నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై సందేహాలు ఉండవచ్చుగానీ, ఆ సంఘటన నిజం… ఆ పోరాటం నిజం… ఆ స్పూర్తి నిజం… దానిపై రసం శ్రీధర్ రాసిన వ్యాసం స్పూర్తిదాయకంగా ఉంది… వెంకయ్యనాయుడు అభినందనల పట్ల ఆశ్చర్యం ఏమీ అక్కర లేదు…
విమోచన దినోత్సవంపై కేసీయార్‌ను ఇరుకునపెడుతున్న బీజేపీ ఈసారి అమిత్ షాను తీసుకొచ్చి నిర్మల్‌లో ఓ సభ ఏర్పాటు చేసింది… అమరుల సంస్మరణ నిర్వహిస్తోంది… అఫ్ కోర్స్, దానికి రాజకీయ లబ్ధి ఆలోచనలు ఉండవచ్చుగాక… కానీ మజ్లిస్ మీద ప్రేమతో అధికార విమోచన దినోత్సవాన్నే తుంగలో తొక్కేసిన కేసీయార్ అండ్ పార్టీకి దీనిపై విమర్శలు చేసే నైతికత కనిపించదు… సరే, ఆ చర్చలోకి ఎందుకులే గానీ… అసలు శ్రీధర్ ఏం రాశాడు..? అసలు ఆ రాంజీ కథేమిటి..? ఓసారి చదువుదాం…
Ads
చరిత్రకు చెద.. వీరుల వ్యథ………… దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనే ఎక్కడా.. ఇలాంటి ఘటన జరగలేదు. జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యి మందికి పైగా కాల్చి చంపిన జలియన్‌వాలా బాగ్ ఘటన కంటే యాభయేళ్ల ముందే ఇది జరిగింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వెయ్యిమంది.. ఒకేసారి తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేశారు. తమను కన్న భూతల్లి కోసం ఆ గిరిబిడ్డలు వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయ, నైజాం సైన్యాలను ముప్పతిప్పలు పెట్టి, నిర్మల్ గొలుసుకట్టు చెరువుల నీళ్లను తాగించారు. శత్రువులు కుయుక్తులతో చుట్టుముట్టి.. తమ కుత్తుకలకు ఉరితాళ్లు బిగిస్తున్నా పూలమాలల్లా భావించారు. తమ మోములపై చెదరని చిరునవ్వులతో చావును ఆహ్వానిస్తూ.. శత్రువు గుండెల్లో దడ పుట్టించారు. నేలపైకి ఊడలు దిగిన మర్రిచెట్టుకు వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీసిన ఆ ఘటన దేశచరిత్రలోనే ఎక్కడా జరగలేదు.. మన నిర్మల్‌లో తప్ప. కానీ.. నాడు స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల గాధ ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. పరాయి పాలన పారదోలేందుకు ప్రాణాలర్పించిన ఆ వీరులను నేటి పాలకులు కనీసం గుర్తించడం లేదు. జిల్లా అధికారులకూ అమరులగాధపై కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ విమోచనదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
కొయ్యబొమ్మలే కాదు.. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నిర్మల్ అంటే.. కేవలం కొయ్యబొమ్మలు, కోటబురుజులు మాత్రమే కాదు. వాటిని మించిన సాహసోపేతమైన వీరుల చరితకు.. వారి అసమాన త్యాగాలకు సజీవసాక్ష్యం. ఆంగ్లేయ అధికారులు, హైదరాబాద్ నవాబులను ఏకకాలంలో ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఇక్కడి వీరులది. తమవద్ద అధునాతన ఆయుధాలు లేకున్నా.. శక్తియుక్తులతో శత్రువులకు చుక్కలు చూపించిన ధీరుల గడ్డ ఇది. వెన్ను చూపకుండా పోరాడుతున్న అలాంటి వీరులపై వెనుక నుంచి శత్రువులు దొంగదెబ్బ తీశారు. విల్లులు, బల్లెలలతోనే తమపై పోరాడిన వారందరినీ సామూహికంగా ఉరితీసి తమ క్రూరత్వాన్ని చాటారు. నాడు అమరులైన వెయ్యిమంది వీరుల ప్రాణత్యాగం తర్వాతి కాలంలో ఎందరో సమరయోధులను తయారు చేసింది. చరిత్రకెక్కని ధీరుడు.. రాంజీ గోండు……
