రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా…
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది ఈరోజు వార్త… దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్‌లోనూ వచ్చింది, బహుశా సర్కారే లీకిన వార్త అయి ఉండవచ్చు…
పైకి చెబుతున్న మాట ఏమిటంటే..? కేంద్రం ప్రైవేటీకరణ విధానాల్ని అడ్డుకునే యత్నమట… స్థూలంగా చూస్తే సూపర్ అనిపిస్తోంది కదా… కానీ… ఏ కోణం నుంచి చూసినా సరే తెలంగాణ సమాజానికి ఈ నిర్ణయం హితకారిణి కాదు, పైగా తెలంగాణ సెంటిమెంట్‌కు ఓ మంట…
Ads
ఈ నిర్ణయానికి కారణం ఏమిటి..? ఆంధ్రుల్లో అభిమానం కోసం… తను జాతీయ పార్టీగా మార్చాడు కాబట్టి ఆ పాత టీఆర్ఎస్‌కు రాజకీయ లబ్ధి కోసం… అదే టీఆర్ఎస్ ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేసిందో, ఇప్పుడదే ఆంధ్రులు ప్రేమించడం కోసం తెగవేషాలకు దిగుతోంది… అసలు ఒక పార్టీ రాజకీయ లబ్ది కోసం తెలంగాణ సమాజపు సొమ్ము ఎందుకు ఖర్చు చేయాలి..?
తెలంగాణ జనం వోట్లేసింది తెలంగాణను ఉద్దరించమనే తప్ప ఇన్నాళ్లూ కేసీయార్ తెగద్వేషించిన ఆంధ్రులను అర్జెంటుగా ఉద్దరించాలని కాదు కదా… పోనీ, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ దూకుడును అడ్డుకునేందుకు అంటున్నారు సరే, మరి కేంద్రం నవరత్నాలు సహా కీలకమైన ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరించాలని భావిస్తోంది… మరి వాటినీ కొంటుందా తెలంగాణ సర్కారు..? అంత డబ్బుందా..?
మొత్తం ప్రతిపక్షాల ప్రచారవ్యయాన్ని భరించేంత సొమ్ము ఉండవచ్చుగాక… కానీ అది సొంత డబ్బు… అంతేతప్ప ఉద్యోగుల జీతాలకే కటకటలాడుతున్న తెలంగాణ ప్రభుత్వం దగ్గర అంత సొమ్ముందా..? ఉన్నాసరే, తెలంగాణ కోసం గాకుండా ఇంకెవరి కోసమో ఎందుకు ఖర్చుపెట్టబడాలి..? డబుల్ బెడ్రూం దురవస్థ, నిరుద్యోగ భృతి వంటి పథకాల సమీక్ష జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు… ఓ ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన దురవస్థకు ఎన్నెన్నో ఉదాహరణలు దొరుకుతాయి… ఈ స్థితిలో ఓ నష్టదాయక ప్రభుత్వ ప్లాంటు తెలంగాణకు దేనికి..?
అసలు ప్రైవేటీకరణ స్పిరిట్ ఏమిటి..? ప్రభుత్వం వ్యాపాారం చేయకూడదు, పాలనపరమైన విధులకే పరిమితం కావాలనేది బ్రాడ్ స్పిరిట్… దానికి విరుద్ధంగా, అన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలనేదే బీఆర్ఎస్ జాతీయ విధానమా..? అసలు ఆ పార్టీ జాతీయ విధానమంటూ ఏదైనా ఉందా..? అలాంటప్పుడు ఓంప్రథమంగా నిజాం సుగర్స్ ను ఎందుకు ఉద్దరించకూడదు..? ఒక రాజకీయ పార్టీ అవసరాల కోసం, ఫాయిదా కోసం తెలంగాణ ప్రజలు సొమ్ము ధారబోయాలా..? పంజాబ్ లో రైతు పరిహారాల చెక్కులు, గాల్వాన్ అమరుల కుటుంబాలకు సాయం కూడా ఈ జాబితాలోనివే కదా…
కేసీయార్ మనసుకు ఏది తోస్తే, అది చేస్తే అది తెలంగాణ ప్రజల అభీష్టమా..? కవిత మీద కేసు పెడితే తెలంగాణ తలవంచదు అన్నట్టుగా… చివరగా ఒక మాట… కేసీయార్ చాలా చెబుతాడు, అవుతాయా లేదానేది కాలం చెబుతుంది… నిజంగా కేసీయార్ మనసులో విశాఖ ప్లాంట్ కొనే సంకల్పం ఉంటే లీకుల వార్తలు కావు, అధికారిక వార్తలు, ప్రచార హంగామా ఉండేది… రాజకీయ లబ్ధి ఈ నిర్ణయంతో వచ్చేది శూన్యం… పైగా ఏపీ సీఎం జగన్‌తో గాఢమైన సంబంధాలున్నయ్… తను చేతులెత్తేసిన ఓ ఇష్యూలో కేసీయార్ కలగజేసుకుని… జగన్‌కు చేతకాలేదు, కానీ పొరుగు రాష్ట్ర సీఎం వచ్చి విశాఖ ఉక్కును కాపాడాడు అనే ముద్ర వేసుకోవడానికి జగన్ సిద్ధమేనా..? కేసీయార్‌ను అడ్డుకుంటాడా..? జగన్‌తో తెగదెంపులకు కేసీయార్ రెడీయా..? తెలంగాణ వ్యవహారాల్లో జగన్ వేలు పెట్టినా, కాలు పెట్టినా వోకేనా..?!
Share this Article