దెబ్బాక, గ్రేటర్ దెబ్బల తరువాత హఠాత్తుగా కేసీయార్లో అంతర్మథనం ప్రారంభమైనట్టు బోలెడు వార్తలు కనిపిస్తున్నయ్… బీజేపీ దూకుడు నిలువరించడానికి లెఫ్ట్, కాంగ్రెస్‌తో దోస్తీ అని ఒక వార్త… రెడ్లను మళ్లీ కాన్ఫిడెన్స్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు అని మరో వార్త… జాతీయ స్థాయిలో బీజేపీతో పోరాటం అని ఇంకో వార్త…. అన్నీ రాజకీయ కోణాలే… కానీ నిజంగా తనను ఓడించింది ఎవరు..? ఎందుకు ఓడించారు..? తనను తప్పుదోవ పట్టించింది ఎవరు..? జనాదరణ ఎక్కడ గాడితప్పింది..? ఈ కోణం అక్కర్లేదా..? అది కదా ఫస్ట్ చక్కదిద్దుకోవాల్సింది…
పార్టీ కేడర్ ఏమంటోంది..? సగటు మనిషి ఏమంటున్నాడు..? ఇది కదా తెలుసుకోవాల్సింది… పైపైన చెప్పుకునేవి కూడా బోలెడు… సిటీలో వరదసాయం… వందల కోట్లు విడుదల చేసి, ఎవరికిపడితే వారికి ఏ సర్వే అక్కర్లేకుండా డబ్బులు పంచేశారు… వోట్లు వస్తాయని…! తరువాత డిసెంబరు 7 నుంచి పంచుతామన్నారు… తీరా వదిలేశారు… సర్వే చేసి ఇస్తాంపో అని వెళ్లగొట్టేస్తున్నారు… సన్నధాన్యం వేయమని చెప్పింది సీఎం… కాస్త ఎక్కువ ధర ఇస్తానన్నీదీ సీఎం… తీరా ఇప్పుడు ఆ రైతును గాలికి వదిలేశాడు… బోలెడు ఇలా…
Ads
నిజంగానే ఎల్ఆర్ఎస్ మీద కేసీయార్ పునరాలోచన చేస్తే, ఈ వార్త నిజమే అయితే… అది పార్టీకి, ప్రభుత్వానికి… తెలంగాణ సమాజానికి మేలు… కేసీయార్ మీద ప్రజల్లో వ్యతిరేకతను పెంచిన కారణాల్లో ఎల్ఆర్ఎస్ ప్రధానమైంది… అది కరోనా వైరస్‌ను మించి జనాన్ని భయపెడుతోంది… ఈ కష్టకాలంలో తమను ముంచేద్దామని చూసిన టీఆర్ఎస్ను జనం ముంచేశారు… అసలు కేసీయార్‌కు ఈ సలహా ఇచ్చిన వారికి ఏ శిక్ష వేయబోతున్నారు..? అసలు కేసీయార్ ఈ ఎల్ఆర్ఎస్, ఆస్తుల సర్వే, ఆగిన రిజిస్ట్రేషన్ల మీద ఒక్కరోజైనా జనాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశాడా..? ప్రస్తుతం జనానికి కావల్సింది ఎల్ఆర్ఎస్ రేట్ల సడలింపులు, రాయితీలు, మినహాయింపులు కాదు… ఈ నష్టకారక స్కీములను మొత్తానికే ఎత్తేయడం…
ధరణి మరో వైఫల్యం… హైకోర్టే చెబుతోంది… మేమేమీ రిజిస్ట్రేషన్లు ఆపాలని చెప్పలేదుగా అని…! పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తే తమకు అభ్యంతరం లేదనీ చెబుతోంది… నిజమే… ధరణి ఒక ఫెయిల్యూర్… ఎంతోకాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించి పదే పదే ఫెయిల్… నిజానికి సిన్సియర్, ఎఫిషియెంట్ గ్రూప్-1 ఆఫీసర్‌కు ఆ బాధ్యత అప్పగించండి… స్వేచ్ఛ ఇవ్వండి… వారం రోజుల్లో సెట్ చేస్తాడు… అది పెద్ద ఖగోళ ప్రాజెక్టు ఏమీ కాదు… కానీ చేసేవాడికి, చేయించేవాడికి ఫోకస్ అవసరం…
ఇప్పుడు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు గనుక ప్రారంభిస్తే మంచిదే… కానీ ఇవన్నీ వార్తలు రాయించడానికే పరిమితం అయితేనే సమస్య… ఆ పనులు జరగకుంటే ఇంకా ఎక్కువ నష్టం… ప్రజల్ని ప్రేమించేవారు ప్రజలకు దూరంగా బతకొద్దు… ప్రజలనే కష్టాల కొలిమిలోకి నెట్టొద్దు… ప్రజలు ఏమనుకుంటున్నారో పాలకుడు తెలుసుకోవాలి, అనుగుణంగా అడుగులు వేయాలి… అది రాజధర్మం… అది పాలనధర్మం… కేసీయార్ చదివిన వేల పుస్తకాల్లో ఈ ధర్మం గురించి లేదా..? ఉండే ఉంటుంది… ఉండే ఉంటుంది…! తనేమీ ఆకాశం నుంచి దిగివచ్చిన ప్రభువేమీ కాదు… అన్నీ తెలుసు… కానీ అన్నీ వదిలేయడమే ప్రస్తుత విషాదం… నట్లు బాగా బిగించగల తెలంగాణ మేస్త్రీ తన రెంచీని ఎక్కడో పారేసుకున్నాడు…!!
Share this Article