ఇక్కడ కాంగ్రెస్ కు పెరిగిన 5 % ఓట్ షేర్ జేడీఎస్ నుండి బదలాయింపు అయ్యుంది, కర్ణాటకలో నష్టపోయింది జేడీఎస్ తప్ప బీజేపీ కాదు….
ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది… తమ కళ్లను తామే తుడుచుకోవడానికి బీజేపీ శ్రేణులు పడే పాట్లు తప్ప మరొకటి కాదు… మన ఎన్నికల సిస్టంలో ఒక్క వోటుతో గెలిచినా గెలుపే… అరెరె, 2 వేల వోట్ల మెజారిటీతో 48 సీట్లు పోయాయి, వేయి వోట్ల తేడాతో 31 సీట్లు పోయాయి అనే పోస్టు కూడా ఇలాంటిదే… అవును మరి… ఆ 2 వేలు, ఆ వేయి వోట్ల తేడాను అధిగమించకపోవడమే వైఫల్యం, పరాజయం, పరాభవం… ఆమేరకు రావడమే కాంగ్రెస్ విజయం…
నిజానికి ఎవరికీ ఏ అనుమానాలూ అక్కర్లేదు… కర్నాటక వోటరు చాలా స్పష్టంగా బీజేపీని తిరస్కరించాడు… ఏ సమర్థనలూ, వివరణలూ అక్కర్లేదు… బీజేపీ పాలసీ నిర్ణేతల బుర్రలు తిరిగిపోయేలా ఫలితాలు వచ్చాయి… అబ్బే, మా వోట్ షేర్ తగ్గలేదు, మాకేమీ నష్టం లేదనే వాదన కరెక్టు కాదు… ఆత్మవంచన అవుతుంది అది… కుళ్లిపోయి, రాలిపోబోతున్న జేడీఎస్ అనే ‘గోతి కాడ’ పార్టీ నుంచి 5 శాతం వోట్లను సంగ్రహించడమే కాంగ్రెస్ విజయం… అలా వోట్ల బదలాయింపు సాధించకపోవడమే బీజేపీ వైఫల్యం…
Ads
సో, ఎన్ని గణాంకాలు, ఎన్ని సమీకరణాలతో ఎన్ని లెక్కల సాములు చేసినా వృథా ప్రయాస… ప్రజాస్వామికవాదులు, నిజమైన జాతీయవాదులు సంతోషించాల్సిన అంశం ఏమిటంటే… కులప్రీతి, కుటుంబపాలన, అక్రమాలు, అవినీతి, అరాచకాలకు పేరొందిన ప్రాంతీయ పార్టీలను జనం తిరస్కరించడం… కాంగ్రెసో, బీజేపీయో ఏదయితేనేం… జాతీయ పార్టీ గెలిచింది… అదీ మరో జాతీయ పార్టీపై… ఈ సమరంలో మళ్లీ సీఎం సీటుపై కన్నేసిన ఓ ఉపప్రాంతీయ పార్టీ దారుణంగా దెబ్బతింది…
నో, నో, కాంగ్రెస్‌లో, బీజేపీలో అవినీతి లేదా..? వారసత్వ కంపు లేదా…? నిజమే, ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ పెద్ద తేడా ఏమీ లేదు… అక్రమాల్లో, పాలన వైఫల్యాల్లో, అలవిమాలిన ఉచిత హామీల్లో ఎవరూ ఎవరికీ తీసిపోరు… రాహుల్‌ను నమ్ముకోకుండా కాంగ్రెస్ ముఖ్యనాయకులు తమదైన పనితీరుతో కర్నాటకలో కాంగ్రెస్‌ను గట్టెక్కించారు… కానీ బీజేపీ ఈరోజుకూ మోడీ మీదే ఆధారపడే సాగుతోంది… కానీ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకవిషయాల్లో ఓ జాతీయ విధానమంటూ ఉండదు… వాటితో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీ నయం… లెఫ్ట్ పార్టీలున్నా విదేశీభావజాలాల ఆ పార్టీలను ఇక భారతీయ వోటర్లు నమ్మరు, ఇష్టపడరు… వాటిది ఒడిసిన కథే…
ఇప్పుడు చెప్పుకోవాల్సింది… గెలుపు కోసం అలివిమాలిన హామీలనిచ్చి వోటర్లను అంతులేని భ్రమల్లో ముంచెత్తిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చగలదా..? నెవ్వర్… సంపూర్ణ అమలు కష్టమే… అవన్నీ వోట్ల కోసం విసిరిన వలలు మాత్రమే… బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుపేదలకు నెలకు 10 కిలోల ఉచితబియ్యం వంటివి పెద్ద కష్టమేమీ కాకపోయినా… హామీలకు రకరకాల పరిమితులతో ఎలాగోలా ఆచరణ సాధ్యం చేయగలిగినా… 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 3000 నిరుద్యోగ భృతి, 500 రూపాయల సిలిండర్ వంటివి ఎలా అమలు చేస్తారో చూడాల్సి ఉంది…
ప్రతి యజమాన మహిళకు నెలకు 2 వేలు కూడా పెద్ద కష్టమేమీ కాదు… జగన్, కేసీయార్ అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లనే కర్నాటకలో అమలు చేస్తారు బహుశా… 2 లక్షల రైతురుణమాఫీ కూడా వేచి చూడాల్సి ఉంది… సో, చెప్పదలుచుకున్న అంశమేమిటంటే… బీజేపీ తొందరపడాల్సిన పనిలేదు… ప్రస్తుతానికి ప్రజాతీర్పును తలదాల్చి, కాంగ్రెస్ పాలన, హామీల వైఫల్యాల లెక్క రాసుకుని, కొన్నాళ్లకు జనంలోకి వెళ్లడమే కర్తవ్యం… ఆలోపు తన బలహీనతలను సమీక్షించుకుని దిద్దుకోవల్సిందే…!! నిజానికి దాని ప్రధాన కర్తవ్యం అదే…
అన్నట్టు ముఖ్యమంత్రి ఎవరు అనేది కదా చర్చ… ఓ రాజీ ఫార్ములా ఆల్ రెడీ కుదిరిందని కాంగ్రెస్ వర్గాల సమాచారం… డీకే శివకుమార్, సిద్దరామయ్య చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారట… మొదటి రెండున్నరేళ్లు కాగానే, అధికారం అప్పగించక మొదటి సీఎం ఎదురుతిరిగితే… బీజేపీకి ‘‘కొనుగోళ్ల’’ చాన్స్ దొరకొచ్చు… ఏమో, కర్నాటకలోనూ ఓ ఏకనాథ్ షిండే దొరక్కపోడు…!!
Share this Article