అసలే పాపరాజీ… అంటే సినిమా తారలు, సెలబ్రిటీల వెంట పడి, వేటాడుతూ, పర్సనల్ ఫోటోలు తీస్తూ, టాబ్లాయిడ్లకు, మీడియాకు అమ్మి సొమ్ము చేసుకునే కెమెరాతనం… ఈ క్రూరమైన వేటకు అప్పట్లో యువత కలలరాణి డయానా మరణించిన సంగతి తెలుసు కదా…
ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా వీలైనంతవరకూ ఈ కెమెరామెన్ లెన్సులకు పట్టుబడకుండా, కళ్లుగప్పి తప్పించుకుంటుంటారు సెలబ్రిటీలు… దీనికితోడు ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది… చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివోడూ ఫోటోగ్రాఫరే, జర్నలిస్టే… దీనికితోడు ఇప్పుడు ఫేక్ వీడియోలు వచ్చాయి, యూట్యూబ్ చానెళ్లు, మార్ఫింగులు, మన్నూమశానం… అందరూ ఆడేసుకుంటున్నారు… సెలబ్రిటీలది మరీ మొహం చూపించుకోలేని దురవస్థ…
సరే, ఇది కాస్త భిన్నమైన ఉదంతం… మనమూ సరదాగానే చెప్పుకుందాం… బాలీవుడ్ పాపులర్ హీరోయిన్, అందగత్తె కత్రినా కైఫ్… అవును, మన తెలుగు మల్లీశ్వరి… ఈ కెమెరామెన్ ఎలా పిచ్చోళ్లయిపోయాయో చెప్పింది ఈమధ్య… నవ్వొచ్చేలాగే ఉంది… పాపం, తనూ సరదాగా నవ్వుతూనే చెప్పుకొచ్చింది లెండి… అసలే ఎప్పుడూ నవ్వు సరిగ్గా ఎక్స్‌పోజ్ కాని మొహం…
Ads
ఈమె భర్త విక్కీ కౌశల్… తనూ బాలీవుడ్ నటుడు తెలుసు కదా, జెమ్ యాక్టర్… తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈమధ్య కత్రినా, విక్కీ ఇద్దరూ లండన్ వెళ్లారు… అక్కడ కొన్ని ఫోటోలు దిగారు సహజంగానే… ఫోటోగ్రాఫర్ ఏ సోయిలో ఉండి తీశాడో, మరేదైనా సాంకేతిక కారణమో గానీ ఆ ఫోటోల్లో కత్రిన గర్భం ధరించినట్టుగా, లైట్ బేబీ బంప్ కనిపిస్తున్నట్టుగా ఫోటోలు వచ్చాయి…
ఇంకేముంది..? ఆ ఫోటోలు పట్టుకుని ఎవరెవరో ఏదేదో రాసేశారు… అక్కడికి కత్రినకు కడుపొస్తే అదేదో వార్త అయినట్టు… కడుపు రావడం ఏదో అసాధారణ పరిణామం అన్నట్టుగా…! వాళ్లు ఇండియాకు తిరిగి వస్తున్న వేళలు, ఫ్లయిట్ వివరాలు కనుక్కున్న చాలామంది కెమెరామెన్ ఆమె ఫోటోల కోసం ఎయిర్ పోర్టు బయట కాచుకున్నారు… కెమెరాలు రెడీ… అలర్ట్…
అబ్బా, అవునండీ, ఆమె ఫోటో కోసం, అదీ బేబీ బంప్ ఫోటో కోసం… కానీ కత్రిన నవ్వుతూ మామూలుగా సేమ్ ఓల్డ్ స్లిమ్ బాడీతో ఫ్లాట్ కడుపుతో రావడంతో కెమెరామన్ హతాశులయ్యారట… ఒకరిద్దరు ఫోటోగ్రాఫర్లు ‘భలే కవర్ చేస్తున్నారుగా’ అని మొహం మీదే అనేశారట… ఈ అవస్థలన్నీ చూసి, నవ్వుతూ చురకలంటించింది…
నా ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు మీకు..? అది మా సొంత విషయం కదా, దీనితో దేశానికి ఏం ఉపయోగం..? ప్చ్, ఏవి వార్తలో కూడా తెలియనివాళ్లు వార్తలు రాసేస్తున్నారు, అదే అసలు ప్రాబ్లం అంటూ చిన్న క్లాస్ పీకిందట… అవును మరి… కత్రినా చెప్పిందంతా నిజమే కదా… ఆమె కడుపులాగా అబద్ధమేమీ కాదుగా..!!
Share this Article