.
కావ్య మారన్..! ఐపీఎల్ హైదరాబాద్ జట్టు ఓనర్… హైదరాబాదీ ప్లేయర్లు ఎవరూ లేకపోయినా, జట్టులో ఆ పేరున్నందుకు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఈ జట్టును ఎంకరేజ్ చేశారు, ఓన్ చేసుకున్నారు, ఈ పిల్ల ప్రేమలో పడిపోయారు… అమితమైన అభిమానం చూపించారు…
సీన్ కట్ చేస్తే… ఇప్పుడు ఆమె పేరెత్తితే చాలు ఏవగించుకుంటున్నారు… కేవలం హైదరాబాదీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు… సగటు ఇండియన్ కూడా..! ఛీకొడుతున్నారు… నెట్‌లో ఆమె మీద దుమారం… ‘‘ఎందుకింత చెత్త పని చేశావ్’’ అని…
Ads
విషయం ఏమిటంటే..? పాకిస్థాన్ స్పిన్నర్ Abrar Ahmed ను ఇంగ్లాండ్‌లో జరిగే The Hundred లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు కొనుగోలు చేయడం… భారతీయుల్లో ఆగ్రహాన్ని రగిలించింది… (ఆమె కుటుంబ నేపథ్యం, ఆ పార్టీకి దేశం, అభిమానం, భక్తి వంటి పదాలపై పెద్ద నమ్మకాలుండవు…)

ఆపరేషన్ సిందూర్ ఎందుకు జరిగింది..? పహెల్‌గాం ఘాతుకానికి గాను పాకిస్థాన్‌కు బుద్దిచెప్పడానికి… అందుకే ప్రతి భారతీయుడి గుండె ఆ ఆపరేషన్ జరిగినన్నాళ్లూ దేశభక్తితో నినాదాలు చేసింది… ఇదేకాదు, పాకిస్థాన్ మన దేశానికి నిత్యద్వేషి… ఆ ధూర్తదేశం ఎప్పుడూ మన శత్రువే… ఆ క్రికెటర్లు, ఆ ఆర్మీ, ఆ ఉగ్రవాదులు, ఆ నాయకులు అందరూ తెల్లారిలేస్తే ఇండియా మీద ఏడ్చేవాళ్లే… ఉగ్రవాదాన్ని ఈ దేశం మీద మాత్రమే కాదు, ప్రపంచం మీదే రుద్దుతున్న ఉగ్ర దేశం అది…
సరే, దేశానికీ ఓ క్రికెటర్‌కూ సంబంధం ఏముంది..? ఆర్థిక కోణంలో మెరిట్ పట్టుకుంది కావ్య అంటారా..? అదీ తప్పే… ఓ సగటు ఇండియన్‌లా ఉద్వేగం లేనప్పుడు, ఆలోచించలేనప్పుడు… ఇండియన్‌గా ఆమె ఉనికే వృథా…
- మీకు గుర్తుందా..? బంగ్లాదేశ్ ఆటగాడిపై వివాదం… బంగ్లాదేశ్ క్రికెటర్ Mustafizur Rahman ఐపీఎల్‌లో పాల్గొనే విషయంలో వివాదం… కేకేఆర్ జట్టు తనను కొన్నది… ఒకవైపు బంగ్లాదేశ్ భారత్‌పై ద్వేష జాలల్లో మండిపోతుంటే… ఇన్నేళ్లు పిచ్చిగా ఇండియన్ సినిమా ప్రేమికులు అభిమానించిన షారూక్ ఖాన్ ఆ బంగ్లా ఆటగాడిని కొన్నాడు… దాంతో అందరూ షారూక్ ఖాన్‌తోపాటు కో-ఓనర్ జుహీ చావ్లా మీద కూడా భగ్గుమన్నారు… దీంతో ఆ ఆటగాడి ఎంట్రీకి ససేమిరా వీల్లేదు అనేసింది బీసీసీఐ…
