.
బీసీలకు సరైన రిజర్వేషన్ల గురించి ఎన్నడూ ఆలోచించని కేసీయార్… పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కుదించిన కేసీయార్… ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి రాష్ట్రపతిని కలుస్తాడనే వార్త నవ్వు తెప్పించింది…
నిజం… గొర్లు, బర్రెలు, చేపల మీద తప్ప… అవీ సవాలక్ష అవినీతి అక్రమాల నడుమ తప్ప… బీసీల గురించి మరేమీ ఆలోచించని కేసీయార్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి ‘అమ్మా, నీదే దయ’ అని అభ్యర్థిస్తాడట…
Ads
ఎందుకు నవ్వొచ్చిందీ అంటే..? కులగణన చేసింది రేవంత్‌రెడ్డి… బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో చట్టం చేసింది రేవంత్‌రెడ్డి… ఢిల్లీలో ధర్నాలు చేసి, ఇండి కూటమి పార్టీల మద్దతు కూడా సమీకరించింది రేవంత్‌రెడ్డి… రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇచ్చీ రద్దు చేసింది బీజేపీ ఒత్తిడి మేరకు…
- సో, ఈ పోరాటం తాలూకు క్రెడిట్ మొత్తం చెందాల్సింది రేవంత్‌రెడ్డికి..! ఇప్పుడు కేసీయార్ పోరాడతాడట… అంటే రేవంత్‌రెడ్డి క్రెడిట్‌ను కాజేసి, హైజాక్ చేసే ఎత్తుగడ… అదీ జరగదు… ఎందుకో చెప్పుకుందాం…
రేవంత్‌రెడ్డికి దక్కాల్సిన క్రెడిట్స్‌ను తను హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్న తీరు మీద తన పార్టీ బీసీ కేడర్‌లోనే అసంతృప్తి ఉంది… పదే పదే బీసీ రిజర్వేషన్లను ప్రస్తావిస్తుంటే అది ప్రజల్లో ఇంకా ఇంకా చర్చ జరిగి, బీసీ రిజర్వేషన్లకు సంకల్పించి, చట్టం చేసి, పోరాడుతున్న రేవంత్ రెడ్డికే జనంలో క్రెడిట్ వస్తుందని బీఆర్ఎస్ బీసీ కేడర్ భావన…
మీడియా మీట్లు, నమస్తేలో డప్పు కథనాలు గాకుండా… జనంలోకి వెళ్లి రేవంత్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేద్దామని కరీంనగర్‌లో ఓ మీటింగు పెట్టుకుంటే… జనం వచ్చే సూచనల్లేవు, చివరకు ఆ ప్రాంత బీసీ మాజీ మంత్రిని ఖర్చు పెట్టుకోవయ్యా అంటే నావల్లకాదు అని తేల్చేశాడట… అపారమైన సాధనసంపత్తి ఉండీ ఇంకా ఇంకా స్థానిక నేతలనే ఖర్చు పెట్టుకొమ్మంటే ఎలా అనేది ఆ పార్టీ నాయకుల అసహనం… సభలో ఏయే బీసీ నాయకులతో మాట్లాడింపజేయాలనే విషయంలోనూ వివాదం తలెత్తినట్టు వార్తలు…
- రెండుసార్లు వాయిదా… ఓసారి భారీ వర్షాల సాకు… సరే, ఇప్పుడు రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేస్తారట… దానికి కేసీయార్ కూడా హాజరవుతాడట… అలా చెబుతున్నారు… కేసీయార్ జనంలోకి, ప్రజాజీవనంలోకి రాడు, ఏడాదిన్నరగా అంతే… తనను ఇంతవాడిని చేసిన జనం మీదే కోపం… అదేం ధోరణో… పోనీ, ఢిల్లీకి వెళ్తాడనే అనుకుందాం…
ఆల్రెడీ అధికారంలో ఉండీ, ఆ చట్టం చేసిన కాంగ్రెస్ నాయకులు అపాయింట్‌మెంట్ అడిగితేనే, ఇచ్చీ వెంటనే రద్దు చేసిందట రాష్ట్రపతి ఆఫీసు… దానికి బీజేపీ నేతలు అడ్డుపడ్డారని టాక్… అలాంటిది ఆ చట్టంతో ఏ సంబంధమూ లేని బీఆర్ఎస్ అడగ్గానే… ఆల్రెడీ కాంగ్రెస్‌కు నిరాకరించిన అపాయింట్‌మెంట్ వీళ్లకు ఇస్తారా..?
కేవలం ఆమెను కలిసి, ప్రచారం చేసుకుని, మేమూ బీసీ రిజర్వేషన్లకు పోరాడుతున్నాం అనే కలర్ ఇచ్చి, స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఫాయిదా తీసుకోవాలని ప్లాన్… ఆ ప్రయత్నాలకు సహకరించడానికి బీజేపీతో ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు, సయోధ్యలు ఉన్నాయా..? లేవు కదా..! విడిగా కవిత చేసినంత హంగామా కూడా కేటీయార్ వల్ల కాలేదు… పార్టీలోనే ఈ విషయంలో గందరగోళం…
- కాంగ్రెస్ ధర్నాకు పలువురు ఇండి కూటమి నేతలు హాజరై మద్దతు పలికారు… కేసీయార్ వెళ్తే ఎవరూ రారు… తను ఢిల్లీలో అప్పుడెప్పుడో రైతు దీక్ష చేస్తేనే ఎవరూ రాలేదు… తనకు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ అది… ఇండి కూటమి దగ్గరకు రానివ్వదు… ఎన్డీయే అసలే రానివ్వదు… ఏకాకి పార్టీ అది ఇప్పుడు…
సరే, రాష్ట్రపతి గతాన్ని ఏమీ పట్టించుకోదు, అప్పటి ఆమె ఎన్నికకూ, బీఆర్ఎస్ ప్రదర్శించిన పోకడకూ ఈ అపాయింట్‌మెంట్‌కూ సంబంధం లేదు గానీ… కేసీయార్‌కు కూడా గుర్తుందో లేదో గానీ… ఒక ఆదివాసీ మహిళకు ఈ దేశ అత్యున్నత పదవి రావడానికి అడ్డం పడే ప్రయత్నం చేశాడు కేసీయార్…
- ఆమె ప్రత్యర్థి, ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాదులో పెద్ద స్వాగతం పలికి, హంగామా క్రియేట్ చేశాడు… (అదే సమయంలో ప్రధాని మోడీ వస్తేనేమో తలసానిని పంపించాడు, తను అవాయిడ్ చేశాడు… 2022 జూలై…) ఒక ఆదివాసీ మహిళ ఆ కుర్చీలోకి రాకుండా అడ్డుపడుతున్నాడనే విమర్శలు అప్పట్లోనే బోలెడు…
మరోవైపు మరో మహిళ తమిళిసై సౌందర్‌రాజన్‌ను అడుగడుగునా అవమానించాడు… మోడీ మీద విషం సరేసరి… తరువాత ఏదో డ్రామా, ఏదో స్కిట్ క్రియేట్ చేసి, ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శినే అరెస్టు చేయాలని ప్రయత్నాలు, కేసులు, దేశవ్యాప్తంగా ఫేక్ వీడియోల పంపిణీ… ఇప్పుడదే మోడీ కావాలి, అనుమతిస్తే బీజేపీలో పార్టీనే విలీనం చేయాలని ఏదో తహతహ… హేమిటో ఇదంతా..!!
(అప్పట్లో ఇలా వచ్చేవి వార్తలు కొన్ని…)
Share this Article