.
మాకు మా అమ్మా నాన్న అపురూపంగా ఏదో పేరు పెట్టారు. మా సినీ అభిమానం వెల్లువలో మా నామకరణం రోజు పెట్టిన పేర్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పోషించిన, ఇంకా పోషిస్తున్న మా అమ్మా నాన్నలకంటే, చదువు చెప్పిన టీచర్లకంటే, బతుకు పాఠాలు చెప్పి కూడు పెట్టినవారికంటే, ఉద్యోగమిచ్చినవారికంటే మాకు మా అభిమాన హీరోలే ఎక్కువ.
# ఏనాడూ రక్తదానం చేయని మేము మా అభిమాన హీరో సినిమా విడుదలరోజు బ్లేడ్లతో కోసుకుని కటౌట్ కు రక్తతిలకాలు దిద్దుతాము.
Ads
# ఏనాడూ మా ఇంటికి పాల ప్యాకెట్ తీసుకెళ్లని మేము మా అభిమాన హీరో కటౌట్ కు బిందెలకు బిందెల పాలతో అభిషేకాలు చేస్తాము.
# ఏళ్ళకు ఏళ్ళు బడిలో మాకు పాఠాలు చెప్పిన అయ్యవారి మెడలో ఏనాడూ దండలు వెయ్యని మేము మా అభిమాన హీరో కటౌట్ కు భారీ క్రేన్లతో గజమాలలు వేస్తాము.
# మా లెక్కల మాష్టారు చెప్పిన పాఠం ఏనాడూ వినని మేము మా అభిమాన హీరో సినిమా వసూళ్ళు, గ్రాసు, ఓవర్ సీస్, థియేటర్లు, ఓ టీ టీ రైట్స్ రేట్లు, ట్యాక్స్ లు పోగా నికర లాభ నష్టాల లెక్కలు నిద్రలో లేపి అడిగినా తడుముకోకుండా చెప్తాము.
# ఊళ్ళో గుడికి ఏనాడూ వెళ్ళని మేము మా అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పరమ పవిత్రంగా వెళ్ళి వస్తాము. అక్కడ తొక్కిసలాటలో కాలో, చెయ్యో అభిమానంగా సమర్పించి వస్తాము.
# మా అమ్మా నాన్న పుట్టినరోజు, వారి పెళ్ళిరోజు ఎప్పుడో మాకు తెలియదు. మా అభిమాన హీరో పుట్టినరోజును ఊరు ఊరంతా జాతర చేస్తాము. అన్నదానాలు చేస్తాము. రక్తదానాలు చేస్తాము.
# మా చదువుల పరీక్షలు గతి తప్పవచ్చు. రాయచ్చు. రాయకపోవచ్చు. కానీ మా అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షోను మాత్రం నాలుగింతల రేటు ఎక్కువ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వము.
# మా ఒంటిమీద పచ్చబొట్టు మా హీరో. మా గుండె చప్పుడు మా హీరో. మా దేవుడు మా హీరో. మేము జీరో.
# అభిమాన సంఘాల గొడవల్లో ముందుండేది మేమే. మా హీరో మీటింగులు పెడితే ఎంతదూరమైనా వెళ్ళేది మేమే. మా హీరో రాజకీయమే మా రాజకీయం. మా హీరో ఎప్పుడు ఏ మాట మారిస్తే అదే మాకు వేదం. ఆయన ఏ కండువా వేస్తే అదే మా కండువా.
# మా హీరో చెప్పే ఆదర్శాలు పాటించకపోయినా మాకు దేవుడే.
# మాకు ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. మాకొక ఉనికి లేదు. ఊరు లేదు. పేరు లేదు. విలువ లేదు.
# మేము హీరోల రాజ్యాధికార పరమపద సోపాన పటానికి నిచ్చెనలం. తెర మీద నుండి వేసే ఓట్ల గాలానికి చిక్కుకునే చేపలం. మేము హీరోల సంకుల సమరంలో తలలు తెగే ముందువరుస సైనికులం. సోషల్ మీడియా అగ్గికి ఆహుతులం.
# మేము శ్మశానంలో భస్మంగా మిగిలిన అభిమానులం. మేము పోయిన ప్రాణాలం. రాజకీయ సినీకాలంలో తిరిగిరాని లోకాలం. మేము ఈరోజు కరూరులో నలభై ఒక్క మందిమి. మేము రేపు సినీ సునామీలో గల్లంతయ్యే అనేకానేక అల్ప ప్రాణాలం.
# మేము కన్న తల్లిదండ్రులకు సంతాపం మిగిల్చి ఇంట్లో గోడకు వేలాడుతున్న సంతాన ఫోటోలం- ప్రాయశ్చిత్తానికి వీలులేని పరిహారం పేర్లలో మిగిలిన అనామకులం.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article