సరే, సరే… నువ్వన్నట్టే కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అనుకుందాం కాసేపు… నీ నాలుగు రోజుల ఆనందాన్ని ఎందుకు కాదనాలి..? బీజేపీకి 200 సీట్లు కూడా రావు… సరే, అలాగే కానివ్వు… అదేమీ ప్రాంతీయ, కుల, కుటుంబ పార్టీ ఏమీ కాదు కదా దుకాణం మూసేసుకోవడానికి..? రెండు సీట్ల దగ్గర కూడా షట్ డౌన్ కాలేదు, దాన్నలా కాసేపు వదిలేద్దాం…
తెలంగాణ కోసం ఉధృతంగా పోరాడిన నిష్కళంక యోధుడు, నిజాయితీ వ్యాపారి, నిఖార్సయిన మనిషి నామా నాగేశ్వరరావుకు కేంద్రంలో మంత్రి పదవి కూడా వస్తుందే అనుకుందాం… సరే సార్, అలాగే అనుకుందాం… అనుకోవడానికి దరిద్రం దేనికి..?
బీజేపీకి 200 సీట్లు కూడా రావు సరే, మరయితే సంకీర్ణ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది..? సరే, ఇండి కూటమికి మెజారిటీ వచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందనుకుందాం… సపోజ్, రాహుల్ గాంధీని పక్కకు నెట్టేసి, మల్లిఖార్జున ఖర్గేను మరో మన్మోహన్‌సింగ్‌లాగా కుర్చీ ఎక్కిస్తారనే అనుకుందాం… ఆ సంకీర్ణంలో ఎవరుంటారు..? ఆల్రెడీ ఇండి కూటమిలో భాగస్వాములైన 36 పార్టీలు ఉంటయ్…
Ads
ఆప్, లెఫ్ట్, డీఎంకే, ఎస్పీ, ఆర్ఎస్పీ, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలుంటయ్… సరే, మమతా బెనర్జీ టీఎంసీ కూడా కలుస్తుందనే అనుకుందాం… వాటిల్లో కాస్తోకూస్తో సీట్లు సంపాదించే పార్టీలు డీఎంకే, టీఎంసీ మాత్రమే కదా… ఇంకెవరున్నారు..? ఐనాసరే, పొత్తు ధర్మంలో అందరికీ న్యాయం చేస్తారనుకుందాం… కానీ అందులో నువ్వు లేవు కదా… అంటే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ లేదు కదా… వాళ్లెప్పుడో దూరం పెట్టారు కదా…
పైగా నీ ప్రసంగాల్లోనే కాంగ్రెస్ దద్దమ్మలు మన్నూమశానం అని ఏవేవో అంటున్నావు కదా… రేవంత్ రెడ్డి దొంగ, లంగ అంటున్నావు కదా… ఒకవేళ కాంగ్రెస్ సంకీర్ణం కుర్చీ ఎక్కినా సరే, నువ్వు దాని జోలికి పోవద్దు కదా, పోయే నైతికత లేదు కదా… రాజకీయాల్లో అవేమీ ఉండవు అనుకున్నా సరే, కాంగ్రెస్ చేరదీయదు కదా…
మరో 38 పార్టీలున్న ఎన్డీయే అసలు దగ్గరకే రానివ్వదు కదా… మరి ఏ సంకీర్ణంలో చేరతావు..? మీ నామాకు మంత్రి పదవి ఎవరిస్తారు..? సరే, నీకు 12, 13 కాదు, 16 వచ్చాయనుకుందాం… అకస్మాత్తుగా తెలంగాణ వోటర్లలో ఆత్మప్రబోధం, ఆత్మచైతన్యం తెగపెరిగి కారు గుర్తు మీద ఎడాపెడా గుద్దారనే అనుకుందాం… నీకు తోడు ఎవరిక..? బీజేడీ ఏమాత్రం దగ్గరకు రానివ్వదు… మిగిలింది నీ జాన్ జిగ్రీ వైసీపీ…
తనకు ఎన్ని వస్తాయి..? మీ ఇద్దరికితోడు ఆ రెండు కూటముల్లో లేని ముఖ్యమైన పార్టీలు బీఎస్పీ, బీజేడీ, ఎంఐఎం, అకాలీదళ్… బీఎస్పీ నీతో ఒక్క సీటు పొత్తుకూ నిరాకరించింది కదా, ప్రవీణ్ ప్రయత్నాలూ ఫెయిల్ కదా… ఇక లింగూలిటుకూ అంటూ జగన్, నువ్వు… అంతేనా..? ఒక్క సీటు ఒవైసీ… మెడపై కత్తికి భయపడి, ఎందుకొచ్చిన తంటా అనుకుని జగన్ సైలెంటే… కాంగ్రెస్ రానివ్వదు, బీజేపీలో చేరడు… దూరం జరగడు… ఒవైసీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడు… డబ్బులిచ్చి పోసించిన జేడీఎస్ కూడా ఎన్డీయేలోనే చేరింది… అంటే ఇక మిగిలింది శొంఠికాయ ఒంటిలింగం… అనగా తమరొక్కరే…
మరిక సంకీర్ణం ఎక్కడిది దొరవారూ..? అపారమైన సాధనసంపత్తి ఉంది కదా, ఎడాపెడా పార్టీలను కొనేద్దాం అనుకున్నా సరే, కుర్చీ దక్కే చాన్సులు ఉంటేనే ఎవరైనా దగ్గరకొచ్చి అలుముకుంటారు, లేదంటే ఆమడల దూరంలోకి పారిపోతారు… పైగా కొనేయడం మొదలెడితే బీజేపీకన్నా ఎవరూ ఎక్కువ కొనలేరు… బొచ్చెడు డబ్బుంది… మరిక సంకీర్ణం ఏమిటో, గోకర్ణం ఏమిటో నీకే తెలియాలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారూ..!? తెలంగాణ ప్రజానీకం అమాయకులే కానీ మరీ ఈ డొల్ల మాటలు నమ్మే స్థితిలోనే ఉన్నారంటావా ఇంకా..!!
Share this Article