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు గోండు రాజుల ఖిల్లా. పచ్చని అడవులు పర్చుకున్న ఈ ప్రాంతానికి 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్న ఘనత ఉంది. ఉత్తర భారతదేశంలో మొదలైన ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా ఇక్కడి వీరులు పోరుసల్పారు. ఈక్రమంలో 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీ గోండు. గోండు రాజుల వంశానికి చెందిన రాంజీ తొలి స్వాతంత్య్ర పోరాటాన్ని మన ప్రాంతంలో కొనసాగించాలని పిలుపునిచ్చాడు. చెల్లాచెదురుగా ఉన్న తన వాళ్లందరినీ ఏకం చేశాడు. దేశమంతా విస్తరిస్తున్న ఆంగ్లేయులను, స్థానికంగా దోచుకుంటున్న హైదరాబాద్ నవాబులను ఏకకాలంలో ఎదుర్కొవాలని సమరశంఖం పూరించాడు. ఇందుకు గోదావరి తీరంలో.. చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. వీటిని కేంద్రంగా చేసుకుని నెలల తరబడి పోరు సాగించారు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం, ఆంగ్లేయ బలగాలు గోండులపై దాడులకు పాల్పడ్డాయి. వాళ్లనూ గిరిబిడ్డలు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఎంతటి బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలూ ఉన్నా కొరకరాని కొయ్యగా రాంజీ గోండు శత్రువులను ముప్పతిప్పలు పెట్టారు. కొండలు, గుట్టలు, అడవులను ఆసరాగా చేసుకుంటూ గెరిల్లా తరహా పోరాటాలు చేశారు. చివరకు దొంగదెబ్బతో శత్రువులు వీరిని పట్టుకున్నారు. నిర్మల్ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలో గల మహా మర్రిచెట్టుకు రాంజీ గోండుతో పాటు వెయ్యిమంది వీరులను ఉరితీశారు.
ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీ గోండు, మిగతా వీరుల చరిత్ర కనీసం బయటకు రాలేదు. పాఠ్యపుస్తకాలకూ ఎక్కలేదు. స్మారకాలే మిగిలినై.. వెయ్యి మంది వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహా మర్రిచెట్టుకు వెయ్యి ఉరుల మర్రిగా పేరొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఆ మర్రి చెట్టు గాలివానకు నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత పలు సంఘాల నాయకులు 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు. 2008 నవంబర్ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్నా.. నేటితరం స్థానికుల్లోనే చాలామంది ఇది తెలియకపోవడం శోచనీయం. చైన్‌గేట్ వద్ద అనాథగా.. ఏ పట్టింపులేకుండా.. తాగుబోతులకు అడ్డగా మారిన రాంజీ విగ్రహాన్ని చూసి.. ‘ఈయనెవరూ..’ అని జిల్లాకేంద్రానికి చెందిన యువకులే అడుగుతున్నారంటే.. ఇక్కడి దౌర్భాగ్యం ఎంటో అర్థం చేసుకోవచ్చు.
అన్నీ తెలిసి కూడా స్థానిక పాలకులు కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరం. రాష్ట్ర మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామమైన ఎల్లపెల్లి దారిలోనే వెయ్యి ఉరుల మర్రి స్థూపం ఉంటుంది. జిల్లా కేంద్రం నడిబొడ్డునే రాంజీ గోండు విగ్రహం ఉంది. ఈ రెండూ నిండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పట్టపగలే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. నిర్మల్ సమీపంలో రాంజీ గోండు పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని నాలుగేళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇంకెన్నాళ్లకు.. నాటి వీరుల గాథలు, వారి అసమాన ప్రాణత్యాగాల గురించి పట్టించుకునే తీరిక పాలకులకు లేకున్నా.. కనీసం జిల్లా అధికారులూ దష్టి పెట్టడం లేదు. చాలామంది జిల్లా అధికారులకు వెయ్యి మంది వీరుల పోరాటం గురించి అవగాహన కూడా లేదు. కనీసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమరులకు స్థానం కల్పించలేదు. ఏళ్లు గడుస్తుంటే.. ఘనమైన చరిత్రకు చెదలు పడుతుంటే.. ఇంకెన్నాళ్లకు స్పందిస్తారన్న ప్రశ్నలు మాత్రం జిల్లావాసుల నుంచి వస్తూనే ఉన్నాయి…!!
Share this Article