సీనియర్ పాత్రికేయ మిత్రుడు షేర్ చేసిన ఓ పోస్టు చదివాక… ఆశ్చర్యమేసింది… కాదు, మొదట అనుమానమేసింది… ఎందుకు అంటే..? ఇంత మంచి వార్త తెలుగు మీడియా ఎందుకు ఆనలేదు, అంటే, ఎందుకు కనిపించలేదు… ఎక్కడా ప్రముఖంగా కనిపించలేదు అనేది ఆశ్చర్యం… అసలిది నిజమేనా అని అనుమానం…
టన్నుల కొద్దీ పొలిటికల్ అఘోరీల బురదను, బూడిదను సమాజంలోకి పంప్ చేస్తున్న మన మీడియా గురించి తెలిసిందే కాబట్టి… ఆశ్చర్యానికి అర్థం లేదని కూడా అనిపించింది… అనుమాన నివృత్తి కోసం చెక్ చేస్తుంటే యూట్యూబ్ వీడియోలు మాత్రమే కాదు, టైమ్స్‌లో వార్త కూడా కనిపించింది… కాకపోతే అది పది రోజుల క్రితం వార్త… వావ్…
నాకు షేర్ చేయబడిన పోస్టు తెలుగులో… ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి రీసెంట్ ఎపిసోడ్, అంటే 49వ ఎపిసోడ్ హాట్ సీట్‌లోకి డాక్టర్ నీరజ్ సక్సేనా వచ్చి కూర్చున్నాడు… గంభీరంగా… కొందరు కంటెస్టెంట్లలాగా డాన్సుల్లేవు, ఫుల్లు ఎమోషన్స్ లేవు, అరుపుల్లేవు, చేతులు పైకెత్తి ఆనంద వ్యక్తీకరణ లేదు… అమితాబ్ కాళ్లు మొక్కడం, హత్తుకోవడం అస్సల్లేవు…
Ads
డాక్టర్ నీరజ్… మెడికల్ డాక్టర్ కాదు, సైంటిస్ట్… కోల్‌కతాలోని JSI యూనివర్శిటీ ప్రొ-చాన్స్‌లర్… ప్లజెంట్, సింపుల్ పర్సనాలిటీ… తన పరిచయంలోనే చెప్పుకున్నాడు ‘నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతోపాటు కలిసి పనిచేశానని… మొదట్లో తన గురించి మాత్రమే ఆలోచించేవాడిననీ, కానీ ఆయనతో కలిసి పనిచేసిన తరువాతే ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించడం అలవాటైందని హంబుల్‌గా చెప్పుకున్నాడు.,.
గేమ్ స్టార్ట్ చేశాడు… ఒకసారి ఆడియెన్స్ పోల్ లైఫ్ లైన్ ఉపయోగించుకున్నాడు… అన్ని ప్రశ్నలూ చకచకా ఆన్సర్ చేశాడు… స్పీడ్‌గా… 3.2 లక్షల దశకు చేరుకున్నాడు… బ్రేక్… తరువాత…
అమితాబ్ అడిగాడు, డాక్టర్ సాబ్, కంటిన్యూ చేద్దామా..? ఇప్పుడు మీకు పదకొండో ప్రశ్న… నీరజ్ అన్నాడు… ‘సర్, నేను ఆట ఆపేయాలని అనుకుంటున్నాను…’ అమితాబ్ మొహంలో ఆశ్చర్యం, తను సరిగ్గానే విన్నానా అనే అనుమానం… ఇంత స్పీడ్‌గా, ఇంత కూల్‌గా, ఇంత తెలివిగా ఆట ఆడుతున్న వ్యక్తి ఇంకా లైఫ్ లైన్స్ బాకీ ఉండగానే ఆటను క్విట్ చేయడం ఏమిటి..?