మరి కావ్య మారన్ ఓ పాకిస్థానీ క్రికెటర్‌ను, అదీ ఇండియా మీద విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కేవాడిని ఎలా కొన్నది..? బీసీసీఐ ఎందుకు ఆమోదించింది అనేది ఓ ప్రశ్న… కానీ ఇది బీసీసీఐ అధికార పరిధి ఉండే ఐపీఎల్ కాదు… కానీ ఇంగ్లాండ్‌లో జరిగే The Hundred పై బీసీసీఐకి నియంత్రణ ఉండదు… అందుకే అక్కడ ఫ్రాంచైజీలు తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటాయి…
ఆసియా కప్ కావచ్చు, టీ20 వరల్డ్ కప్ కావచ్చు… పాకిస్థానీ క్రికెటర్లతో షేక్ హ్యాండ్‌కూ ఇష్టపడలేదు మన క్రికెటర్లు… అదొక నిరసన ప్రకటన… సగటు భారతీయుల్లాగా స్పందించాల్సిన ఉద్వేగం అది… క్రికెట్ వేరు, రాజకీయాలు వేరు అనే తిక్క, భ్రమాత్మక వాదనలు చెల్లవు ఇక్కడ… నీరూనెత్తురూ ఒకేచోట ప్రవహించవు అనే భావనే ఇక్కడ కూడా…
సరిగ్గా కావ్య మారన్‌లో లోపించింది ఇదే… దేశం అనే భావన కేవలం పాస్‌పోర్టులో ఉండే పదం కాదు. అది ఒక స్పూర్తి. ఒక బాధ్యత. ఒక గౌరవం. ఒక ఉద్వేగం… భారతదేశం మీద ఎవరైనా దాడి చేసినా… అవమానించినా… మనందరిలో ఒక కోపం రగులుతుంది… అదే దేశభక్తి. అదే మన ఉనికి… కావ్య మారన్‌లో లోపించిన విజ్ఞత కూడా ఇదే…
సరే, ఇక్కడ వ్యక్తిగతంగా అబ్రార్ ఎలాంటివాడు..? అదీ చూద్దాం… అభినందన్‌ను ఎగతాళి చేసిన ఆటగాడు… 2019లో పాకిస్థాన్ కస్టడీలో ఉన్నప్పుడు భారత వింగ్ కమాండర్ Abhinandan Varthaman ఒక మాట అన్నాడు… “The tea is fantastic…” ఆ పరిస్థితిలో కూడా ఆయన చూపిన ఆత్మవిశ్వాసం ప్రపంచాన్ని ఆకట్టుకుంది… కానీ అదే మాటను ఎగతాళి చేస్తూ Abrar Ahmed ఇన్‌స్టాగ్రామ్‌లో టీ కప్పుతో ఫోటో పెట్టి
“Last cup of fantastic evening tea” అని క్యాప్షన్ పెట్టాడు…
ఇండియన్ క్రికెటర్లపై స్లెడ్జింగ్, సోషల్ మీడియా పోస్టులు — ఇవన్నీ కలిసి అతనిపై ఇప్పటికే ఒక నెగటివ్ ఇమేజ్‌ను సృష్టించాయి… ఒకటి గుర్తుందా..? ఓసారి ఓ ఇండియన్ వికెట్ తీశాక తను వెక్కిరిస్తూ చేసిన సైగ… తలతో పెవిలియన్ వైపు చూపిస్తూ ‘ఇక వెళ్లు’ అన్నట్టుగా… ఇదేకాదు, తన ధోరణి మొత్తం పక్కా భారత వ్యతిరేకత…

వ్యాపారం కంటే పెద్దది దేశం… క్రికెట్ కేవలం ఒక ఆట… ఫ్రాంచైజీలు వ్యాపార సంస్థలు… కానీ దేశ గౌరవం అనే విషయం ఆ రెండింటికంటే పెద్దది… దేశాన్ని ద్వేషించేవాడిని, అదీ ఓ శతృదేశపు క్రికెటర్‌ను కేవలం టాలెంట్ అనే సాకుతో కావ్య మారన్ తన ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకోవడం… సగటు ఇండియన్‌కు నచ్చని అంశం… అందుకే కావ్య మారన్ అంటే ఇప్పుడు సగటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్‌కు ఏవగింపు…
చాలామందికి అంగీకరించలేని విషయం… ఇండియన్ నెటిజనం అందుకే థూత్కరిస్తున్నారు…!!
Share this Article