‘‘ప్రాంతీయ పార్టీలు పెట్టడం, నడిపించడం కష్టం… దేవేందర్ గౌడ్, విజయశాంతి, నరేంద్ర తదితరులు పార్టీలు పెట్టారు, మట్టిలో కలిసిపోయాయి’’ అని మొన్న టీఆర్ఎస్ కార్యవర్గ భేటీలో కేసీయార్ వ్యాఖ్యలు చేశాడు… అకారణంగా, అసందర్భంగా ఏమీ మాట్లాడడు కేసీయార్… ఒక సీఎం స్థానంలో ఉన్న నాయకుడు చేసే ప్రతి వ్యాఖ్య వెనుక ఓ పరమార్థం, ఓ ఉద్దేశం ఉంటుంది… అయితే తను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు..? ఆ భేటీకి వచ్చిన నాయకులకే అంతుచిక్కలేదు… అసలు ఎవరి గురించి..? ఇదీ చర్చ… తెలంగాణలో ఏ కొత్త ప్రాంతీయ పార్టీ వస్తుందని కేసీయార్ ఈ వ్యాఖ్యలు చేశాడు..? నిజానికి నరేంద్ర, విజయశాంతి ప్రాంతీయ పార్టీల్ని విలీనం చేసుకున్నదే తను… మరి ఏం చెప్పాలనుకున్నాడు ప్రజలకు.,.? అస్పష్టం… అసలు కొత్త ప్రాంతీయ పార్టీల గురించి తన పార్టీ విస్తృత కార్యవర్గ భేటీలో ప్రస్తావించాల్సిన సందర్భం ఎందుకొచ్చింది..? ఎమ్మేల్యేలే సుప్రీం, మళ్లీ వాళ్లకే టికెట్లు అని హామీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది..?
ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు అనే డౌటొచ్చిందా..? టీఆర్ఎస్ పట్ల కొందరు ఎమ్మెల్యేలు అవిశ్వాసం పెంచుకుని, బయటపడే మూడ్‌లో ఉన్నారా..? కేటీయార్ వారసత్వాన్ని వాళ్లు ఇష్టపడటం లేదా..? అందుకే కేసీయార్ యూటర్న్ తీసుకుని, కేటీయార్ సీఎం అనే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాడా..? అయితే ఏ ప్రాంతీయ పార్టీ గురించి కేసీయార్ సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు..? తన అంతరంగం ఏమిటో తన ఆంతరంగికులకే అర్థం కావడం లేదు, నిజానికి కేసీయార్‌కు ఆంతరంగికులు అంటూ ఎవరూ ఉండరు… తనకుతానే పెద్ద కోటరీ… ఆ పరిసరాల్లోకి ఎవర్నీ రానివ్వడు… అప్పుడప్పుడూ అలా ఝలక్కులు ఇస్తుంటాడు, ఫీడ్ బ్యాక్ ఏమొస్తుందో చూస్తూ ఉంటాడు… మరి ఇప్పుడు తన ఆలోచనల్లో ఉన్న ఆ ప్రాంతీయ పార్టీ ఏది..? ఒకప్పుడు తనే టీఆర్ఎస్ నడపలేక ఇబ్బందిపడ్డాడు, చివరకు కాంగ్రెస్‌లో విలీనానికీ సిద్ధపడ్డాడు… లక్కీగా నాలుగు సీట్లు ఎక్కువొచ్చి కుర్చీ ఎక్కాడు… మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి..?
