నవ్వు వెంటే ఏడుపు… ఏడుపు వెంటే నవ్వు… దేశంలో ఇప్పుడు టాప్ కామెడీ పర్‌ఫార్మర్ అంటే కపిల్ శర్మ… కోట్ల మంది వీక్షకులున్నారు తన కామెడీ షోలకు… సోనీ టీవీ ప్రధాన షోలలో ఇదీ ఒకటి… దేశంలోని ప్రతి సెలబ్రిటీ ఒక్కసారైనా కపిల్ శర్మ షోలో పాల్గొంటే బాగుండునని తహతహలాడుతారంటే అతిశయోక్తి కాదు… తరచూ తన ఆస్తుల గురించి, కార్లు-ఇళ్ల గురించి వార్తలు వస్తుంటాయి…
కానీ ఇదే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు… అది 2017… తన సినిమా కిస్ కిస్కో ప్యార్ కరూఁ బాక్సాఫీసు వద్ద ఘోరంగా దెబ్బతిన్నది… తన కామెడీ షోలో కీలకంగా ఉండే కమెడియన్ సునీల్ గ్రోవర్‌తో గొడవలు… అవన్నీ గుర్తుచేసుకుంటూ కపిల్ ఇప్పుడిప్పుడే అవన్నీ మరిచిపోతున్నాను అంటున్నాడు…
కపిల్ శర్మ నటించిన నందితాదస్ సినిమా జ్విగాటో ఈనెల 17న రిలీజ్ కాబోతోంది… (జొమోటోలాగా ధ్వనించే పేరు)… ఇందులో తను ఫుడ్ డెలివరీ ఏజెంటు పాత్ర పోషించాడు… అందులో షహానా గోస్వామి కూడా ఉంది… ఈ సినిమా ప్రమోషన్ సాగుతోంది ప్రస్తుతం… ఆజ్ తక్ నిర్వహించే సీదీ బాత్‌లో మాట్లాడినప్పుడు… ఎవరైతే ఒంటరితనంతో డిప్రెషన్‌లో ఉన్నారో వారిని ఉద్దేశించి ఏమైనా చెబుతారా అనడిగారు వాళ్లు…
Ads
దానికి కపిల్ బదులిస్తూ… ‘‘ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నా సరే నేనూ ఒక దశలో ఒంటరివాడిలాగా డిప్రెషన్‌కు గురయ్యాను… ఒక పబ్లిక్ ఫిగర్‌గా కోట్ల మందికి మనం తెలిసి ఉండవచ్చు, వారందరికీ వినోదాన్ని పంచి ఉండవచ్చు, కానీ ఒక దశ వస్తుంది… ఆ దశలో ఇంటికి వచ్చాక నువ్వు నువ్వు మాత్రమే… నువ్వు ఒక్కడివి మాత్రమే అయిపోతావు… అలోన్, ఒంటరితనం… బయటికి ఎక్కడికి వెళ్లినా ఓ సాధారణ జీవితాన్ని గడపలేం…
సముద్రం ఒడ్డున ఉన్న బెంచీపై ఒంటరిగా కూర్చుని నిర్వికారంగా అలల వైపే చూస్తుంటాం… ఒక టూబెడ్ రూం ఫ్లాట్ లో కూర్చుంటే… బయట అంతా చీకటిసాయంత్రం… ఒంటరితనంలో అలుముకునే ఆలోచనల్ని నిజానికి స్పష్టంగా వివరించలేం… ఆ దశలో ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి… నేనూ ఆ దశను అనుభవించాను…
నా ఆలోచనల్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేను, బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు… మనసులో భారాన్ని ఎలా దింపేసుకోవాలో తెలియదు… నేను వచ్చిన ప్రదేశంలో మానసిక ఆందోళన పెద్దగా చర్చించబడదు… అసలు అది ఓ సమస్యగానే భావించబడదు… చిన్నతనంలో కూడా ఇలాంటి దశల్ని నేను దాటేసి వచ్చి ఉంటానేమో… కానీ 2017 లో ఎక్కువ బాధపడ్డాను…
ఒకసారి నువ్వు డబ్బు సంపాదనకు బయటికి వెళ్లాక… నువ్వు ఒంటరివి అయిపోతే, నీ గురించి పట్టించుకునేవాళ్లు ఉండరు, నీ ఫీలింగ్స్ అర్థం చేసుకునేవారు ఉండరు… నీ చుట్టూ చేరే మనుషుల్లోని రకరకాల దురుద్దేశాలు నీకు స్పష్టంగా అర్థం కావు… మరీ ప్రత్యేకంగా నువ్వు ఆర్టిస్టువు అయితే ఇది మరీ ఎక్కువ… ఒక్కసారి ఆ దశ దాటి వస్తే ఇక నీ చుట్టూ ఉన్నవారి ఆలోచనల్ని అర్థం చేసుకోగలవు… నీ చుట్టూ ఏం జరుగుతుందో విశ్లేషించుకోగలవు… కళ్లు తెరుచుకుంటాయి… కానీ ఓపిక కావాలి, ఆ డిప్రెషన్ దశను దాటగలగాలి… అంతే…
ఒక ఆర్టిస్టు సెన్సిటివ్‌గా ఉన్నాడంటే తను స్టుపిడ్, తెలివి లేనివాడని కాదు… ఎటొచ్చీ అన్నీ అర్థం చేసుకునే దశ రావాలి… ఏదీ శాశ్వతం కాదు, ఆనందమైనా, విషాదమైనా… ఈ నిజాన్ని మనసులో పెట్టుకుంటే ఇక ఒంటరితనం అనేది మనల్ని చుట్టుముట్టదు’’ అని చెప్పుకొచ్చాడు… ఓ కమెడియన్ ఆలోచనల్లో ఇంత పరిణతి, గాఢమైన ఆలోచనల లోతు ఉందంటే గొప్పతనమే…
Share this Article