‘‘తూచ్, ఈ దసరాకు కేసీయార్ జాతీయ రాజకీయాల ఎంట్రీ, కొత్త పార్టీ ఏర్పాటు ఉండకపోవచ్చు… బహుశా మరో రెండు నెలలు జాప్యం తప్పదు… ఢిల్లీ మద్యం స్కాం తలనొప్పి, ఈడీ-సీబీఐ యాక్టివ్ కదలికలతో పార్టీలో ఓరకమైన ఆందోళన కనిపిస్తోంది’’…. ఇది ఒక వార్త… ‘‘పీకే మీద కేసీయార్‌కు వైరాగ్యం వచ్చేసింది, లైట్ తీసుకున్నాడు, దాంతో ఆ పీకే టీం హైదరాబాద్ దుకాణం మూసేసింది, ఏపీకి తరలిపోయింది’’…. ఇది ఇంకో వార్త…
ఈ రెండు వార్తల్ని ఓసారి కేసీయార్ దృష్టికి తీసుకుపోయి, అడిగి చూడండి చేతనైతే… ‘‘మీ తీటకొద్దీ మీరు ఏదేదో రాసుకుని, నన్ను అడుగుతారేందివయా…’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు… ఎస్… అంతన్నాడు ఇంతన్నాడు అన్నట్టుగా… అదుగో పీకే, ఇదుగో పీకే టీం… అదుగదుగో సర్వేలు, వాటిని బట్టే టికెట్లు, రిజల్ట్ బాగాలేకపోతే కటింగులు అన్నట్టుగా ప్రచారం జరిగింది… నాకు ఎప్పట్నుంచో పీకే మంచి దోస్తు, పుణ్యానికే నాకు సర్వీస్ చేస్తున్నాడు అని కేసీయార్ కూడా చెప్పుకున్నాడు…
పీకే కూడా ఏవేవో ప్రాజెక్టులు సందర్శించాడు, ప్రగతి భవన్‌లో కనిపించేవాడు… ఎటుచూసినా తన చర్చే… అప్పుడే ‘ముచ్చట’ చెప్పింది, ఇంత సీన్ ఎవరికీ ఇవ్వడు కేసీయార్… సో, ఇది జల్దీ ఇచ్చుకుపోయే బంధమే అని అంచనా వేసింది… అదే జరిగింది… పీకేకు ఇప్పుడు కేసీయార్ టైం కూడా ఇవ్వడం లేదు… పీకేకు కేసీయార్ అంటే ఏమిటో తెలిసొచ్చింది… హైదరాబాద్‌లో అన్నీ మూసుకుని ఆయన టీం ఏపీకి తరలిపోయింది… జగన్ కోసం ఆయన టీం పనిచేస్తోంది… (సో, పీకే పదే పదే ప్రయత్నించే విస్తృత యాంటీ-బీజేపీ వేదికలో కేసీయార్ లేడనేది క్లియర్…)
Ads
ఈ ప్రకాష్‌రాజ్‌లు, ఈ పీకేలు, ఈ రాకేష్ టికాయిట్లు… వస్తుంటారు, పోతుంటారు… దీనికి పెద్దగా మీడియా హడావుడి పడిపోయి, కిందామీదా పడిపోయి, అదుగో కుమారస్వామి వచ్చాడు, ఇంకేముంది..? ఢిల్లీలో గాయిగత్తరే, అగ్గిపెట్టుడే అన్నట్టుగా ప్రత్యేక కథనాలు రాసి, ఓ శుష్క-కృత్రిమ హైప్ క్రియేట్ చేయడం… జాతీయ పార్టీ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయరు… ఎవరు పార్టీ పెట్టినా ఒకే ప్రొసీజర్… జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే మాత్రం కొన్ని లెక్కలుంటయ్… అదంత వీజీ కాదు, రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అని సృష్టించేది కూడా కాదు… ఐనా మన మీడియా డప్పులకు లాజిక్కులు ఏముంటాయిలే…
దసరాకు ముహూర్తం, ఇదీ పేరు, అదుగో జెండా, ఇదుగో ఎజెండా… ఇక మోడీకి వణుకే… అమిత్ షాకు బెణుకే అన్నట్టుగా బోలెడు వార్తలు… ఓ ప్రాంతీయ పార్టీ నేత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఎవరూ వద్దనరు… కానీ జాతీయ రాజకీయాలంటూ ప్రత్యేకంగా ఉండవు… దానికి వేరే పార్టీ అక్కర్లేదు… పార్టీ పెడతావు సరే, కానీ వేరే రాష్ట్రాలలో ప్రజలు, నాయకులు నీ కొత్త పార్టీలో ఎందుకు చేరాలి..? ఈ ప్రశ్నకు జవాబు లేదు… కేసీయార్ గత లోకసభ ఎన్నికల నుంచీ చెబుతూనే ఉన్నాడు, వస్తా, వచ్చేస్తా అని… ఏమైంది..? నిప్పుల మీద కాస్త ఊదు వేయగానే పొగ గుప్పుమని లేస్తుంది… అంతేనా, కాదా…
మీడియా తెరల మీద, పేజీల్లో చూపించినంత ఈజీ కాదు జాతీయ రాజకీయాలు అంటే… చాలా లెక్కలుంటయ్, చిక్కులుంటయ్… సరే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకు గానీ… మీడియా కేసీయార్ నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీకి దీపావళికి కొత్త ముహూర్తం పెట్టేసుకుంటే బెటర్… నార్త్ ఇండియాలో దివాలీ మూరత్ అన్నింటికన్నా బ్రహ్మాండమైన ముహూర్తం… ఈలోపు ఈ పీకేలు, ఈ టికాయిట్ల స్థానంలో ఇంకో కేరక్టర్‌ను వెతుకుదాం…!!
Share this Article