‘‘జగన్ మూర్ఖుడు… తండ్రి రాజశేఖరరెడ్డిని మించిపోయాడు… అక్రమ ప్రాజెక్టుల్ని కట్టి మన నీళ్లు ఎత్తుకుపోతున్నాడు…’’…. నిజానికి కేసీయార్ జగన్ను తిట్టినట్టు కాదు… జగన్ నెత్తిన పాలు గుమ్మరించాడు కేసీయార్… జగన్ కోరుకునే ఇమేజీ కూడా అదే… కేసీయార్తో సైతం గొడవకు రెడీ, తన సీమ ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు అని కేసీయార్ ఓ సర్టిఫికెట్ ఇచ్చినట్టు..! అంటే జగన్ను ఏమీ అనకూడదా..? తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోతుంటే ఊరుకోవాలా..? కాదు..! జగన్ మూర్ఖుడు అనే పదప్రయోగం నిజంగా జరిగి ఉంటే అదొక్కటీ అభ్యంతరకరం… కానీ ఏపీ ప్రభుత్వ కొత్త ప్రాజెక్టులు, కొత్త అడుగులపై కేసీయార్ కేబినెట్ భేటీలో చెప్పినవన్నీ నిజాలే… కేసీయార్ ఎందుకు..? ఆఫ్ ది రికార్డుగా అడిగితే జగన్ కూడా అంగీకరిస్తాడు… నిజానికి ఇక్కడ ఎవరిది తప్పు..? లోతుల్లోకి వెళ్తే మొత్తం తప్పంతా కేసీయార్ వైపు పోగుపడి ఉంది… ఇప్పుడు జగన్ను తిట్టడం వల్ల ప్రయోజనం లేదు… ఎందుకంటే..?
నీరు కూడా నిప్పే… జాగ్రత్తగా ఆడాలి ఆట… ఏ రాష్ట్రం ముందుగా ప్రాజెక్టులు కట్టేసుకుంటుందో వాళ్లదే పైచేయి… కేంద్రం, కోర్టులు ఏదో చేస్తాయనేది ఉత్త భ్రమ… వైఎస్ భాషలో చెప్పాలంటే ఇవేమైనా రసాయన ప్రాజెక్టులా… అనుమతులన్నీ వచ్చాక కట్టడానికి..? ఈ అనుమతులు అనేదే పెద్ద ప్రహసనం… ఈ సత్యం, ఈ తత్వం కర్నాటకకు బాగా తెలుసు… ఎవరెంత ఏడ్చినా సరే, ఆలమట్టి మొదలుకొని అనేకానేక ప్రాజెక్టుల్ని చకచకా కట్టేసుకుంది… చివరకు ఏమైంది..? బ్రజేష్ ట్రిబ్యునల్ పాత లెక్కల్ని, సమీకరణాల్ని, నీటి లభ్యత ప్రామాణికాల్ని మార్చేసి మరీ వాటికి చట్టబద్ధత కల్పించేసింది… జగన్ ఏం చేస్తున్నాడు..? సీమ లిఫ్ట్ కట్టేస్తున్నాడు, రాజోలిబండ కుడి డైవర్షన్ కాలువ తవ్వేస్తాడు, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసేస్తాడు… మరి కేసీయార్ ఏం చేస్తున్నాడు..? జగన్కన్నా అయిదేళ్ల ముందే సీఎం అయ్యాడు కదా… మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టులు, నీళ్లు అంటాడు కదా… అసలు తెలంగాణ మలిదశ ఉద్యమ ఎజెండాలో ముఖ్యమైనదే నీళ్లు కదా…
Ads
ఎంతసేపూ ఆ కాళేశ్వరం తప్ప మరో సోయి లేదు… దానిపైనా బోలెడు విమర్శలున్నయ్… మాజీ నీళ్ల మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూర్చోబెడితే కాళేశ్వరం తప్పులేమిటో వంద చెబుతాడు… ఇప్పటికీ ఆ పాత ప్రాణహిత నీళ్లే తప్ప కాళేశ్వరం నుంచి ఏ ప్రయోజనమూ లేదంటాడు… ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర షరతులన్నింటికీ అంగీకరించాడు కేసీయార్… మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి… ప్రత్యేకించి