ముఖ్యమంత్రి కేసీయార్ తన సొంత స్థానం ఒక్క గజ్వెల్ నుంచే గాకుండా కామారెడ్డిలో కూడా పోటీచేస్తున్నాడు… ఎందుకు..? రాజకీయ కారణాలున్నాయా..? లేక గజ్వెల్‌లో పరిస్థితి బాగా లేదానేది వేరే చర్చ… కానీ కామారెడ్డిలో గెలుస్తాడా..? అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? ఒకవేళ తను ఓడిపోతే ఆ జెయింట్ కిల్లర్ ఎవరు అవుతారు..?
ఈ చర్చ జోరుగా సాగుతోంది… తెలంగాణ దృష్టి మాత్రమే కాదు, దేశమే ఈ స్థానం వైపు చూస్తోంది… హైదరాబాద్ కేంద్రంగా ఈ స్థానంలో గెలుపోటముల మీద జోరుగా బెట్టింగ్ కూడా నడుస్తోంది… కేసీయార్ ఓడిపోతాడని కొందరు, గెలుస్తాడని మరికొందరు… నిజానికి అక్కడ ఎలా ఉంది..? జర్నలిస్టులు, అధికారులు, కార్యకర్తలు కాదు, సగటు ప్రజానీకం ఏమంటోంది..? ఇదీ ఇంట్రస్టింగు…
స్థూలంగా చూస్తే కేసీయారే స్వయంగా నిలబడితే ఇక ఓటమి ఎక్కడిది..? నల్లేరు మీద నడక… కేక్ వాక్… అలవోకగా గెలుస్తాడు అనిపిస్తుంది… కానీ ఫీల్డ్ సమాచారం భిన్నంగా వస్తోంది… ఆశ్చర్యం కూడా కలుగుతోంది… కేసీయార్ ముక్కోణ పోటీలో ఎదురీదుతున్నాడు ఇప్పుడు… ఏమో, పోలింగ్ నాటికి పోల్ మేనేజ్‌మెంట్ బలంగా పనిచేసి సీన్ ఎటువైపు టర్నవుతుందో చెప్పలేం, కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం బీఆర్ఎస్‌కు పెద్ద అనుకూలంగా లేదు…
Ads
ఇక్కడ కేసీయార్ ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి… ఒకవేళ ఇప్పుడున్న స్థితి ఇలాగే కొనసాగి, ఒకవేళ రేవంత్‌రెడ్డి నాన్ లోకల్ అనే ఫీలింగ్ పనిచేస్తే బీజేపీకి చాన్స్… ఆ అభ్యర్థికి మంచి పేరే ఉంది… తన ఇండివిడ్యుయల్ మేనిఫెస్టో గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కూడా…
ఈ పరిస్థితి ఏమిటో కేసీయార్ క్యాంపుకు కూడా అర్థమైంది… అందుకే గతంలో ఎన్నడూ లేనంత కాన్సంట్సేషన్ ఆరంభమైంది… ఇప్పటికే రెండుమూడుసార్లు మీటింగులు జరిగాయి, ప్రగతిభవన్‌కు పిలిపించి ముఖ్య కార్యకర్తలతో భేటీలు జరిగాయి… అప్పుడెప్పుడో ఎన్టీయార్ ఏదో మీటింగు పెట్టాడట, పెద్దమల్లారెడ్డి మేజర్ గ్రామ పంచాయతీలో… ఈరోజు అక్కడ కేటీయార్ మీటింగు ఉంది… అక్కడి నుంచి మూణ్నాలుగు పల్లెటూళ్ల మీదుగా బైక్ ర్యాలీ… కొత్త మండల కేంద్రం బీబీపేటలో కూడా ఓ మీటింగు…
ఇంతకుముందు వోటరు గుంభనంగా ఉండేవాడు… కానీ ఇప్పుడు బయటపడుతున్నారు… ఐతే కేసీయార్ చాణక్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు… ఇంకా దాదాపు పది రోజులుంది… తనవైపుకు తిప్పుకుంటాడా, ఐతే ఎలా అనేది ఆసక్తికరం… రేవంత్‌రెడ్డి కోసం కొందరు ఎన్ఆర్ఐలు సహా, తన సోదరుడు సహా చాలామంది తన బంధువులు నియోజకవర్గంలోనే తిష్టవేశారు… చిన్న చిన్న మీటింగులు, సర్దుబాట్లు వేగంగా సాగిపోతున్నయ్… రేవంత్, వెంకట రమణ రెడ్డిల నడుమ నెలకొన్న టఫ్ ఫైట్ చివరకు ఎటు, ఎవరి వైపు దారితీసి, విజయమాల ఎవరి మెడలో పడుతుందో…!!
Share this Article