Ads
- వైఎస్ షర్మిల పార్టీ… పైకి చెబుతున్న ప్రచారం ఏమున్నా, ఆమె ప్రాంతీయ పార్టీ అనేది ఒక ఎత్తుగడ ప్రకారం, ఓ వింత ప్రచారంతో తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది… అకస్మాత్తుగా తెలంగాణలో రాజన్నరాజ్యం ఏమిటి..? తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ పేరుతో ఆమె ఏం సాధించదలుచుకుంది..? తన వెనుక ఉన్నది నిజానికి ఎవరు..? బీజేపీ ప్లాన్ ఏమిటి..? ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం… కేసీయార్ మీద వ్యతిరేకత పెరుగుతున్న దశలో ఆమె వెంట నడిచేది ఎవరు..? ఇవన్నీ ప్రశ్నలు… షర్మిల ప్రతి అడుగు యాంటీ-కేసీయార్… అది క్లియర్… కేసీయార్ తాజా వ్యాఖ్యలు ఆమె పార్టీ గురించేనా..? అదేదో సూటిగా ఎందుకు చెప్పడం లేదు తను..? పెద్ద మిస్టరీ… ఢిల్లీలో బీజేపీ పెద్దలకు కేసీయార్ చెప్పేది వేరు, తెలంగాణలో ఆచరణ వేరు, అందుకే కేసీయార్‌ను ఏమాత్రం నమ్మకుండా బీజేపీ తను పొగ పెట్టే ప్రయత్నాల్లో పడిందా..? కాలం చెబుతుంది… ప్రస్తుతానికి షర్మిలకు వ్యతిరేకంగా సాగే తమ ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్రచారాన్ని కేటీయార్ క్యాంపు హఠాత్తుగా ఆపేసింది… చాలా పోస్టులు అకస్మాత్తుగా డిలిట్ అయిపోయాయి… ఒక్కరూ కిక్కుమనడం లేదు… షర్మిల కొత్త పార్టీ వెనుక ఏదో భారీ వ్యూహమే దాగుంది… ఏమిటది..?
- కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ పంటికింద రాయి… ఎక్కడికక్కడ తనను కేసీయార్ కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు… కేటీయార్ సీఎం అన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఈటలను ముందుబెట్టి, తనకెందుకు చాన్స్ ఇవ్వొద్దు అని మొదలు పెట్టారు… టీఆర్ఎస్ ఏమైనా కుటుంబ సొత్తా..? ఈటల ఎందుకు సీఎం కావొద్దు అనేది ఆ ప్రశ్న… ఈటల సొంత పార్టీ పెట్టబోతున్నాడు అనే ప్రచారమూ ఉంది… తను ఖండిస్తున్నాడు… కానీ రాజకీయ పరిస్థితులు ఇంకా విషమిస్తే ఈటల సొంత పార్టీకి వెనుకాడబోడు అనే ప్రచారం ఉండనే ఉంది… దాన్ని కౌంటర్ చేయడానికే కేసీయార్ ఈ వ్యాఖ్యలు చేశాడా..?
- పీసీసీలో గనుక మంచి రోల్, పోస్ట్ దొరక్కపోతే రేవంతుడు కొత్త పార్టీ పెట్టుకోవడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నాడు… పోతేపోనీ, మంచిదేగా అని పార్టీ సీనియర్లు కూడా తలా ఓ ఎదురుబాణం వేస్తున్నారు… కేసీయార్‌కు హార్డ్ కోర్ ప్రత్యర్థి… పైగా రెడ్డి… తను ఎంతోకొంత ఇబ్బందికరం అవుతాడని కేసీయార్ భావిస్తున్నాడా..? నిజంగా రేవంత్‌కు అంత సీన్ ఉందా..?
- రోజులన్నీ ఒకేరకంగా ఉండవ్… కాంగ్రెస్‌ను తొక్కీ తొక్కీ నారతీస్తే, పరిస్థితులు వేరే వైపు దారితీస్తున్నయ్… సో.., జనానికి కావల్సింది సుపరిపాలన… దుబ్బాక, గ్రేటర్ చేదు అనుభవాల తరువాత తను దిద్దుబాటు చర్యల్లో పడ్డాడు కానీ వర్కవుట్ అవుతున్నట్టు లేదు… పైగా కేసీయార్ ఎమ్మెల్యేల సంగతేమిటో ఆయా నియోజకవర్గాల ప్రజలకు తెలుసు, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ పనిచేసే సీన్ లేదిప్పుడు…
- టీజేఎస్ కోదండరాం ఫ్లాప్… ఒకటీ అరా చిన్నచిన్న ప్రాంతీయ పార్టీల పేర్లే జనానికి తెలియదు… ఈ స్థితిలో కేసీయార్ పర్టిక్యులర్‌గా ప్రాంతీయ పార్టీలు శుద్ధ దండుగ అనే కామెంట్లు ఎందుకు చేశాడు..? తన పార్టీలోనే, తన కుటుంబానికి చెందిన వ్యక్తే వేరే ప్రాంతీయ పార్టీ పెడతాడనీ, బీజేపీ పెట్టించబోతుందనీ కేసీయార్ సందేహిస్తున్నాడా..? ఎవరు ఆయన..? ప్రస్తుతానికి అన్నీ సస్పెన్స్… కాలం అన్ని తెరలనూ తొలగించి, అసలు నిజాల్ని ఆవిష్కరించకపోదు…!!
Share this Article