పెద్ద సారు ఎన్నడూ లేనిది, ప్రగతి భవన్ తలుపులు తెరిచి, అఖిలపక్షాల్ని, దళిత ప్రజాప్రతినిధుల్ని పిలిచి భేటీ వేసినప్పుడే అర్థమైపోయింది… ఏదో కొత్త కథకు శ్రీకారం చుడుతున్నాడని…! కేసీయార్ ప్రతి అడుగు వెనుక ఓ రాజకీయ ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది… లేకపోతే ఇటు పుల్ల అటు పెట్టేదే లేదు… అయితే తను సీఎం అయ్యాక ఎన్నెన్నో ఉపఎన్నికల్ని ఉఫ్ అని ఊదేసిన ఆయన హుజూరాబాద్ ఉపఎన్నిక అనేసరికి ఎందుకంత బెంగపడుతున్నడో ఎవరికీ అర్థం కావడం లేదు… నిజంగా అంత టఫ్ ఫైటా..? మరి ఏడేళ్ల మన అద్భుత సుపరిపాలన కూడా వోట్లు పండించలేకపోతుందా..? ప్రస్తుతం గ్రామ స్థాయి దాకా ఎవరెవరిని ఏ మార్గాల్లో తొవ్వకు తెచ్చుకోవాలో ప్రణాళికలు సాగుతూనే ఉన్నయ్… తెర వెనుక హరీష్ తన మార్క్ రాజకీయాలన్నీ ప్రయోగిస్తూనే ఉన్నాడు… కేసీయార్ అయితే ఏకంగా తెలుగుదేశం నుంచి రమణను కూడా లాగేసిండు… అక్కరకొచ్చేవాళ్లను ఐడెంటిఫై చేసి క్యాంపులోకి లాక్కొచ్చేస్తారు… ఈటల నిలబడతాడా..? ఈటల భార్య జమున నిలబడుతుందో క్లారిటీ లేదు గానీ… దీన్ని సాధారణ ఎన్నికలకన్నా సీరియస్‌గా తీసుకుంటున్నాడు కేసీయార్… నిజంగా అంత బెంబేలెత్తి, సర్వశక్తులూ, సాధనసంపత్తి ప్రయోగించాల్సినంత పరిస్థితి ఉందా..?
చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు… కేసీయార్ ప్రకటించిన తెలంగాణ దళిత బంధు పథకం ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ప్రకటించాడని… అందుకే మొత్తం 119 నియోజకవర్గాల్లో కేవలం హుజూరాబాద్ మాత్రమే మొదట కనిపించిందట పైలట్ ప్రాజెక్టు కోసం… అదేదో ఎస్సీల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు కదా… ఊఁహూ లేదు, హుజూరాబాద్‌లోనే ప్రారంభించాలి… అక్కడ ఎన్నిక వస్తున్నది కాబట్టి… ఒక్కొక్క లబ్దిదారుడికీ 10 లక్షలు… 21 వేల కుటుంబాలకు నేరుగా ఖాతాల్లోకి వేసేస్తారట… నోటిఫికేషన్ ఏదీ రాలేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎన్ని వరాలు కురిపించినా పర్లేదు… రూల్స్‌కు విరుద్ధం కూడా కాదు… ఎస్సీ ఓట్లను ఆకర్షించడానికి ఇంకేం కావాలె..? నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ వరద ఇంకా ఇంకా పొంగే చాన్స్ కూడా ఉంది… మరి మా బీసీలు ఏం పాపం చేశారు..? మేం బతకొద్దా..? మాకెందుకు ఇవ్వవు..? అని బీసీలంతా ఐక్యమై అడిగితే ఎలా అంటారా..? కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది కదా అంటారా..? అబ్బే, పెద్ద సారు దానికీ ఏదో ఆలోచన చేస్తున్నాడేమో… కానీ ఈటల ప్రయోగించబోయే బీసీ అస్త్రానికి విరుగుడుగా కేసీయార్ దళితాస్త్రాన్ని ప్రయోగించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టాడనేది సుస్పష్టం… అలాగే… బహుశా హుజూరాబాద్ ఎన్నిక దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన ఎన్నిక కాబోతున్నదేమో కూడా… అధికారిక, అనధికారిక ఖర్చులు కలిపి…
Ads
పేరుకు పైలట్… అంటే ప్రయోగాత్మకంగా అమలు… అంతే… ఉపఎన్నిక అయిపోగానే ఖేల్ ఖతం, దుక్నం బంద్..!! లేదా ఏదో నామ్‌కేవాస్తేగా అలా ఉండిపోతుంది… అందుకే ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి మాత్రమే పథకం వర్తింపజేస్తామని మొదట్లో చెప్పింది… మరి మిగతావాళ్లు..? హుజూరాబాద్‌లోనేమో ఎన్ని వందల కోట్లయినా సరే, అందరికీ ఇస్తారట.., మిగతా రాష్ట్రంలో మాత్రం ఒక్కోచోట వంద మందికేనట… నిజానికి అసలు రాష్ట్ర ఆర్థిక స్థితే చాలా గందరగోళంగా ఉంది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నయ్… ఈ స్థితిలో దశలవారీగానైనా సరే, ఒక్కో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేంత సిట్యుయేషన్ ఉందా ఖజానాకు..? ఏమైనా చేసుకో, ఎలాగైనా ఖర్చు పెట్టుకో అంటూ… ఇంటికి 10 లక్షల పంపిణీ ఇచ్చే స్కీమ్ బహుశా ప్రపంచంలోనే ప్రథమం కావొచ్చు… ఏడేళ్లలో ఎన్నడూ లేనిది దళితులపై ఎనలేని ప్రేమ పుట్టుకురావడం వెనుక అసలు రాజకీయ ఆలోచన ఏమిటో అందరికీ తెలుసు… కానీ ఈ స్థాయిలో ప్రిపేరవుతున్న కేసీయార్ మీద ఐక్యపోరాటం ఎలా చేయాలో, అసలు ఐక్యపోరాటం చేయాలో వద్దో కూడా విపక్షాలకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు… బీజేపీ నుంచి ఈటల లేదా ఆయన భార్య నిలబడటం పక్కా… పాదయాత్ర పేరిట ఆయన ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసినట్టే… మరి ఇది ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా చూస్తున్న కేసీయార్ ఎవరైనా దళితనేతను దింపుతాడా, ఈటలకు పోటీగా మరో బీసీ నేతను ప్రయోగిస్తాడా చూడాల్సి ఉంది… కాంగ్రెస్ పార్టీకి కూడా సరైన అభ్యర్థి లేడు… ఆ పాత కౌశికుడు పార్టీ వీడాల్సి వచ్చి, ఇప్పుడు అటూఇటూ గాకుండా పోయినట్టే అనిపిస్తోంది… ఒకవేళ కేసీయారే తమ ఇద్దరికీ ప్రథమశత్రువు, ప్రబలశత్రువు అనుకునే పక్షంలో కాంగ్రెస్ పేరుకు ఓ బలహీన అభ్యర్థిని పెట్టి, ఈటల గెలుపు కోసం పరోక్షంగా సహకరించే చాన్స్ ఉందా..? ఆ సుహృద్భావం సాధ్యమేనా..?!
Share this Article