Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…

June 1, 2025 by M S R

.

Director Devi Prasad.C….. కోడిరామకృష్ణ గారు దర్శకుడైన తొలి నాళ్ళలో, తన సినిమాలు విడుదలైనప్పుడు, డిగ్రీ చదువుకొంటున్న ఓ అభిమాని “కోదాడ” నుండి రాసే ఉత్తరాల కోసం ఎదురుచూసేవారట.

రంగురంగుల అక్షరాలలో సినిమాని అద్భుతంగా విశ్లేషిస్తూ హిట్టా ఫట్టా అనేది కూడా నిర్మొహమాటంగా రాసేవాడట. ఆ అభిమాని పేరు”కరణ్‌రాజ్”. తర్వాత కొన్నేళ్ళకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా గురువుగారి దగ్గర చేరినప్పుడే తను కూడా వొచ్చి చేరిపోయాడు.

Ads

మితభాషి, అతి సున్నిత మనస్కుడు. అతని మాట వల్ల చేత వల్ల ఎప్పుడూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టి ఎరుగడు. నటీనటుల డ్రెస్‌ కంటిన్యుటీ చూసుకొనేవాడు. స్క్రిప్ట్ విషయాలలో గురువు గారు అడిగినప్పుడు అందరం మా అభిప్రాయాలు చెబుతుంటే, ఒకప్పుడు తన ఉత్తరాలతో గురువు గారిలాంటి దిగ్దర్శకుడినే మెప్పించిన తను మాత్రం సైలెంట్‌గా వుండేవాడు.

ఓసారి నేనొక్కడినే ఉన్నప్పుడు స్క్రిప్ట్‌లో ఉన్న లోపాలను చాలా లాజికల్‌గా చెప్పాడు. ఆశ్చర్యపోయాను. ఇలాగే అందరి ముందూ ఎందుకు చెప్పవ్ అని అడిగితే అసలు విషయం చెప్పాడు.

చదువుకొనేటప్పుడు తాను చాలా షార్ప్‌గా ఉండేవాడిననీ, ఓసారి తనకు ఓకారు యాక్సిడెంట్ జరిగిందనీ, అప్పటి నుండి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోయాననీ అందరిలో మాట్లాడటానికి బెరుకుగావుంటుందనీ చెప్పాడు.

నలుగురం కలిసి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చాలా కంగారుపడిపోయేవాడు. ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన తమాషా సంఘటన గురువు గారు చెబుతుంటే నవ్వుకునేవాళ్ళం.

అదేంటంటే… రామానాయుడు స్టూడియోలోని పోలీస్‌స్టేషన్ సెట్ లో షూటింగ్. “సెల్”లో ఒక తమిళ నటుడిని పెట్టి తాళం వేశారు. సెల్ ఎదురుగా కెమేరా పెట్టారు. ఎఫెక్ట్ కోసం సెట్ అంతా సాంబ్రాణీ పొగ వేశారు.

ఆ పొగకి ఉక్కిరిబిక్కిరి అయ్యిందో ఏమో పైన దూలాలపై చుట్ట చుట్టుకుని ఉన్న ఓ “పాము” సరాసరి కెమేరా పక్కనున్న కరణ్‌రాజ్ నెత్తిమీద ల్యాండ్ అయ్యింది. వెనక నుండి ఎవరో సరదాగా తన నెత్తి మీద ఏదో వస్తువు వేశారనుకున్న అతను చేత్తో ఆ పాముని తోసేశాడు.

కింద పడిన ఆ పాము సర్రున సెల్‌లోకి పాకుతుండటం చూసిన తమిళ నటుడు అయ్యో .. పాంబు… పాంబు .. అని అరవటం మొదలుపెట్టాడు. (పాముని తమిళంలో “పాంబు” అంటారు.)

అంతకుముందు కొన్ని నెలల ముందే స్టూడియో బైట కారు బాంబు పేలిన సంఘటన జరిగి వుండటంతో…. అతను అరిచిన “పాంబు” అన్నపదం అందరికీ “బాంబు” లా వినపడి యూనిట్ మొత్తం కకావికలై బైటికి పరుగెత్తారు. అప్పటి నుండీ గురువు గారు కరణ్‌రాజ్ ని సరదాగా “సర్పరాజ్” అని పిలిచేవారు.

ఓ విషయంలో కరణ్‌రాజ్ ని అపార్ధం చేసుకున్న ఓ హీరో అతని మీద దురుసుగా ప్రవర్తిస్తే , ఎప్పుడూ కించిత్ ఆవేశానికి కూడా లోనుకాని కోడి రామకృష్ణ గారు ఆగ్రహంతో, కరణ్‌రాజ్ కి ఆ హీరో క్షమాపణ చెప్పేవరకూ షూటింగ్ చేయనని ప్యాకప్ చెప్పటమేకాక, సూపర్‌హిట్ కాంబినేషన్ అయినప్పటికీ తరువాత నాలుగు సంవత్సరాల వరకూ ఆ హీరోతో మళ్ళీ సినిమా చేయలేదంటే కరణ్‌రాజ్ మీద ఆయనకి ఎంతటి సదభిప్రాయము, వాత్సల్యము ఉండేవో అర్ధం చేసుకోవచ్చు.

తరువాత కాలంలో హైదరాబాద్ పాతబస్తీలో నివాసముండే కరణ్‌రాజ్ తక్కువగా కలిసేవాడు. మిత్రుడు వీరశంకర్ దర్శకత్వంలోని “మన కుర్రాళ్ళే” సినిమాకీ పనిచేశాడు. 2017లో “ఇదో ప్రేమలోకం” అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

నేను “జయమ్మ పంచాయితీ” సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మనసు కాసేపు మూగదయ్యింది. అంతకుమునుపెప్పుడో జరిగిన కారు యాక్సిడెంట్‌ వల్ల తన చురుకుతనాన్ని కోల్పోయి బెరుకుతనానికి అలవాటుపడిన మా కరణ్‌రాజ్ మరెప్పుడూ ఏ విషయంలోనూ బెదరకూడదనుకున్నాడో ఏమో మరోసారి జరిగిన కారు యాక్సిడెంట్ వల్ల తన ప్రాణాలనే ఒదిలేశాడు.

“తొలగి ఎవ్వడు నీకు త్రోవనిచ్చు తోసుకుపోవలయు గానీ” అని మహాకవి “కాళోజీ” అన్నట్లు, ఏ రంగంలోనైనా సరే…. తోసుకుపోలేకపోయినా కనీస చొరవ చూపించలేకపోతే విజయం చేయందించదు. మనుగడ సాగించటానికి “గుడి”కీ “బడి”కీ కూడా ప్రచారం అవసరమైన రోజుల్లో….
ప్రదర్శించని ప్రతిభకి
వ్యక్తపరచని జ్ఞానానికి
వెలగని దీపానికి విలువేముంటుంది?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions