.
- రాజకీయాలు అంటే అంతే… సొంత రక్తమైనా సరే జాన్తానై… రక్తపాతాలుంటయ్ తప్ప రక్తబంధాలకూ విలువ ఉండదు… కుట్రలుంటాయి తప్ప కుటుంబబంధాలూ అవసరమైతే మాయమవుతాయి… రాజకీయం అంటేనే ఓ క్రూరమైన క్రీడ…
కవిత పట్ల కేసీయార్, కేటీయార్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ ఎట్సెట్రా అందరి ధోరణి చూస్తుంటే అనిపించింది అదే… దాదాపు అన్ని సైట్లు, పత్రికలు, టీవీలు, యాప్స్, చివరకు యూట్యూబ్ చానెళ్లు చూసినా సరే… ఒక్కటంటే ఒక్క ఖండన ప్రకటన, ఒక్క మద్దతు ప్రకటన లేదు కవిత కోసం…
ఆమె పార్టీ ఎమ్మెల్సీ, ఆమెను అధికారికంగా ఏమీ బహిష్కరించలేదు… పార్టీ అధినేత బిడ్డ… కాబోయే అధినేత చెల్లెలు… సో, వాట్… అత్యంత తీవ్రమైన బహిష్కరణ పాటిస్తున్నారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే తీన్మార్ మల్లన్న చేసిన వెగటు వ్యాఖ్యలకన్నా ఈ ధోరణే ఆమెకు పెయిన్‌ఫుల్…
కుటుంబాలు అన్నాక, పార్టీలు అన్నాక… గొడవలు, విభేదాలు, వివాదాలు సహజం… కాకపోతే పార్టీపరంగా, కుటుంబపరంగా ఆమెను మరీ అస్పృశ్యురాలిని చేయడం కూడా ఒకింత చర్చనీయాంశం అవుతోంది తెలంగాణ సమాజంలో…
Ads
- ఈరోజుకూ ఆమె డాడీయే సుప్రీం లీడర్ అంటోంది… కేటీయార్‌కు ఏసీబీ నోటీసులనూ ఖండించింది… కేసీయార్ కాళేశ్వరం విచారణకు వెళ్తున్నప్పుడూ ఇంటికి వెళ్లింది… బిడ్డతో మాట్లాడలేదు, కన్నెత్తి చూసి పలకరించలేదు కేసీయార్… ఇంత ఆగ్రహప్రదర్శన అవసరమా..? కూతుళ్లకు రాజకీయ ఆకాంక్షలు, అధికారం మీద ఆపేక్షలూ ఉండకూడదా కేసీయార్..? అవి కొడుకులకేనా..?! ఈ శిక్షలేమిటి..? ఈ కక్షలేమిటి..?
సరే, ఆమె క్యూన్యూస్ మీద దాడి చేయించడం తప్పే అనుకుందాం… దానిపైనా స్పందన లేదు… మల్లన్న వెగటు వ్యాఖ్యలు తప్పు, వాటినీ ఖండించరేం..? అంటే ఒకరకంగా, పరోక్షంగా రెండూ కరెక్టే అని భావిస్తోందా బీఆర్ఎస్ పార్టీ..? ఈ మౌనాన్ని తెలంగాణ సమాజం అలాగే అర్థం చేసుకోవాలా..?
కేసీయార్ సొంత మీడియా తెలంగాణ మల్లన్న గన్‌మెన్ కాల్పులు అనే వార్తను పక్కా ఓ స్పాట్ వార్తగా లోపల పేజీల్లో వేసేసి, చేతులు దులుపుకుంది… ఏదో మీటింగ్ పెట్టి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ వ్యాఖ్యలకూ తెలంగాణ అస్థిత్వానికీ, బీజేపీ నాయకుల అఖండచిత్రపటంలో తెలంగాణ లేకపోవడానికి ఇక మళ్లీ ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరిస్తారనే వ్యాఖ్యల దాకా వెళ్లిపోయారు బీఆర్ఎస్ మేధావులు, కవులు, కళాకారులు, గాయకులు ఎట్సెట్రా…
సరే, పార్టీ విధేయత, దొరతన విధేయత అలా మాట్లాడించి ఉండొచ్చు గానీ… మల్లన్న వాడిన సామెత తప్పా..? ఒప్పా..? ఈ గొంతులు ఎందుకు మాట్లాడవ్..? తెలంగాణ సామెతల ఉచితానుచితాల మీద చర్చ జరుగుతోంది…
సరే, ఇక ఇవీ వదిలేస్తే… మిగతా పార్టీలు కూడా కిమ్మనడం లేదు ఎందుకో..? అది గుర్తించదగిన ఘటనగా అనిపించలేదా..? 1) మీడియా మీద దాడి (దాన్ని మీడియా అనొచ్చా లేదానేది వేరే డిబేట్)… 2) ఓ మహిళా నేత మీద వెగటు సామెతల ప్రయోగం… (అందులో బూతు ఉందా లేదానేది కూడా వేరే డిబేట్)…
బీజేపీ సైలెంట్… ఏదో ఒకటి మాట్లాడేసే గొంతులూ మౌనం… చిన్నాచితకా పార్టీలను పక్కన పెడితే… అధికారంలో ఉన్న కాంగ్రెస్..? ఇద్దరిదీ తప్పే అన్నట్టుగా పీసీసీ అధ్యక్షుడి క్లుప్త స్పందన కనిపించింది తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు…
- తను పార్టీ బహిష్కృతుడు… (కవిత అనధికారికంగా, మల్లన్న అధికారికంగా… ఇద్దరూ తమ పార్టీల బహిష్కృతులే)… తన అడుగులు, విమర్శలు కాంగ్రెస్ పార్టీకే నష్టం చేస్తున్నాయి… ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తదుపరి యాక్షన్ ఏమిటనేదీ ఆసక్తికరంగా మారుతోంది… నిజానికి ఇది కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఘర్షణే ఒకరకంగా…
అవునూ, ఆమె బీసీవాదం వినిపిస్తే నీకొచ్చిన నొప్పి ఏమిటి తీన్మార్..? ఆమె తన రాజకీయ ఫాయిదా కోసమే బీసీ వాయిస్ ఎత్తుకుందనే అనుకుందాం… దాంతో బీసీవాదానికి వచ్చిన నష్టమేంటి..? ఇవన్నీ పక్కన పెడితే … అన్నింటికీ మించి ఏ అవలక్షణాలనైతే ఏపీ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాలు నేర్చుకోకూడదని భావిస్తున్నామో, వేగంగా వాటిని మించిపోతున్నయ్… అదీ అసలైన ట్రాజెడీ..!!
Share this Article