షియల్… ఓ ఫాంటసీ… అంత ఔదార్యం చూపించాల్సిన కళకళల తళతళలు ఏమీ లేవు… విదేశాల్లో కూడా హిందీ వెర్షన్ 10 డాలర్లు అయితే తెలుగు వెర్షన్ అయితే 20 డాలర్లు అట… ఏ కోణం నుంచి చూసినా సరే, కాంతారాకు టికెట్ రేట్ల పెంపు అనేది అనుచిత చర్య అనే స్వీపింగ్ కామెంట్ చేయలేం కానీ… అనవసర నిర్ణయం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం… ఇంతకీ ఏపీలో దీనికి బయ్యర్లు ఎవరబ్బా..?!
(గమనిక... ఇది కాంతారా అనే సినిమాకు సంబంధించిన వ్యతిరేక కథనం కాదు... సమస్యను స్థూల దృష్టితో, పలు కోణాల్లో చూడాల్సి ఉంది...)
Share this Article