Sampathkumar Reddy Matta….. కాయకష్టంజేసే మూగజీవాలను పూజించుడు– సంక్రాంతి పండుగల ఒక ముఖ్యమైన ముచ్చట !
కనుమ నాడు వెనుకట మన దగ్గర కాపుదనపోళ్లు
పశువులకు కాటి రేవుల పండుగ & దొడ్డి పండుగ జేద్దురు.
ఊరమందలకు ఉమ్మడిగ జేసేది కాటిరేని పండుగైతే,
ఎవరి దొడ్డికి వారు ఇంటిమందం జేసుకునేది దొడ్డిపండుగ.
పొద్దుగాలనే.. దొడ్డి/ కొట్టం /గుడిసె శుభ్రం జేసి
పసులకు పెయిగడిగి, కొమ్ములకు ౘమరు రాసి,
మెడలల్ల గంటల చెలిదండలు, పట్టెలు అలంకరిద్దురు.
తర్వాత దొడ్లెనే పెండ/ పుట్టమన్నుతోటి దొడ్డి/ మందోట
నిర్మించి.. పసుపు కుంకుమ, తంగేడు పూలతోటి పూదిచ్చి,
పశువులను ఆ బొమ్మ దొడ్డి చుట్టు ఐదు చుట్లు తింపినంక
దొడ్ల పొయివెట్టి పరమాన్నం వండి.. పసురాలకు తినిపించి.
అటెనుక ఆకుపోకలతోటి వాటికి విడెముసుత ఇప్పిద్దురు.
మిగిలిన అన్నంల పసుపు కుంకుమ కలిపి పొడిపొడి జేసి
చెడుసొరుపు లేకుంట కొట్టం నాల్గుమూలల పొలి జల్లుదురు.
ఈ దొడ్డిపండుగ, కొన్నిఊర్లల్ల వాడకట్టు మొత్తంగ కలిసి
ఊరి బయటి దుబ్బలమీద/ చెల్కల్ల/ జంజరు భూముల్ల
పెద్ద ఉత్సవంలెక్క గుడ అందరి పొత్తుల జరుపుకొందురు.
ఇగ కాటిరేవుల పండుగకు.. పసుల/ బర్ల కావలికాడు
ఊర్ల ఇంటింటికి తిరిగి బియ్యం, బెల్లం, పైసలు సేకరించి..
ఊరి బయట మందబెట్టే మఱ్ఱి కిందనో, మందోటకాడనో,
ఊరు పొలుమారు మీది గడ్ఢి కంచెలల్లనో.. రేవు జేస్కొని
మొదుగాలు పసులను చెర్లకు దోలి తానాలు జేపిచ్ఛినంక
చెట్టు కింద అలికి ఐదు రాళ్లను కాటిరేడు దేవుళ్లుగ నిలిపి
సున్నం & పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత
పొయి వెట్టి తీపి బోనం వండి, బోనం & కోడి/ జీవం తోటి
మొక్కు చెల్లించి, పసుల మంద చుట్టు ఎర్రముద్ద పొలి జల్లి
పశువుల వీపు మీద చేతి ఐదు వేళ్లు అచ్చువడేటట్టుగ
చేతిని జాజుల ముంచి లెక్కతోటి జడుపు దెబ్బలేద్దురు.
కొన్నక్కల్ల రెండు చెట్లకు తోరణం గట్టి కిందికెల్లి దాటిద్దురు.
ఆ రోజు పశువులకు పని జెప్పుడు అసలుకే వుండేదిగాదు.
మరికొన్నిదిక్కుల్ల శాత్రానికి సాగువాటు సంప్రదాయం ఉండేది.
పండుగ సంబురాలు, అలుకు పూతలు, అలంకారాలు..
కమ్మకమ్మటి శాఖాహార భోజన షడ్రుచులు ఒక్క మనకేనా
మన బువ్వ కోసం ఆరుగాలం రాత్రీపగలూ గొడ్డుకష్టంజేసి
మూడుపూటలా మన ఐదు వేళ్లు నోట్లకు పంపించగలిగే
అన్నదాతలైన నోరు లేని పసురాలకు పండుగ జేసుడు–
సద్దిదిన్న రేవు తలుచుకొని, సుద్దులు చెప్పుకునుడు–
ఎంత గొప్ప సంప్రదాయం..! మరి ఎంతటి కృతజ్ఞత..!!
ఈ సంప్రదాయం ఇంకా అక్కడక్కడ నడుస్తున్నప్పటికీ
కొత్తతొవ్వలుదొక్కిన ఈనాటి మన వ్యవసాయంల…
దాదాపుగ అంతరించినట్టే..! అసలు ఊర్లల్ల పశువులే
తగ్గిపోయినయి. వాటి అవసరము తీరిపోయిందనే…
వెఱ్ఱి భ్రమల ఉన్నం గదా మనం ! ఇది ఎంత అఙ్ఞానం..?
రసాయన మందుల నుండే పంటలను ఆర్జిస్తున్న మనం
మన పూర్వీకుల పంట దారికి మర్లుతమా..?
పెంట నుండి పంటనూ & పంట నుండి పెంటనూ
ఏనాటికైనా తిరిగి ఆశించగలుగుతమా… ?
కాలమే చెప్పగలుగాలె ! అది ప్రకృతి ఇచ్చే తీర్పుగావాలే ..!!
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
పదేండ్ల కింద బర్లు ఆవులు కలిసి వందకు మించి పసురం ఉండేది.
Ads
ప్రస్తుతము రెండు బర్లు మిగిలినయి. వాటికే నేడు కనుము చేసినం.
కనీసం వందేండ్లలో రావలసిన మార్పు పదేండ్లకే వస్తే, ఏమి జేస్తం..?
Share this Article