.
మామూలుగా కొరివి పెట్టే కొడుకులకన్నా… అన్నీ పంచుకునే మగవారసులకన్నా… తల్లికి గానీ, తండ్రికి గానీ బిడ్డపై మమకారం, ఆపేక్ష ఎక్కువ ఉంటుంది… ఎందుకంటే, మన నెత్తుటి బిడ్డే వేరే వాళ్ల ఇంటికి వెళ్లింది కాబట్టి… మంచికైనా చెడుకైనా పుట్టింటి వైపే చూస్తుంది కాబట్టి, అవసరానికి పరుగెత్తుకొస్తుంది కాబట్టి… మీద పడి ఏడుస్తుంది కాబట్టి…
- ఇదే కదా లోకరీతి… ఎస్, మామూలు కుటుంబాలు వేరు… దొరల గడీలు వేరు, రాజరికాలు వేరు, రాజకీయ కుటుంబాలు వేరు… వారసత్వాలు, ఆస్తులు, అధికారాలు, పెత్తనాలు గట్రా బోలెడు లెక్కలుంటాయి… ఉండొచ్చు, కానీ… ఎండ్ ఆఫ్ ది డే… బిడ్డ బిడ్డే… తండ్రి తండ్రే… తన నెత్తురు… కానీ కేసీయార్ ఈ లెక్కల్లో ఉండడు…
తనకు కోపమొస్తే కారణం ఏదైనా సరే… పరమ అరాచకంగా ఉంటుంది… మామూలు మనుషులు వేరు, 80 వేల పుస్తకాలు చదివిన మహా పరిణతి వేరేమో బహుశా… కనీసం జనం ఏమనుకుంటున్నారనీ ఆలోచించడు తను… అందుకే లోకరీతికి పూర్తి భిన్నంగా ఉంటుంది కేసీయార్ కుటుంబం తీరు…
Ads
లేకపోతే ఏమిటి..? తిరుమల దర్శనానికి వెళ్లి, వీలు గాక, బయటి నుంచే గుడి గోపురానికి దండం పెట్టి చాలామంది భక్తులు వాపస్ వెళ్లిపోతారు… సేమ్, తన సొంత తండ్రి ఇంటికి వెళ్లింది కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత… తల్లి వచ్చి మనమడిని లోపలకు తీసుకుపోయింది, తండ్రి ఆశీస్సులు ఇప్పించడానికి…
కానీ ఆమెకు మాత్రం లోపలకు ప్రవేశం లేదు… అసలు తండ్రి దర్శనానికే చాన్స్ లేదు… అందుకే బయటి నుంచే, బెడ్‌రూం నుంచి కదిలిరాని ఆ తండ్రికి ఓ దండం పెడుతుంది… తరువాత బిడ్డను తీసుకుని అమెరికా వెళ్లిపోతుంది నిశ్శబ్దంగా, కళ్లల్లో నీళ్లు కుక్కుకుంటూ… చాలా భిన్నమైన కుటుంబం… ఫాఫం, కవిత… అంత చేదైపోయిందా..? (సోర్స్ :: ఆంధ్రజ్యోతి)
- లక్ష సమస్యలు ఉండొచ్చు గాక, ఆమె బిడ్డ కాదా, తను తండ్రి కాదా, అంత అమానవీయంగా వ్యవహరించాలా కేసీయార్… ఇలాగే రిసీవ్ చేసుకుంటుంది తెలంగాణ సమాజం… తెలంగాణలోని మెజారిటీ ఇళ్లల్లో తండ్రులు గానీ, సోదరులు గానీ ఆడబిడ్డ కాళ్లు మొక్కుతారు… అది బిడ్డ మీద చూపించే ప్రేమ… ఇక్కడ కేటీయార్ ఆమె ఎక్కడ రాఖీ కడుతుందోనని కావాలని తప్పించుకుని బెంగుళూరుకు వెళ్లిపోతాడు అర్జెంటుగా…
ఏం ద్రోహం చేసింది తను..? తండ్రి చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి అని చెప్పింది… అంతేతప్ప తండ్రిని ధిక్కరించలేదు… ఇప్పటికీ తండ్రే తన లీడర్ అంటోంది… కాళేశ్వరం కమిషన్ తండ్రికి నోటీసులు ఇచ్చినప్పుడు ఇంటికి పరామర్శకు వెళ్తే, కనీసం ఆమెవైపు చూడలేదు, దూరదూరంగా ఉన్నాడు… ఇప్పుడైతే ఏకంగా ఇంట్లోకి నో ఎంట్రీ…
ఏం..? ఆమెకు పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నయ్, ఉంటే తప్పేమిటి..? ఏకంగా కుటుంబం నుంచే బహిష్కరించాలా..? సొంత ఆడబిడ్డనే ప్రేమించని వ్యక్తులు రాష్ట్ర ప్రజల్ని ఏం ప్రేమిస్తారు..? సొసైటీ వేసే ప్రశ్నకు ఆ కుటుంబం నుంచి జవాబు దొరకదు… నచ్చజెప్పాలి, వినలేదా, నో ప్రాబ్లం… రాజకీయాలు వేరు, కుటుంబ బంధం వేరు… ఆ గీతను గౌరవించాలి కదా…
లక్షల కోట్లు ఎలా సంపాదించారనేది అప్రస్తుతం… కానీ ఎంత సంపాదించినా సొంత బిడ్డ కళ్లల్లో నీళ్లు తెప్పించే ధోరణితో ఏం సుఖం..? అలాంటప్పుడు ఎంత సంపాదించి ఏం ఫాయిదా..? ఆమె కొడుకు ఆదిత్య ఈమధ్యే అమెరికాలో గ్రాడ్యుయేషన్ కంప్లిట్ చేసినట్టున్నాడు… ఇప్పుడు మరో కొడుకు ఆర్య అమెరికాకు వెళ్తుంటే తండ్రి ఆశీస్సులు కావాలని ది గ్రేట్ హిస్టారిక్ కేసీయార్ ఫామ్‌హౌజుకు వెళ్లింది ఫాఫం… భంగపాటు…
- ఎవరైనా సరే… ఆయుత చండీయాగాలు చేయనీ, ప్రయుత చండీయాగాలు చేయనీ, అనితర సాధ్యమైన హోమాలు, ప్రత్యేక పూజలు చేయనీ… కామాఖ్యకు వెళ్లి భగాలాముఖి రహస్య బలిపూజలు చేయనీ… ఇంటి ఆడబిడ్డ కళ్లల్లో నీళ్లు దొర్లితే చాలు, ఏ యాగఫలమూ ఫలించదు… వర్తించదు… ఇది సదరు ‘పే-ద్ధ మనిషి’ చుట్టూ ఉన్న పండితులు కూడా చెబుతారు.,.!!
కేసీయార్ ఆలోచన విధానం అంతే… మగవారసత్వం… పితృస్వామ్యం.,. రేప్పొద్దున ఎప్పుడైనా సరే కేసీయార్ వారసుడు హిమాంశ్ అవుతాడే తప్ప… దేవనపల్లి కవిత పిల్లలు ఆదిత్య, ఆర్య ఎప్పుడూ కాలేరు… కానివ్వరు… అది రియాలిటీ..!!
Share this Article