తెలంగాణ తన హక్కుల కోసం వేగంగా కదలాల్సిన కృష్ణా ప్రాజెక్టులపై శీతకన్ను… తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడేనాటికి జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ఆధారిత ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో, ఇప్పటికీ ఏం మారలేదో ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది… ఒకరిద్దరు నేతలకు తప్ప విపక్షాలకు ఆ సోయి లేదు, ఆ సబ్జెక్టు నాలెడ్జి కూడా లేదు… మీడియా ఏనాడో సాగిలబడిందే… పైగా ఇదే కేసీయార్ ఏం చేశాడు..? ఏపీతో కలిసి జాయింటుగా ఓ భారీ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నాడు… చివరకు జగన్ నమ్మలేదు, మా ప్రాజెక్టులు మేం చూసుకుంటాంలే అంటూ కేసీయార్ కౌగిలి నుంచి విడిపోయాడు… పోనీ, కేసీయార్ తరువాతైనా కళ్లు తెరిచాడా..? సీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు విస్తరణ, కుడి ఆర్డీఎస్… ఎడాపెడా జగన్ దూసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి చడీచప్పుడూ లేదు… ఇప్పుడు కేంద్రం దగ్గరకు వెళ్తాం, ఫిర్యాదులు చేస్తాం అంటోంది… అసలు ఏపీ ప్రభుత్వం మీద వేసిన కేసును ఎందుకు ఉపసంహరించుంటున్నట్టు… తెలంగాణ సమాజానికి బదులు చెప్పాల్సింది కేసీయారే…
ఈరోజుకూ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో తిరుగుతూ ఏవేవో ఆరోపణలు చేస్తుంటే… చివరకు కేసీయార్ను వ్యక్తిగతంగా మూతకండ్లోడు అని తిట్టినా టీఆర్ఎస్ నుంచి ఒక్క తులమెత్తు ప్రతిఘటన, నిరసన, ఎదురుదాడి లేదు… సరే, ఇవన్నీ వదిలేస్తే… ఇప్పుడు అర్జెంటుగా ఎడాపెడా కృష్ణా ప్రాజెక్టులు కట్టేస్తారట… ఓ పెద్ద ఆనకట్ట ఆగమేఘాల మీద నిర్మిస్తారట… ఏడేళ్లలో కలిగించలేని నమ్మకాన్ని ఇప్పుడెలా కలిగిస్తాడు కేసీయార్..? వెంటనే డీపీఆర్స్ ప్రిపేర్ చేయండి, కట్టేద్దాం అంటున్నాడు… అసలు నిర్మాణంలో ఉన్నవాటికే ఏ దిక్కూలేదు, ఇక కొత్తవి..? అందులోనూ లిఫ్టులు… మేఘా కోసం లిఫ్టుల మీద ప్రేమ..! ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా ముందుకు వెళ్తోంది సరే, కేంద్రం చోద్యం చేస్తోంది సరే, ఒక్కసారైనా కేసీయార్ మీడియా ముందుకొచ్చి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు..? తనేం చేయదలుచుకున్నాడో ఎందుకు జనానికి చెప్పడం లేదు..? తనకు దాసోహంగా ఉన్న మీడియాలో ఈ కథనాలు ఎందుకు రావు..? వంద దేనికి..? ఒక్క ఉదాహరణ తీసుకుందాం… అప్పుడెప్పుడో వైఎస్ స్టార్ట్ చేసిన ఎస్ఎల్బీసీ సొరంగం పనుల దుర్గతికి కారణాల్ని తెలంగాణ ప్రభుత్వం కన్విన్సింగుగా తన ప్రజలకు చెప్పగలదా..?!
Share this Article