నీ పాలన దుర్మార్గం, నువ్వు ప్రజావ్యతిరేకంగా పాలిస్తున్నవ్, నీ పార్టీ అనేక బలిదానాలకు కారణం, తెలంగాణ అనేది నీ పార్టీ దయాభిక్ష కాదు, అస్తిత్వ చిహ్నాలను అవమానిస్తున్నవ్….. ఇలా అనేకానేక నిందారోపణలతో మాజీ సీఎం కేసీయార్ సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాశాడు…
తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీయారే… అందులో డౌట్ లేదు, ఎవడూ వ్యతిరేకించరు… కానీ ఓ రేంజ్ క్రెడిట్ సొంతం చేసుకున్న తను కీలకమైన దశాబ్ది ఉత్సవం సందర్భంలో… రాజధాని సహా అన్ని బంధాలూ ఆంధ్రాతో తెగిపోయి, ఇక తెలంగాణ సంపూర్ణ విముక్తి పొందుతున్న సందర్భంలో… తన లేఖ తన స్థాయికి తగినట్టు హుందాగా లేదు… ఇది నిజం… ఎందుకంటే..?
ఒక ప్రతిపక్ష నేతగా కేసీయార్‌ను గౌరవిస్తూ (మనసులో ఏ ఫీలింగ్స్ ఉన్నా సరే)… అధికారిక ఉత్సవాలకు రమ్మని లేఖ రాశాడు రేవంత్ రెడ్డి… అంతేగానీ నేరుగా ఇంటికి వచ్చి, బొట్టు పెట్టి ఆహ్వానించలేడు కదా… కేసీయార్ వెళ్తాడని ఎవరూ అనుకోరు, అంతటి హూందా, టవరింగ్ పాలిటిక్స్ ప్రస్తుతం ఊహించలేం… పైగా తను కేసులు పెట్టి, వేధించి, ఓ బచ్చాగాడిలా ట్రీట్ చేసిన రేవంత్‌రెడ్డికి పోలీసులు గౌరవ వందనం చేస్తుంటే, ఒక ప్రేక్షకుడిగా కేసీయార్ చూస్తూ కూర్చోగలడా…? కేసీయార్ అంటే అహం… ఆ అహం ఊరుకుంటుందా..? సో, తప్పకుండా అవాయిడ్ చేస్తాడు, చేస్తున్నాడు…
Ads
ఐతే తను రాసిన లేఖ బాగా లేదు… ఎస్, రేవంత్ రెడ్డి పాలన పలు విషయాల్లో ప్రజలకు నచ్చడం లేదు… విత్తనాలు, కరెంటు, తాగునీరు సహా చివరకు ఎండాకాలంలో తాగే బీర్లకు సంబంధించి కూడా వైఫల్యాలున్నయ్… వాటికి చాలా కారణాలున్నయ్… వాటిని ప్రస్తావిస్తూ, ఓ ఎన్నికల ప్రసంగంలా ఓ లేఖ రాయడం ఏ రాజనీతి..? ఏం పరిణతి..?
ఇక్కడ కొన్ని ప్రధానమైన విషయాల్ని కేసీయార్‌కు గుర్తుచేయాలి… తెలంగాణ వచ్చాక కేసీయార్ కుటుంబంలోని పిల్లాపీచూ, ముసలీముతకా అందరూ సోనియా నివాసానికి వెళ్లారు… ఆ ఫోటో గుర్తుందా కేసీయార్ సార్..? ఇదుగో అదే ఇది…
కృతజ్ఞతలు చెప్పావు సరే… నేరుగా అసెంబ్లీలోనే సోనియా వల్లే తెలంగాణ సాకారం అయ్యిందనీ ప్రకటించావు, అదీ గుర్తుందో లేదో గానీ… మరిప్పుడు ఈ అక్షేపణలేమిటి..? కాంగ్రెస్ దయాభిక్ష కాదు, అమరుల పాపం కాంగ్రెస్‌దే అనే ప్రకటన ఏమిటి..? పైగా ఈ కీలకమైన తెలంగాణ పోరాట స్మరణ సందర్భంలో ప్రత్యర్థి పార్టీ మీద ఈ దుమ్ముదుమారం, బురదజల్లుడు దేనికి..?
ఇది ప్రతి తెలంగాణవాది గర్వంగా తలెగరేయాల్సిన సందర్భం… ఇందులో కూడా రాజకీయ మకిలి అవసరమా..? పైగా 1969 పోరాటం నాటి అమరులను ఉదహరిస్తూ కాంగ్రెస్‌ను తాజాగా కార్నర్ చేయడం ఏమిటి..? ఇన్నేళ్లూ ఈ మాటలెందుకు రాలేదు కేసీయార్ నోటివెంట..! మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని అన్నదెందుకు..? ఆ ప్రయత్నాలెందుకు జరిగాయి..? అలాంటి దుష్ట కాంగ్రెస్ పాార్టీలో నువ్వూ నిమజ్జనం కావాలని ఎందుకు కోరుకున్నట్టు..?
తనకు పెత్తనం ఇస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ఈసారి ఎన్నికల ఖర్చు భరించడానికి కేసీయార్ సిద్ధపడ్డట్టుగా ఎవరో జర్నలిస్టు వెల్లడించాడు… కాంగ్రెస్ పార్టీకి ఆర్థికసాయం చేశాడని బీజేపీ కూడా సందేహిస్తోంది… మరి అలాంటి నీ దోస్త్ పార్టీని ఇప్పుడు, ఈ సందర్భంలో ఎత్తిపొడుస్తూ ఈ ప్రకటనలు దేనికి..?
కనీసం ప్రతిపక్ష నేతగా గుర్తించి, రమ్మని లేఖ రాశాడు కదా రేవంత్… యాదాద్రి ప్రారంభాన్ని కేసీయార్ ఓ సొంత పార్టీ కార్యక్రమంగా నిర్వహించిన తీరు కూడా ఓసారి గుర్తుచేసుకోవాలి… అది దేవుడి కార్యక్రమమా..? కేసీయార్ కార్యక్రమమా..? అసలు ప్రతిపక్షాలను ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా గౌరవించి, అభిప్రాయాలు తీసుకున్న ఉదాహరణ ఉందా..? ప్చ్, రేవంత్‌రెడ్డికి కేసీయార్ లేఖ సమంజసంగా లేదు, సమర్థనీయంగా లేదు, తెలంగాణ వాస్తవ మర్యాదలకూ లోబడి లేదు… రాజకీయ మర్యాదల వాసనే లేదు..!!
Share this Article