1+2 movie . కనకవర్షం కురిపించిన కార్తీకదీపం . 26 లక్షల బడ్జెటుతో తీసిన ఈ సినిమా 50 రోజుల్లో 1979 లో 60 లక్షల రూపాయలు వసూలు చేసిన ఫుల్ సెంటిమెంటల్ , రొమాంటిక్ సినిమా . శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా . బహుశా ANR కు , శోభన్ బాబుకు ఉన్నన్ని 1+2 సినిమాలు మరే హీరోకి లేవేమో ! శోభన్ బాబుకు ఫిలిం ఫేర్ బెస్ట్ ఏక్టర్ అవార్డుని తెచ్చిపెట్టింది .
ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి అదృష్టవంతుడు . ఆయన వ్రాసిన కధలు , నిర్మించిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి . ఈ కార్తీకదీపం కధను కూడా ఆయనే వ్రాసారు . ఆయన ఆస్థాన దర్శకుడు లక్ష్మీ దీపకే ఈ సినిమాకు దర్శకులు .
శోభన్ బాబు జోడీగా శ్రీదేవి నటించిన మొదటి సినిమా ఇది . ఆ తర్వాత మరో ఏడు సినిమాలలో నటించింది . శారదతో మొత్తం 18 సినిమాల్లో జోడీగా నటించాడు . అందరికన్నా ఎక్కువ వాణిశ్రీ తోనే . 28 సినిమాల్లో జోడీ . ఇదే సంవత్సరం వచ్చిన బంగారు చెల్లెలు సినిమాలో చెల్లెలుగా నటించిన శ్రీదేవి ఇందులో జోడీగా నటించటం , ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం విశేషం .
Ads
ఈ సినిమా వీర హిట్ అవటానికి రెండు ప్రధాన కారణాలు . ఒకటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం పాట . సినిమాకు ఐకానిక్ సాంగ్ . సుశీలమ్మ , జానకిలు పాడారు . కార్తీక మాసమంటేనే మహిళలకు ఎంతో ప్రియమైన మాసం . ఇంక ఆ కార్తీకదీపం పాటను మెచ్చుకోకుండా ఉంటారా !
రెండోది శ్రీదేవి సుమంగళిగా చనిపోవటం , భర్త అంత్యక్రియలను ధర్మపత్ని సమక్షంలో చేయటం . చెప్పేదేముంది . మహిళలందరూ థియేటర్లలో కన్నీళ్లు పెట్టిన వాళ్ళే . ఆరోజుల్లో మహిళలు నేటి మహిళల్లాగా కర్కశులు కాదు కదా ! ఈ రెండింటి వలనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది .
ముగ్గురు శోభన్ బాబులూ ఇరగతీసారు . ఒకరు శారదతో , మరొకరు శ్రీదేవితో , కొడుకు శోభన్ బాబు గీతతో చలాకీగా , హుషారుగా బాగా నటించారు , డాన్సులు చేసారు . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే .
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకూ జతగా మసలే వరమే నన్ను పొందనీ . ఆరనీకుమా ఈ దీపం పాట తర్వాత వీర హిట్టయిన పాట ఇది . శ్రీదేవి ఖవాలీ పాట చాలా బాగుంటుంది . మువ్వలేమో నేడేమో నాలోన మ్రోగించేను మోహనగీతం . శ్రీదేవి డాన్స్ కూడా చాలా అందంగా ఉంటుంది .
మరో పాట ఓ మాట.. అహ తెలుసు.. అది కాదు.. ఇంకేమిటీ.. చెబితే చాలదు . శోభన్ బాబు శారదల మీద . పాత జోడీయే కదా ! కెమిస్ట్రీ బాగానే ఉంటుంది . ఇంకో పాట చిలకమ్మ పలికింది . చాలా శ్రావ్యంగా ఉంటుంది .
శోభన్ బాబు గీతల మీద చూడ చక్కనిదానా చూపు బిత్తరదానా నీ మిసమిసలు ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతుంది . హుషారుగా , స్పీడుస్పీడుగా ఉంటుంది . వెరశి అన్ని పాటలూ హిట్టే .
శారద , శ్రీదేవిలు ఘర్షణ పడే సీన్లో శ్రీదేవి శారదకు ధీటుగా నిలబడి నటించింది . ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ గుర్తుకొస్తుంది . Of course . ప్రేమాభిషేకం దీని తర్వాత వచ్చిన సినిమా అనుకోండి . మద్దిపట్ల సూరి డైలాగులు గట్టిగానే ఉంటాయి . సినిమా అంతా రిచ్ గా ఉంటుంది . ఆనాటి మధ్య తరగతి , దిగువ తరగతి ప్రేక్షకుల కలలుగా భారీ బంగళాలు , పడవ కార్లు ఉంటాయి .
ప్రభాకరరెడ్డి , రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్య , రవికాంత్ , శుభ , సూర్యకాంతం , మాడా , ఝాన్సీ , కె వి చలం , గిరిజ ఇతర పాత్రల్లో నటించారు .
12 సెంటర్లలో వంద రోజులు ఆడింది . విజయవాడ కల్యాణ చక్రవర్తి థియేటర్లో వంద రోజుల ఫంక్షన్ జరిగింది . NTR ముఖ్య అతిధి . 1980 లో హిందీలోకి మాంగ్ భరో సజనా టైటిలుతో రీమేక్ అయింది . తాతినేని రామారావు దర్శకుడు . జితేంద్ర , రేఖ , మౌసమీ ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు .
1985 లో తమిళంలోకి కర్పూరదీపం టైటిలుతో రీమేక్ అయింది . శివకుమార్ , సుజాత , అంబికలు నటించారు . 1987 లో కన్నడంలోకి సౌభాగ్య లక్ష్మి టైటిలుతో రీమేక్ అయింది . విష్ణువర్ధన్ , లక్ష్మి , రాధ నటించారు . బహుశా ఈ సినిమా చూడని మహిళ ఉండదు . మగ పురుషులు కూడా చూసే ఉంటారు .
ఎవరయినా చూడనివారు ఉంటే యూట్యూబులో తప్పక చూడండి . An entertaining , musical hit movie . శోభన్ బాబు అభిమానులు అయితే ఎన్ని సార్లు అయినా చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. దోగిపర్తి సుబ్రహ్మణ్యం
Share this Article