హమ్మయ్య… కర్నాటక బరిలో దిగడానికి ధైర్యం చేయలేకపోయినా సరే… బీఆర్ఎస్ ఓ జాతీయ పార్టీ… కానీ గతంలో ఒకటీరెండు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేల సమయంలో అసలు కేసీయార్ పేరే వినిపించేది కాదు, కనీసం జాబితాలో తనను ఓ ప్రధాని అభ్యర్థిగానే కాదు, కనీసం ఓ జాతీయ నాయకుడిగా కూడా గుర్తించలేదు… థాంక్స్ టు టైమ్స్ నవ్… ఈ చానెల్ సర్వేలో కేసీయార్ పేరును కూడా ‘సర్వే చేయబడే పేర్ల’ జాబితాలోకి తీసుకున్నారు…
పోతే పోనీ… మరీ తక్కువ శాతం ఆదరణ కనిపిస్తున్నా సరే… అసలు ప్రధాని అభ్యర్థిత్వపు పోటీలో ఉండటమే గ్రేట్ కదా… ఢిల్లీలో గాయిగత్తర లేపడానికి ఏళ్లుగా విఫలప్రయత్నం చేస్తున్న మనిషికి ఇది ఎంత నైతిక బూస్టప్…? జాతీయ పార్టీ అంటాడు, కర్నాటకలో పోటీ చేయడట… ఇదెలా అని అమాయకంగా అడగకండి… కేసీయార్ లోకసభ ఎన్నికల్లో తన సత్తా చూపిస్తాడు, చూస్తుండండి… ఆఫ్టరాల్, ఆ అసెంబ్లీ పోటీలు మాకెందుకు..? డబ్బులిచ్చి పోషిస్తున్న జేడీఎస్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్‌తో తెగతెంపులు అంటోందని వార్తలొస్తున్నాయి కదా అంటారా..? పోనివ్వండి, చిన్న పార్టీ, చిల్లర పార్టీ…
అవునూ, గతంలో కేసీయార్‌ను ఓ జాతీయ నాయకుడిగా గుర్తించని జాతీయ మీడియా ఏకంగా ప్రధాని అభ్యర్థిత్వపు జాబితాలోకి తీసుకున్నది ఎలా..? రాజదీప్ సర్దేశాయ్ ఎక్కడో అన్నాడు కదా, మొత్తం ప్రతిపక్ష కూటమికి ప్రచారవ్యయం భరించడానికి కేసీయార్ రెడీగా ఉన్నాడు అని… బహుశా ఆ ప్రభావంతోనే జాతీయ మీడియా కేసీయార్‌ను గుర్తించినట్టుంది… వావ్… అలా కలిసొచ్చిందన్నమాట…
Ads
కానీ ఏమాటకామాట… ఎవరికి ఎన్ని లోకసభ సీట్లు వస్తాయనే అంశంలో… బీజేపీకి ఫుల్ మెజారిటీ సీట్లు వస్తాయనే అంశాన్ని పక్కన పెడితే… కాంగ్రెస్ 106 నుంచి 144, మమతకు 20 నుంచి 22, బీజేడీకి 11 నుంచి 13, జగన్‌కు 24 నుంచి 25 మధ్యలో సీట్లు వస్తాయంటోంది ఈ సర్వే… కారు, సారు, పదహారు అని ఎంత నినదించినా సరే, బీఆర్ఎస్‌కు ఆ బీజేడీ స్థాయిలో 11 కూడా రావన్నమాట..? 50 నుంచి 89 సీట్లు గెలిచే పలు పార్టీల జాబితాలో ఎక్కడో ఉందన్నమాట..!
ఒక్కటి మాత్రం నిజం… మోడీ మళ్లీ మెజారిటీ సీట్లు తెచ్చి పెడతాడనే అంశం కరెక్టా కాదా తరువాత సంగతి… కానీ స్టిల్ 28.7 శాతం వోట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి… నాయకత్వ రాహిత్యం ఉండవచ్చుగాక, రాహుల్ గాంధీ ఆ పార్టీకి దిక్కుగా ఉన్నంతకాలం బీజేపీకి ఎదురులేకపోవచ్చుగాక… కానీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే… సో, కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి, అనగా థర్డ్ ఫ్రంట్ సాధించేది శూన్యం అనీ, అది బీజేపీకే మేలు చేస్తుందనీ అర్థమవుతోంది…
సరే, ప్రధాని అభ్యర్థిత్వాల సంగతికొద్దాం… సహజంగానే మోడీ పాపులారిటీ కోణంలో తనకు 64 శాతం మంది మద్దతు వస్తుందనేది నమ్మబుల్ అనుకుందాం… కానీ రాహుల్ గాంధీకి మరీ 13 శాతం మంది మాత్రమే జై అంటున్నారు… అంటే క్లియర్‌గా అర్థమవుతున్నది ఏమిటంటే… కాంగ్రెస్‌కు మంచి వోటు బ్యాంక్ ఉంది, కానీ రాహుల్‌కు ఆదరణ లేదు అని…! కానీ ఆ కుటుంబ చట్రం నుంచి ఆ పార్టీ బయటపడలేదు… బీజేపీకి అదే బలం…
కొత్తగా జాతీయ పార్టీ హోదా పొందిన ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా దాదాపు రాహుల్‌కు సమానంగా (12 శాతం) ఆదరణ కనిపించడం విశేషమే… బీహార్ సీఎం నితిశ్, తెలంగాణ సీఎం కేసీయార్ ఆరు, అయిదు శాతాలతో ఉన్నారు… పర్లేదు, కేసీయార్‌కు 5 శాతం ఆదరణ అంటే, అది కొట్టిపారేసే అంశమేమీ కాదు…!!
Share this Article