కేసీయార్ అలవోకగా అబద్ధాలు ఆడేయగలడు… అది పదే పదే నిరూపితమైంది… స్టిల్ ఇప్పుడూ అదే… నిన్న ఏదో పార్టీ మీటింగులో కొడుకుతో కలిసి పాల్గొన్నాడు… బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడుతూ ‘కేసీయార్ గెలవాలని కోరుకున్నారు’ అన్నాడు… తప్పు… కేసీయార్ గెలవాలని జనం కోరుకుంటే కామారెడ్డిలో తనే ఎందుకు ఓడిపోయాడు..?
పార్టీ సంగతి పక్కన పెట్టినా సరే, తనే స్వయంగా పోటీచేసినా సరే జనం ఎందుకు తిరస్కరించారు..? ఇదే రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది… అందుకే ఎన్నికల్లో ఓటమి… అది తన పట్ల జనవ్యతిరేకతే… తన మీద జనంలో అభిమానం అలాగే ఉండి ఉంటే తను కామారెడ్డిలో కూడా పోటీచేయాల్సిన అవసరం వచ్చేదే కాదు, ఒక్క సీటులో మాత్రమే గెలిచేవాడు కాదు, రెండూ గెలిచి ఉండాల్సింది…
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్టయింది… సరే, రాజకీయాలన్నాక ఇలాంటి విమర్శలు తప్పవు గానీ… అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్టీ శ్రేణులు ఎందుకు పట్టించుకోకూడదు…? కొద్దివ్యవధిలోనే పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున వాటి ప్రభావం తప్పకుండా పడుతుంది… అందుకే కదా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్ వైపు తరలిపోతున్నారు.,. క్యాంపు ఖాళీ అయిపోతోంది…
Ads
ఎమ్మెల్యేలలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి చెందింది… 15 రోజుల ముందే ఈ విషయం తెలుసు, కానీ టైమ్ లేకపోవడంతో సిట్టింగు మార్పు సాధ్యం కాలేదు, ఈరోజుకూ ఓడిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తగ్గలేదు అని కూడా కేసీయార్ చెప్పుకొచ్చాడు… కొంత మేరకు మాత్రమే కరెక్టు… సిట్టింగు ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకత ఉందనేది నిజం… దానికి ఆ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత వ్యవహారశైలితోపాటు వాళ్లను ఆయా ఏరియాలకు నయా జమీందార్లను చేసిన కేసీయారే ప్రధాన కారకుడు…
అంతకు ముందు ఎన్నికల్లో తనను చూసి వోటేశారు, ఈసారీ అంతే, అందుకే సిట్టింగులను మార్చాల్సిన పనిలేదు అనుకున్నదే కేసీయార్… టైమ్ లేక మార్చలేకపోవడం కాదు… సిట్టింగులను మారిస్తే వాళ్లు వెళ్లి ప్రత్యర్థులుగా నిలబడతారనే భయసందేహాలతో వెనుకంజ వేయలేదా..? 15 రోజుల ముందే ఓటమి గురించి తెలిసినప్పుడు, సిట్టింగులను మార్చడం ఎంత సేపు..? అంత పెద్ద పార్టీకి సెకండ్ కేడర్ నాయకులు లేరా..? సో, కేసీయార్ ఈరోజుకూ ఏవేవో చెబుతున్నాడు తప్ప సరైన ఆత్మవిమర్శ జోలికి మాత్రం పోవడం లేదు…
పార్టీ ఓటమికి, కేసీయార్ మీద, తన ఫ్యామిలీ మీద జనంలో వ్యతిరేకతకు చాలా కారణాలున్నయ్… కేవలం సిట్టింగుల మీద జనంలో వ్యతిరేకతే పార్టీ ఓటమికి కారణం అనడం అంటే ఓటమిని పూర్తిగా వాళ్ల మీదకు నెట్టేయడం… ఏదో ఓ సాకు తప్ప అది సంపూర్ణ ఆత్మవిమర్శ కాదు, దిద్దుబాటు దిశలో అడుగులూ కావు…
ఇప్పుడు కూడా బీజేపీకి మనకే తేడా అంటున్నాడు… కాంగ్రెస్‌ను పట్టించుకునే పనే లేదంటున్నాడు… ఇదీ ఓరకమైన మైండ్ గేమ్… పాలిటిక్సులో సహజం… కానీ బీజేపీ అతి అంచనాలను కూడా పాతరేసి కదా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది… అప్పుడే బీజేపీ కాంగ్రెస్‌ను దాటేసేంతగా ఎదిగిపోయిందా ఎలా..? ఒకవేళ నిజంగా ఎదిగితే అది కాంగ్రెస్‌తో బలంగా పోటీపడుతుంది గానీ, ఆల్రెడీ ఇప్పట్లో లేవకుండా చతికిలపడిన బీఆర్ఎస్‌తో దానికి ప్రధాన పోటీ ఏమిటి..? హేమిటో దొరవారు, ఏవేమో మాట్లాడేస్తున్నాడు… ఎప్పటిలాగే..!!
Share this Article