.
Prabhakar Jaini …… #కన్యాకుమారి సినిమా బావుంది…
ముందుగా నాకు ఈ సినిమా చూడాలనిపించ లేదు. ఎందుకంటే, ఈ నాటి యూత్ సినిమాల్లో ఏముంటుంది? అల్లరిచిల్లరగా తిరిగే ఒక గ్యాంగ్. అందులో, అందరి కంటే పెద్ద బేవార్స్ గాడు హీరో. వాడికి ఒక తొట్టి గ్యాంగ్. ఒక అమ్మాయిని చూసి, సినిమా చివరి వరకు ఆమె వెంబడి పడి బుట్టలో పడేయడం, మధ్యలో తాగుడు, తినుడు, సిగరెట్లు, కుళ్ళు జోకులు, ఏ ప్రాంతానికి చెందని ఒక సంకర యాస… వగైరా… వగైరా… తప్ప.
Ads
ఇది కూడా అటువంటి సినిమానే అనుకున్నా! ఇది కూడా యువ జంట ప్రేమ కథే. కానీ, ఇది వేరే. నాకు ఈ లక్ష్యం లేని, కమిట్మెంట్ లేని హీరోహీరోయిన్ల సినిమాలు నచ్చవు. జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం లేకుండా కేవలం ప్రేమ ప్రేమ అంటూ తిరిగే వాళ్ళను చూస్తే విరక్తి పుడుతుంది. ఈ సినిమాలో కూడా ప్రేమ ఉంటుంది.
కానీ, it is subjected by goals in the life. హీరోకు వ్యవసాయం చేయడమంటే ప్రాణం. వ్యవసాయం కోసం ప్రేమను కూడా త్యాగం చేసేంత ప్రేమ. అలాగే హీరోయిన్ కు సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలన్నది లక్ష్యం. తను కూడా ఆ లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసేస్తుంది. ఇక్కడ ఇరువురి మనసుల్లో జరిగే సంఘర్షణను డైరెక్టర్ బాగా చూపించగలిగారు. క్లైమాక్స్ చాలా రిలీఫ్ ను కలిగిస్తుంది.
కల్మషం, కల్తీ లేని శ్రీకాకుళం యాసను, ఆద్యంతం మెయింటెయిన్ చేసారు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల ప్రకృతి దృశ్యాలను, మలయాళం సినిమాలలో లాగా, బాగా ఒడిసిపట్టుకున్నారు. సినిమా ఆద్యంతం, హీరో పాత్ర వేషధారణ, జులపాల జుట్టు మారలేదు.
మధ్య, దిగువ మధ్య తరగతి స్థాయిని మించి, హీరోహీరోయిన్లు, కలలు కూడా కనలేదు. గీతా సైనీ, శ్రీ చరణ్ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆ ప్రకృతి దృశ్యాలు, సముద్రం, పూలవనాలు చూస్తుంటే, హైదరాబాదులో జరుగుతున్న బతుకమ్మ పూల పండుగే గుర్తుకొచ్చింది.
పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంటే, తక్కువ బడ్జెటులో, తక్కువ షెడ్యూల్సులో కూడా, అందమైన, అద్భుతమైన, విజయవంతమైన సినిమా చేయొచ్చని నిరూపించారు నిర్మాతలు, డైరెక్టర్.
కొసమెరుపు ఏమిటంటే, మితృలు Ravindranath Pakki గారు, ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో పోస్టులు పెడుతున్నారు. రవీంద్రనాథ్ గారు కూడా బాగా, సహజంగా నటించారు. అందరూ సహజంగా, కులాసాగా, ఆడుతూపాడుతూ, నటించారు.
మనం కూడా అంతే ఆనందంగా ఈ పండగ రోజుల్లో చూడొచ్చు. రెండు హిట్ సాంగ్స్ పడితే, సినిమా లెవెల్ ఇంకా పెరిగిపోయేది… (ఆహా,ప్రైమ్ ఓటీటీలలో ఉంది… థియేటర్లలో పెద్దగా ఆడినట్టు లేదు, ఓటీటీల్లో వచ్చాక పాజిటివ్ రివ్యూ వస్తున్నాయి)…
Share this Article