.
ప్రజలే దేవుళ్లు… ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని ప్రజాజీవితంలో ఉండే ఏ నాయకుడైనా అనుసరించాల్సిన సూత్రం ఇదే… ఈ దేవుళ్ల కరుణే నాయకుడిని నిలబెట్టేది… కానీ వేలాది పుస్తకాలు చదివిన కేసీయార్‌ను దాన్ని విస్మరించాడు…
ఓ ప్రతిపక్ష నేతగా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, వెళ్లు అని ప్రజలు తీర్పు చెబితే… దాన్ని కించపరుస్తూ, ప్రజల మీద కోపంతో… ఠాట్, అధికారమొస్తే ప్రజాజీవితం, లేకపోతే ఫామ్ హౌజ్ జీవితం అని భీష్మించుకుని ప్రజాస్వామిక స్పూర్తిని, నాయకుడిగా తన కర్తవ్యాన్ని తొక్కేయడం తన మొత్తం రాజకీయ జీవితానికే మచ్చ… నిజానికి ఇప్పుడే తను జనంలో ఉండాల్సింది…
Ads
తెలంగాణకు ఏ కష్టమొచ్చినా వెంటనే పరుగున రావల్సింది, నిలబడాల్సింది ఇప్పుడే… ప్చ్, అదే కనిపించడం లేదు…
నిజానికి కేసీయార్ మాత్రమేనా..? తను ప్రజాజీవితంలోనే లేడు గానీ… మేం అసెంబ్లీకి వెళ్లం అని ఏవేవో సాకులతో చంద్రబాబు అంతే, జగన్ అంతే… అప్పట్లో ఎన్టీయారూ అంతే… ఇదంతా ఎందుకు యాదికి వచ్చిందంటే… పొద్దున ఓ డిజిటల్ పేజీలో ఓ వార్త చూశాక… తరువాత కాసేపటికే ఓ షార్ట్ న్యూస్ యాప్‌లో అదే వార్త కనిపించాక…
ఆయన చండీయాగం తలబెట్టాడు, 15 మంది రుత్విక్కులు, కటిక నేలపై పడుకుంటాడు మొత్తం యాగ రోజులు… ఎందుకయ్యా అంటే… మొత్తం ప్రతికూల పరిస్థితులున్నాయి… వాటిని దీటుగా ఎదుర్కొనడానికి, దేవుడి కరుణ పొందడానికి… గుడ్…
అయోధ్య అంటే శూర్పణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అని వెక్కిరించాడు గానీ… తను సొంతంగా యాగాలు, హోమాలు, ప్రత్యేక పూజలు చాలా చేస్తుంటాడు… తను చేసినన్ని యాగాలు బహుశా వర్తమాన రాజకీయాాల్లో ఉన్న ఏ నాయకుడూ చేయలేదేమో… చాలా కష్టసాధ్యం అని భావించే ఆయుత చండీయాగం కూడా చేశాడు…
అంతేకాదు, దానికన్నా మిన్నగా భావించే ప్రయుత చండీయాగం కూడా అమ్మవారు కరుణిస్తే చేస్తాను అన్నాడు కేసీయార్… ఆయుత చండీయాగానికి చాలామంది ప్రముఖులు వచ్చి వెళ్లారు… చివరకు అప్పటి రాష్ట్రపతి కూడా బయల్దేరాడు… కానీ హఠాత్తుగా యాగశాల పైకప్పు అంటుకుని మంటలు రేగాయి…
అంతటి యాగంలో ఎక్కడ నిష్టలో తప్పు దొర్లిందో ఏమో గానీ, అది చివరకు ఫలశ్రుతి కాదు, నిష్ఫల శ్రుతిగా మారింది… నిజం, కేసీయార్ అన్నట్టు ఇలాంటి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా సరే నిరాటంకంగా జరగాలన్నా దేవుడి కరుణ అవసరం…
ఐతే ఇటు కనిపించే ప్రజాదేవుళ్లను… అదీ అద్భుతమైన పొలిటికల్ కెరీర్ ఇచ్చిన దేవుళ్లను విస్మరించి, అలిగి, అవమానిస్తూ… కనిపించని దేవుళ్ల కరుణ కోసం ప్రయాసపడటం మీద కామెంట్లు అక్కరలేదు గానీ… ఈ చండీయాగం వార్త నిజమని మాత్రం అనిపించడం లేదు…
ఒకవైపు కాళేశ్వరం కమిషన్ తననే అల్టిమేట్ దోషిగా ముద్రవేసి, ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది… మరోవైపు సొంత బిడ్డ తలనొప్పులు క్రియేట్ చేస్తోంది… ఇంకా మెడమీద ఫోన్ ట్యాపింగ్, విద్యుత్తు కమిషన్ వంటి కత్తులూ ఉన్నాయి… రోజూ పార్టీ ముఖ్యనేతలతో భేటీలు, సంప్రదింపులు సాగుతున్నాయి… తదుపరి కర్తవ్యం ఏమిటో ఖరారు చేసుకోవడానికి…
ఈ స్థితిలో నిష్టగా, నిలకడగా చండీయాగం మీద దృష్టి పెట్టడం కష్టం… చేయలేడని కాదు, కమ్ముకొస్తున్న సమస్యలు మనిషిని నిమ్మళంగా ఉంచలేవు…
చేయొచ్చు… ఈ చండీయాగమే కాదు, ప్రయుత చండీయాగమే చేయొచ్చు తను తలుచుకుంటే… ఇదేకాదు, కామాఖ్యకు వెళ్లి రాత్రి పూట భగాలాముఖి వామాచార బలి పూజలు కూడా చేసుకోవచ్చు… ఏ వేణుస్వామినో పిలిచి రాజశ్యామల పూజ కూడా చేయించవచ్చు…
కానీ ప్రతి మనిషి జీవితంలో ఓ అదృష్టదశ వస్తుంది… అది కేసీయార్ అనుభవించేశాడేమో… ఇక ఏ పూజలైనా సరే నెగెటివ్ పరిస్థితులను తట్టుకుని, పోరాడటానికెే..! ఏమో, ప్రజాదేవుళ్ల సేవలో ఉంటే, ఆ ప్రజలే కరుణించి, ఆదరిస్తే వర్తమాన సమస్యల్ని కూడా తట్టుకునే శక్తిని ఆ దేవుళ్లే ఇస్తారేమో..!!
Share this Article