కోటి రూపాయల దాకా ఈజీగా చేరుకోగలడు అనుకుంటున్న వ్యక్తి అలా ఆటను మధ్యలోనే స్వచ్చందంగా వదిలేయడం 20 ఏళ్ల కేబీసీ చరిత్రలోనే తొలిసారి… అదే చెప్పాడు తను… దానికి నీరజ్ సమాధానం…
‘‘ఇతర ఆటగాళ్లు వెయిట్ చేస్తున్నారు తమ చాన్స్ కోసం… నాకన్నా వయస్సుల్లో చిన్నవాళ్లు… వాళ్లకూ ఓ చాన్స్ రానివ్వండి… ఆల్రెడీ కొంత సొమ్ము వచ్చిందిగా… నాకు రావల్సింది నాకు వచ్చేసింది… ఇది చాలు… ఇంకా ఎక్కువ వద్దు నాకు…’’
అమితాబ్, ఆడియెన్స్ నిర్ఘాంతపోయారు… నిశ్శబ్దం అక్కడ… మెల్లిగా అందరూ లేచి నిలబడి మనస్పూర్తిగా చప్పట్లు కొడుతూ నీరజ్ నిర్ణయం పట్ల తమ అభినందనల్ని వ్యక్తీకరించారు… అమితాబ్ అన్నాడు… ‘నా జీవితంలో ఈరోజు చాలా నేర్చుకున్నాను అనిపిస్తోంది… మీలాంటి వ్యక్తుల్ని చూడటం చాలా అరుదు… ఎదురుగా గొప్ప అవకాశం ఉండగా, ఇతరులకూ చాన్స్ ఇద్దాం అనుకునే వ్యక్తి, దక్కింది చాలు అనుకునే వ్యక్తి, ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఇలాంటి పర్సనాలిటీ చూడటం ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది…’’
ఆయన తరువాత ఓ అమ్మాయి ఆ హాట్‌సీట్‌లోకి వచ్చి కూర్చుంది… మా నాన్న మమ్మల్ని వదిలేశాడు, మా అమ్మను కూడా… ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు అనే ఏకైక కారణంతో… మేం అనాథాశ్రమంలో ఉంటున్నాం…’’ అని చెప్పుకుంది… ఆట చివరిరోజు ఇది, నీరజ్ గనుక ఆట మధ్యలోనే వదిలేయకపోతే, ఆమె ఆ సీట్‌లోకి వచ్చేది కాదు… ఎంతో కొంత డబ్బు గెలుచుకునేదీ కాదు…
ఇక్కడ కొన్ని అంశాలు… ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అంటాడు ఓ సినీరచయిత… అవును, ఎక్కడివరకు ఉరకాలో తెలిసినవాడు, ఎక్కడ పరుగు ఆపాలో తెలిసినవాడు, అదీ ఇతరుల కోసం తను ఆగిపోయేవాడు నిజంగా గొప్పోడు…
నిజమే… జీవితంలో ఆశకు, తృప్తికి అంతెక్కడిది..? ఎక్కడో… ఏదో ఓ దశలో ఇక చాలు అనుకోవాలి… అలా అనుకునేవాడిని మించిన ధన్యుడు లేడు… ఇంత పాఠం చెప్పాడు డాక్టర్ నీరజ్ సక్సేనా… గ్రేట్… మనసుపెట్టి ఆలోచిస్తేనే, మన చుట్టూ లోకమెలా ఉందనే స్పృహ ఉంటేనే ఆయన వ్యక్తిత్వం గొప్పతనం అర్థమవుతుంది…
ఇంకా రాయాలని ఉంది… టైమ్స్ వార్తలోని కొన్ని అదనపు విశేషాలు ఇవి… (ఆయన గురించిన వికీ సమాచారం జోలికి, తన వ్యక్తిగత జీవిత వివరాల్లోకి కూడా వెళ్లడం లేదు ఇక్కడ…)
సూపర్ సవాల్ స్టేజ్‌లో తనకు ఎదురైంది మన తెలుగు ప్రశ్నే… తిరుపతి వెంకటేశ్వరస్వామి గుడి ఏ రాష్ట్రంలో ఉంది… తరువాత స్విట్జర్లాండ్, లాసానే మ్యూజియంలో అభినవ్ బింద్రాకు సంబంధించి ఏం పెట్టబడింది… రైఫిల్…
కలాం గురించి చెబుతూ… చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం కూడా ఓరకమైన నేరమే అనేవాడు… థింక్ బిగ్… అదే తను పదే పదే చెప్పే పాఠం… మన గురించే కాదు, దేశం గురించీ ఆలోచించాలనేవాడు… ఒకసారి కలాంతో అన్నాను, మీరు పదే పదే పాట్నాకు ఎందుకు వెళ్తారో, ఎందుకు ఆ సిటీ అంటే ఇష్టమో తెలుసన్నాను, ఏమిటో చెప్పు అన్నాడు ఆయన…
P A T N A… అంటే Prudhvi, Agni, Trishul, Nag, Akash మీరు డెవలప్ చేసిన క్షిపణుల మొదటి అక్షరాలు కాబట్టి అని చెప్పాను… కలాం ఎంత ఆనందపడ్డాడో చెప్పలేను… KBC అంటే Knowledge Brings Confidence… అలాగే Amitabh అంటే Amazing Minds Inspiring Thousands And Bringing Happiness’’
నీరజ్ సక్సేనా 3.2 లక్షలు ప్లస్ అంతే మొత్తం బోనస్ కలిపి 6.4 లక్షలు తీసుకెళ్లాడు… తన తరువాత హాట్‌సీట్‌లోకి వచ్చిన సోనియా రిజ్వానీ తన లైఫ్ స్టోరీ చెప్పి అందరినీ కదిలించింది… 3.2 లక్షలు తీసుకెళ్లింది..!!
Share this Article