ఓహ్, అదా సంగతి..? ఈ పెద్ద దొరవారు రెండుసార్లు హస్తినకు వెళ్లి, రోజుల తరబడీ తిష్ఠ వేసి, బీజేపీ వాళ్లతో ఏం బేరాలు కుదుర్చుకుని వచ్చాడో అర్థం గాక, అందరమూ జుట్టు పీక్కుంటున్నాం కదా… హమ్మయ్య, క్లారిటీ వచ్చేసింది… మనసులో చింతలన్నీ మాయమైపోయినయ్… ఇలాంటి స్కూపులు రాధాకృష్ణకు మాత్రమే తెలియాలని ఏముంది..? ఈసారి ఢిల్లీలోని ఆంధ్రజ్యోతి హియరింగ్ స్పై బడ్స్, హిడెన్ కెమెరాలు సరిగ్గా పనిచేయలేదేమో, తన కొత్త పలుకులోనూ ఉలుకు లేదు, పలుకు లేదు… కానీ ‘సూర్య’ అనే చిన్న పత్రిక అందుకుంది… ఆ రిపోర్టర్ ఎవరో మొత్తం పట్టేశాడు… ఒక పేజీ స్టోరీ కుమ్మేశాడు… ఇక ట్యూబ్ జర్నలిస్టులు అందుకోవడమే ఆలస్యం… (ఢిల్లీ జర్నలిస్టులూ కుళ్లుకోకండి… మీరే తోపులు కాదు, ఇక్కడ కూడా అగ్ని క్షిపణులున్నయ్ తెలుసా..?)
‘సూర్య’ కిరణాలు ప్రసరించిన సదరు స్టోరీ సారాంశం ఏమనగా… ‘‘కేసీయార్ ఉపరాష్ట్రపతి అవుతాడు, కేటీయార్‌ను తెలంగాణ సీఎంను చేస్తారు, మూడు కేంద్ర మంత్రి పదవుల్ని టీఆర్ఎస్‌కు ఇస్తారు, అందులో ఒకటి హరీష్‌రావు తప్పనిసరి… రేవంత్‌ను అరెస్టు చేసి జైల్లో పారేస్తారు…’’ ఇదంతా వోకే గానీ, మరి ఇందులో బీజేపీకి వచ్చేదేముంది అని అమాయకంగా అడక్కండి… కేసీయార్ వెళ్లి, అర్జెంటుగా ఆ ఢిల్లీకి కాస్త దూరంగా ఓ ఫామ్ హౌజ్ కట్టేసుకుని, ఇక అక్కడి నుంచే దేశపాలన చక్రాలు తిప్పుతూ, రాజకీయాల్ని పిండేస్తూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి జ్ఞానబోధ, కర్తవ్యబోధ గట్రా చేస్తూ ఉంటాడన్నమాట… అదీ త్యాగమంటే..? ప్రధాని కావల్సినోడు లేదా కనీసం రాష్ట్రపతి కావల్సినోడు జస్ట్, ఓ ఉపరాష్ట్రపతి పదవికి రాజీపడటం అంటే మామూలు విషయమా..? దేశం కోసం ఆయన ఎంతకైనా తగ్గుతాడు… ఎంత ఒదిగి ఉండటానికైనా రెడీ…
Ads
కేటీయార్ సీఎం అయిపోతాడుట… కానీ నడుమ ఈ రేవంత్ ఉన్నాడుగా… విధ్వంసకారి… టీఆర్ఎస్‌ను ధ్వంసం చేసే ప్రమాదం ఉంది కదా, ఏం చేద్దాం..? రేవంత్‌ను జైలులో పడేస్తే సరి… మరి హరీష్‌రావు..? తను కూడా ప్రమాదకారే… సొంత పార్టీ విధ్వంసకారి అయ్యే ప్రమాదం ఉంది… ఫస్ట్ నుంచీ అదే కదా దొరవారి డౌటు… కానీ వదిలేయలేడు కదా… తనతోపాటు కేంద్రానికి తీసుకెళ్లిపోతాడన్నమాట… కేంద్ర మంత్రిని చేస్తే, బీజేపీకి దగ్గర చేస్తే చాలు… ఇక ఎప్పుడైనా కాశ్మీర్‌లోనో, ఈశాన్యంలోనో క్రైసిస్ వచ్చినప్పుడల్లా ఈయన డీల్ చేస్తాడన్నమాట… చూశారా, ఎంత సింపుల్ ఈక్వేషనో… అమిత్ షా మంత్రాంగమో, అజిత్ దోవల్ తంత్రాంగమో గానీ భలే ప్లాన్ రచించారు… అనవసరంగా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు తన్నుకుంటున్నారు గానీ… ఇక చాలు.., సాయంత్రానికి క్వార్టర్ సీసాలు కలిపేయండి, బిర్యానీ పొట్లాలు షేర్ చేసుకొండి, అలయ్ బలయ్ అని అలుముకొండి… అవును గానీ… జగన్‌ను ఏం చేయాలనుకున్నారు..? తనను రమ్మంటే, నాకు మడమ బెణికింది, రానుఫో అన్నాడు… ఇంతకీ తనతో ఏం బేరాలు పెట్టబోతున్నారో..? సార్, సూర్య గారూ, ఈ రాధాకృష్ణతో అయ్యేట్టు లేదుగానీ, ఆ వార్త కూడా మీరే రాసేయండి సార్…!!
Share this Article